Russia: చంద్రుడిపై అణువిద్యుత్తు ప్లాంట్‌.. చైనాతో కలిసి రష్యా సన్నాహాలు!

Russia: తమ అంతరిక్ష ప్రణాళికల్లో భాగంగా రష్యా కీలక ప్రకటన చేసింది. భవిష్యత్తులో మానవ నివాసం సాధ్యమయ్యేలా చంద్రుడిపై అణు విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపింది. అందుకోసం చైనాతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. 

Updated : 06 Mar 2024 11:04 IST

మాస్కో: చంద్రుడిపై అణువిద్యుత్తు ప్లాంట్‌ (Nuclear power plant)ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు రష్యా స్పేస్‌ ఏజెన్సీ రాస్‌కాస్మోస్‌ (Roscosmos) అధిపతి యూరీ బోరిసోవ్‌ తెలిపారు. దీనికోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా చంద్రుడి (Moon)పై నివాసాల ఏర్పాటు సాధ్యమయ్యే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రష్యా, చైనా సంయుక్తంగా ఈ లూనార్‌ ప్రోగ్రామ్‌పై పనిచేస్తున్నట్లు బోరిసోవ్‌ వెల్లడించారు. ‘న్యూక్లియర్‌ స్పేస్‌ ఎనర్జీ’లో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతోందని తెలిపారు. ‘‘చంద్రుడిపై 2033-35 నాటికి అణువిద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనా శాస్త్రవేత్తలతో కలిసి చాలా సీరియస్‌గా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్‌ ప్యానెళ్లు అందించలేవు. అణువిద్యుత్తుతోనే అది సాధ్యమవుతుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు మాకు ఒక సవాల్‌తో కూడుకున్నది. మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌ మోడ్‌లో అది పనిచేయాల్సి ఉంటుంది’’ అని బోరిసోవ్‌ వివరించారు.

అణువిద్యుత్తు ఆధారంగా పనిచేసే కార్గో స్పేస్‌షిప్‌ను సైతం తయారుచేయడానికి రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బోరిసోవ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యూక్లియార్‌ రియాక్టర్‌ను చల్లబరచటంతో పాటు అన్ని సాంకేతిక సవాళ్లకు పరిష్కారం కనుగొన్నట్లు తెలిపారు. ‘‘మేం ఒక స్పేస్‌ టగ్‌బోట్‌పై పనిచేస్తున్నాం. ఇదొక భారీ నిర్మాణం. న్యూక్లియర్‌ రియాక్టర్లు, శక్తిమంతమైన టర్బైన్లతోనే అది సాధ్యమవుతుంది. అంతరిక్షంలో ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యలోకి భారీ కార్గోను రవాణా చేయడమే కాకుండా.. అంతరిక్ష వ్యర్థాలను సేకరించే సామర్థ్యమూ ఉండేలా దీన్ని రూపొందిస్తున్నాం’’ అని బోరిసోవ్‌ వివరించారు.

అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఆయుధాన్ని రష్యా ఇంకా మోహరించలేదని, ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. ఎప్పటికప్పుడు దీనిపై శ్వేతసౌధం దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల స్పందించారు. అంతరిక్షంలో అణ్వాయుధాలను ప్రవేశపెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ నేపథ్యంలో రష్యా స్పేస్‌ ఏజెన్సీ నుంచి వెలువడిన తాజా ప్రకటనతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని