Ukraine Crisis: రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రూబుళ్ల వినియోగానికి యత్నాలు..!

ఆక్రమిత ప్రాంతాల్లో బ్యాంక్‌ వ్యవస్థను కూడా  పూర్తిగా తనలో విలీనం చేసుకోవడానికి రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఖెర్సాన్‌ నగరంలో రష్యా దళాలు రూబుళ్లను ప్రవేశపెట్టాయి.

Published : 01 May 2022 11:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆక్రమిత ప్రాంతాల్లో బ్యాంక్‌ వ్యవస్థను కూడా  పూర్తిగా తనలో విలీనం చేసుకోవడానికి రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఖెర్సాన్‌ నగరంలో రష్యా దళాలు రూబుళ్లను ప్రవేశపెట్టాయి. ఇప్పటికే నగరంలో ఉక్రెయిన్‌ కరెన్సీ హ్రైవ్నియా కూడా చలామణిలో ఉంది. ఈ నగరం నుంచి 40 శాతం మంది ప్రజలు వలసపోగా.. మిగిలిన వారు ఏదో ఒక కరెన్సీ అమల్లో ఉంటే కొంత స్థిరత్వం వస్తుందని భావిస్తున్నారు. ఈ నగరంలో కొంత మందికి రష్యా కరెన్సీలో పింఛన్లు ఇవ్వడంతో వారు వాటిని స్థానికంగా అందుబాటులో ఉన్న హ్రైవ్నియాల్లోకి మార్చి వాడుకొంటున్నారు. ఈ గందరగోళంతో అక్కడ చెల్లింపులు కూడా కష్టమైపోయాయని ఈ నగర మాజీ మేయర్‌ ఇగోర్‌ ఖోలీఖైవ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని ఆక్రమించాక రష్యా దళాలు ఆయన్ను గద్దె దింపి కొత్త పాలకులను నియమించాయి. కరెన్సీ సమస్య కారణంగా రెండు నెలల నుంచి ఇక్కడి సూపర్‌ మార్కెట్లు ఖాళీగా ఉండగా.. రెస్టారెంట్లు, షాపులు మూతపడ్డాయి.

ఇగోర్‌ ఇటీవల ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రష్యన్లు ఖెర్సాన్‌లో విజయవంతంగా రూబుళ్లను చలామణి చెయించడం సందేహాస్పదమే. అవి ఎప్పుడు వస్తాయో.. ఇక్కడ ఉన్న ఉక్రెయిన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎప్పుడు పనిచేయడం ఆపేస్తుందో చెప్పలేం. రష్యా అధినేత మైండోలో ఏముందో కనిపెట్టలేం. ఇక్కడ రూబుల్‌ జోన్‌ వస్తే..1992 ముందు నాటి పరిస్థితుల్లోకి జారుకొంటాం’’ అని పేర్కొన్నారు.

ఖైర్సాన్‌లో రెఫరెండం..?

రష్యా ఆక్రమిత ఖెర్సాన్‌  ప్రాంతంలో త్వరలోనే రెఫరెండం చేపట్టవచ్చని ఉక్రెయిన్‌ అనుమానిస్తోంది. ఈ ప్రాంతాన్ని అధికారికంగా విలీనం చేసుకోవడానికే ఇలా చేస్తుందని భావిస్తోంది. గతంలో 2014లో క్రిమియాను ఆక్రమించుకొన్న తర్వాత కూడా రెఫరెండం నిర్వహించారు. ఇటీవల డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ల్లో రెఫరెండం పూర్తి చేశారు.

* ఖెర్సాన్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి వెళ్లే మార్గాలను రష్యన్లు మూసివేశారు. ఇప్పుడు కేవలం క్రిమియాలోకి వెళ్లేందుకే మాత్రమే రోడ్డు మార్గం తెరిచి ఉంది. 

పుతిన్‌ ప్రయత్నాలు ఫలించి..

పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా కరెన్సీ రూబుల్‌ విలువ పడిపోకుండా కాపాడేందుకు అధ్యక్షుడు పుతిన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో రూబుల్‌ విలువ డాలర్‌తో పోలిస్తే రెండేళ్ల అత్యధికానికి చేరింది. ఏప్రిల్‌ 6న రుణదాతలకు డాలర్లలోనే చెల్లిస్తామని రష్యా వెల్లడించాక ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది రష్యా 565 మిలియన్‌ డాలర్లు విలువైన యూరోబాండ్లకు, 2024న మెచ్యూరిటీ తేదీ ఉన్న మరో 84 మిలియన్‌ డాలర్ల  బాండ్లకు సంబంధించిన చెల్లింపులను డాలర్లలోనే ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది. కాకపోతే ఈ చెల్లింపులు 30 రోజుల గ్రేస్‌ పిరియడ్‌లో చేసినట్లు సమాచారం. 

పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించగానే రష్యా ఆర్థిక శాఖ కీలక చర్యలు చేపట్టింది. వడ్డీ రేట్లను పెంచడం, రష్యన్‌ బ్రోకర్లు రూబుల్స్‌ విక్రయాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు గ్యాస్‌-చమురు చెల్లింపులు రూబుల్స్‌లో చేసేలా చర్యలు తీసుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని