Ukraine war: యుద్ధం పేరుతో ఎవర్నీ చంపలేను.. సైన్యంలో చేరలేక రష్యన్‌ ర్యాపర్‌ ఆత్మహత్య..!

నిర్బంధ సైనిక సమీకరణలో భాగంగా.. సైన్యంలో చేరాలంటూ నోటీసులు అందుకున్న ఓ రష్యన్‌ ర్యాపర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగుచూసింది.

Updated : 04 Oct 2022 20:18 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని (Ukraine Crisis) తీవ్రతరం చేసేందుకు సన్నద్ధమవుతోన్న రష్యా.. నిర్బంధ సైనిక సమీకరణను (Military mobilisation) ముమ్మరం చేస్తోంది. దీనిపై రష్యా పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సైన్యంలో చేరాల్సి వస్తుందనే భయంలో ఎంతోమంది పౌరులు ఇప్పటికే దేశాన్ని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సైన్యంలో చేరాలంటూ నోటీసులు అందుకున్న ఓ రష్యన్‌ ర్యాపర్‌ (Russian Rapper) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏ వ్యక్తినీ చంపడానికి తాను సిద్ధంగా లేనని పేర్కొంటూ అతడు తనవు చాలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇవాన్‌ విటలీవిచ్‌ పెటునిన్‌ అనే 27ఏళ్ల రష్యా ర్యాపర్‌.. వాకీ పేరుతో స్టేజిషోలు నిర్వహించేవాడు. సెప్టెంబర్‌ 30న బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. క్రాస్నోడార్‌ నగరంలోని ఓ భారీ భవనం 10వ అంతస్తు నుంచి దూకి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇవాన్‌ ఆత్మహత్యను అతడి తల్లి, ప్రియురాలు ధ్రువీకరించారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే, సైన్యంలో చేరాలంటూ ఆ యువకుడికి నోటీసులు రావడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సెల్ఫీ వీడియో ద్వారా అర్థమవుతోందని ‘న్యూయార్క్‌ పోస్ట్‌’ పేర్కొంది.

న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. ‘యుద్ధం పేరుతో ఎవర్నీ చంపడానికి సిద్ధంగా లేను. హత్య చేసిన పాపాన్ని మోయలేను. అలా కోరుకోవడం లేదు. ప్రస్తుతం పాక్షిక సైనిక సమీకరణ అని చెబుతున్నప్పటికీ మరికొన్ని రోజుల్లో అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. పుతిన్‌ ఒక ఉన్మాది. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను సజీవంగా ఉండను’ అంటూ ఆత్మహత్యకు ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోలో ఇవాన్‌ పేర్కొన్నాడు. అయితే, గతంలో రష్యా సైన్యంలో పనిచేసిన ఇవాన్‌.. మానసిక చికిత్స కూడా తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉంటే, ఉక్రెయిన్‌పై సైనిక చర్య ముమ్మరం చేసేందుకు గాను దేశంలో సైనిక సమీకరణ చేపడుతున్నట్లు సెప్టెంబర్‌ 21న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. అనంతరం గతంలో సైన్యంలో పనిచేసిన అనుభవమున్న వారితోపాటు వివిధ రంగాల్లోని యువకులకు సైన్యంలో చేరాలంటూ నోటీసులు పంపిస్తున్నారు. ఇందుకు సిద్ధంగా లేని రష్యన్‌ పౌరులు ఏకంగా దేశాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ ఇలా సుమారు 2లక్షల మంది రష్యన్లు సమీప దేశాలైన జార్జియా, ఫిన్లాండ్‌, కజక్‌స్థాన్‌లకు వెళ్లిపోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు