Russia: 81 క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. అణువిద్యుత్తు కేంద్రానికి పవర్‌ కట్‌..!

రష్యా(Russia) దళాలు మరోసారి ఉక్రెయిన్‌(Ukraine)పై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. దాదాపు 81 క్షిపణులను ఈ క్రమంలో ప్రయోగించారు.  

Published : 09 Mar 2023 16:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) క్షిపణుల వర్షం కురిపించింది. ఒక్క రోజులో వివిధ నగరాలపై 81క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ రక్షణశాఖ ధ్రువీకరించింది. తాము 34 క్షిపణులను, షాహిద్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. రష్యా ల్వీవ్‌పై చేసిన రాకెట్‌ దాడిలో కనీసం ఐదుగురు మరణించారు. మరోవైపు డెనిప్రోపెట్రోవస్క్‌ పై జరిగిన క్షిపణి దాడిలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

ఇక జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రానికి ఉక్రెయిన్‌ విద్యుత్తు వ్యవస్థకు మధ్య ఉన్న చివరి సంబంధం తెగిపోయింది. ఈ కేంద్రం వద్ద దాడి జరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని అణుకేంద్రం నిర్వహిస్తున్న ఎనర్గోఆటమ్‌ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. మాస్కో ఆధీనంలోని జపోరిజియా నగరంలోని రష్యా అధికారులు మాట్లాడుతూ ఈ అణువిద్యుత్తు కేంద్రానికి ఉక్రెయిన్‌ విద్యుత్తు సరఫరా నిలిపివేయడం కవ్వింపు చర్యే అని పేర్కొన్నారు.

నేడు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని పశ్చిమ, దక్షిణ భాగాలపై రష్యా దాడులు నిర్వహించింది. ఈ దాడిలో చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలని కీవ్‌ మేయర్‌ అభ్యర్థించారు. నగరంలో ప్రతి 10 ఇళ్లలో నాలుగు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 

రేవు నగరమైన  ఒడెస్సాలో విద్యుత్తు వ్యవస్థలపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ఇళ్లపై కూడా క్షిపణులు కూలినట్లు వార్తలొస్తున్నాయి. కానీ, ప్రాణనష్టం జరగలేదు. ఖర్కీవ్‌ నగరంపై రష్యా 15 క్షిపణులను ప్రయోగించింది. జనావాసాలు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయి.  

జనవరి తర్వాత ఉక్రెయిన్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ యుద్ధాన్ని కొన్నేళ్లపాటు సాగదీస్తాడని అమెరికాకు చెందిన నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ ఆవ్రియల్‌ హైనస్‌ వెల్లడించారు. సరికొత్తగా భారీ దాడులు చేసే సామర్థ్యం రష్యాలో తగ్గిపోయిందని ఆమె విశ్లేషించారు.రష్యా సైన్యం తిరిగి పుంజుకోవడానికి అమెరికా సహకరించదని.. అదే సమయంలో పుతిన్‌ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తాడని వెల్లడించారు. ఈ క్రమంలో విరామాలతో కూడిన సుదీర్ఘ యుద్ధం మాత్రమే ఆయన ఎదుట ఉన్న అత్యుత్తమ మార్గమన్నారు. బక్ముత్‌ నగరంపై ఆధిక్యం కోసం కొన్ని నెలలుగా రష్యా సేనలు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నాయి. తాజాగా ఈ నగరంలో కొన్ని విజయాలు సాధించి.. ముందడుగు వేశాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని