South Korea: తొక్కిసలాట మృతుల సంఖ్య 151.. ఘటనకు కారణం అదేనా?

South Korea: దక్షిణ కొరియాలో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. చనిపోయిన వారిలో చాలా మంది దాదాపు 20 ఏళ్ల వయసున్నవారేనని సమాచారం.

Updated : 30 Oct 2022 12:19 IST

సియోల్‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. మరో 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఏటా జరిగే హాలోవీన్‌ వేడుకలకు దాదాపు లక్ష మంది హాజరైనట్లు సమాచారం. సమీపంలోని బార్‌కు ఒక సినీతార వచ్చారనే సమాచారంతో అక్కడకు వెళ్లేందుకు ఒకేసారి అనేకమంది ప్రయత్నించడమే తొక్కిసలాటకు కారణమని స్థానిక ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. పైగా ఇరుకు సందు నుంచి ఒకేసారి పరిగెత్తడంతో అనేక మంది కిందపడిపోయి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, ఘటనకు గల కారణం, మృతుల సంఖ్యను ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.

ఘటన తర్వాత అనేక మంది వీధుల్లో అపస్మారక స్థితిలో పడి ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది సహా ఇతర వలంటీర్లు వెంటనే వారికి సీపీఆర్‌ చేశారు. చనిపోయిన, క్షతగాత్రుల్లో చాలామంది వయసు 20 ఏళ్లకు అటుఇటుగా ఉంటుందని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 19 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే వారు ఏ దేశానికి చెందినవారన్నది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కొవిడ్‌-19 పూర్తి స్థాయి ఆంక్షల్ని తొలగించడంతో వేడుకలకు యువకులు భారీ ఎత్తున హాజరయ్యారు. హాలోవీన్‌ జరిగే ఇటేవాన్‌ ప్రాంతంలో చాలా బార్లు, క్లబ్బులు, షాపింగ్‌ కాంప్లెక్సులు ఉంటాయి. ఈ నేపథ్యంలో యువకులు భారీ ఎత్తున వేడుకలకు హాజరవుతుంటారని తెలుస్తోంది.

సంఘటనా స్థలాన్ని దేశ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ సందర్శించారు. ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. జాతీయ జెండాలను అవనతం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించేందుకు సహాయం చేస్తామన్నారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపై సమీక్ష జరపాలని అధికారులకు సూచించారు.

ఘటన జరగడానికి ముందు, తర్వాత పరిస్థితిని తెలియజేసే అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇరుకుగా ఉన్న వీధుల్లో యువకులు ఇరుక్కుని ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడుతున్న దృశ్యాలు భయానికి గురిచేస్తున్నాయి. మరోవైపు ఘటన తర్వాత పెద్ద ఎత్తున సహాయక సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్నవారికి సీపీఆర్‌ చేస్తున్న దశ్యాలూ కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని