Alexei Navalny: ‘నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాచిపెడుతున్నారు’

Alexei Navalny: అలెక్సీ నావల్నీ మరణవార్తను ఆయన తల్లికి అధికారికంగా తెలియజేసిన జైలు అధికారులు ఇప్పటి వరకు మృతదేహాన్ని మాత్రం అప్పగించలేదు. 

Updated : 18 Feb 2024 15:15 IST

మాస్కో: రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన మరణవార్తను అధికారికంగా తెలిసిన వెంటనే ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో ఉన్న జైలుకు ఆమె వెళ్లారు. కానీ, అప్పటికే మృతదేహాన్ని సమీపంలోని సలేఖార్డ్‌ నగరానికి తరలించినట్లు చెప్పారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ప్రాథమిక శవపరీక్షలో ఎలాంటి ఫలితం తేలలేదని.. రెండోసారి చేయాల్సి ఉంటుందని అక్కడి అధికారులు చెప్పినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్‌ వెల్లడించారు.

నావల్నీ (Alexei Navalny) మృతదేహాన్ని కావాలనే దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరణానికి దారితీసిన అవశేషాలను శరీరంలో నుంచి తుడిచిపెట్టాలనే అలా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నావల్నీ ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:17 గంటలకు మరణించినట్లు ఆయన తల్లికి తెలియజేశారు. ‘సడెన్‌ డెత్‌ సిండ్రోమ్‌’ వల్లే మృతిచెందారని పేర్కొన్నారు. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా గుండెపోటుతో ఆకస్మిక మరణానికి దారితీసే స్థితిని ఈ విధంగా వ్యవహరిస్తారు.

నావల్నీకి నివాళులర్పించిన దాదాపు 100 మందిని రష్యా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరోవైపు ఆయన మృతిపై ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. దీని వెనుక అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందని ఆరోపించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని