India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్‌ కౌంటర్‌

అరుణాచల్ ప్రదేశ్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమని చైనాకు విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది.

Published : 19 Mar 2024 16:13 IST

దిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా (China) మొండి వాదనలు మానడం లేదు. దక్షిణ టిబెట్‌ (జాంగ్నాన్‌) తమ భూభాగంలోనిదేనని ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్‌ కర్నల్‌ ఝాంగ్‌ షియాంగాంగ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. దీన్ని భారత్‌ తాజాగా తిప్పికొట్టింది. అరుణాచల్‌ తమ దేశంలో విడదీయరాని భాగమని, నిరాధార వాదనలను వల్లె వేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్‌కు మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను చైనా ‘జాంగ్నాన్‌’గా పేర్కొంటోంది.

‘‘అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా రక్షణ శాఖ ప్రతినిధి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను గమనించాం. ఈ వ్యవహారంలో నిరాధార వాదనలను పునరావృతం చేయడం ద్వారా.. అవి వాస్తవాలుగా మారిపోవు. ఆ ప్రాంతం ఎల్లప్పుడూ మా దేశంలో అంతర్భాగం. మా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారు’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘అరుణాచల్‌ ప్రదేశ్‌’పై.. చైనా సైన్యం మరోసారి కారుకూతలు!

చైనా- భారత్‌ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల ప్రారంభించారు. అయితే.. అది తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని బీజింగ్‌ ఇటీవల నోరుపారేసుకుంది. డ్రాగన్‌ సైన్యం సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేసింది. రెండు సందర్భాల్లోనూ భారత విదేశాంగ శాఖ దీటుగా బదులిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని