Budget 2024: ‘ఐమెక్‌’ ప్రపంచ వాణిజ్యానికే జీవనాడి.. అసలేమిటా ప్రాజెక్టు..?

24 గంటల వ్యవధిలోనే రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి ఐమెక్‌ ప్రాజెక్టును భారత్‌కు అత్యంత కీలకమైందిగా అభివర్ణించారు. దీంతో ఈ ప్రాజెక్టుకు ఎందుకింత ప్రాధాన్యమని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Published : 01 Feb 2024 18:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఐమెక్‌ ప్రాజెక్టును భారత్‌ గడ్డపై ప్రారంభించినట్లు చరిత్రలో గుర్తుండిపోతుంది’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. అంతకుముందు రోజు పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ ఈ కారిడార్‌ దేశ సముద్ర రవాణా మార్గ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందన్నారు. అసలేమిటీ ‘ఐమెక్‌’? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది ? ప్రపంచ వాణిజ్యానికి ఇది జీవనాడి అవుతుందని ఎందుకంటున్నారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.  

ఏమిటీ ప్రాజెక్టు..

భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు అక్కడి నుంచి ఇజ్రాయెల్‌ మీదుగా ఐరోపాలోకి సరకు రవాణాకు వీలుగా ఐమెక్‌ ప్రాజెక్టును ప్లాన్‌ చేశారు. జీ7 సభ్యదేశాలు  చేపట్టిన ‘ది ప్రాజెక్టు ఫర్‌ గ్లోబల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ (పీజీఐఐ)లో ఇది భాగం. గతేడాది జీ20 సదస్సు సందర్భంగా ఈ ఆలోచన ప్రాణం పోసుకొంది. సెప్టెంబర్‌లో న్యూదిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై భారత్‌, అమెరికా, యూఏఈ, సౌదీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా సమాఖ్య, ఇటలీ సంతకాలు చేశాయి.

భారత్‌లో మొదలయ్యే నడవా నుంచి యూఏఈ, సౌదీ, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌, గ్రీస్‌ మీదుగా ఐరోపాలోని ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీకి సరకులు చేరుకొంటాయి. మన దేశం నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లే దానిని తూర్పు కారిడార్‌ అని..  అక్కడి నుంచి ఐరోపాకు వెళ్లే మార్గాన్ని ఉత్తర నడవాగా విభజించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రైలు-జల మార్గాలను వినియోగిస్తారు. అందుకే దీనిని ‘ఐమెక్‌’ (ఇండియా-మిడిల్‌ ఈస్ట్‌- ఐరోపా ఆర్థిక నడవా) అని అంటారు. భారత్‌లో ముంద్రా, కాండ్లా, నవీముంబయి పోర్టులు దీనిలో భాగం. ఆసియా-ఐరోపా మధ్య జల, రైలు మార్గాల్లో సంబంధాలను బలోపేతం చేయాలన్నదే దీని లక్ష్యం. 

‘టార్గెట్‌ లక్షద్వీప్‌’ దిశగా బడ్జెట్‌లో అడుగులు..!

ఈ ప్రాజెక్టులో భాగస్వామ్య దేశాలు విద్యుత్తు లైన్లను, డిజిటల్‌ కనెక్టివిటీ, రైలు మార్గాల వెంబడి స్వచ్ఛ హైడ్రోజన్‌ ఎగుమతులకు వీలుగా పైపులైన్‌ వేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ రవాణా మార్గాలకు అవసరమైన అన్ని ఏర్పాట్ల కోసం సమష్టిగా, వేగంగా పనిచేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

సమయం ఆదా..

ఇది వాస్తవిక రూపం ధరిస్తే భాగస్వామ్య దేశాల రవాణా సామర్థ్యం మెరుగుపడటం, ఖర్చు తగ్గడం, ఆయా దేశాల మధ్య ఆర్థిక బంధం బలపడటం, కొత్త ఉద్యోగాల సృష్టి, కర్బన ఉద్గారాల తగ్గుదల వంటి ప్రయోజనాలున్నాయి. ముంబయి నుంచి బయల్దేరిన సరకులు పది రోజుల్లోపే ఐరోపా భూభాగానికి చేరుకొంటాయి. సూయజ్‌ మార్గంతో పోలిస్తే 40శాతం తక్కువ సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్ని దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలుండటం మరో సానుకూలాంశం.   

చాలా మార్గాలకు ప్రత్యామ్నాయం..

ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సూయజ్‌ కాల్వ, తుర్కీయేలోని బొస్పరస్‌, డార్డనెల్లెస్‌ జలసంధులను వాడాల్సిన అవసరం ఉండదు. మరోవైపు చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ కార్యక్రమానికి దీనిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. తరచూ అంతర్జాతీయ ఘర్షణల్లో తలదూర్చే ఇరాన్‌ మీదుగా వెళ్లే ఇంటర్నేషనల్‌ నార్త్‌-సౌత్‌ ట్రాన్సిట్‌ కారిడార్‌ ప్రాధాన్యం కూడా తగ్గిపోతుంది. 

ప్రధాన అడ్డంకి..

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీని కారణంగా సౌదీ-ఇజ్రాయెల్‌ ఒప్పందం ఆగిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని