Corona Virus: ఈ పూతతో కరోనాసహా క్రిములన్నీ ఖతం.. ఆర్నెల్లయినా సురక్షితం!

హానికారక సూక్ష్మక్రిములు(Germs).. అనేక వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. తాకే తెరలు(Touch Screens), కీ బోర్డులు, మొబైల్ స్క్రీన్లు, పరికరాలు, ఇతర...

Updated : 22 Nov 2022 15:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హానికారక సూక్ష్మక్రిములు(Germs).. అనేక వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. తాకే తెరలు(Touch Screens), కీ బోర్డులు, మొబైల్ స్క్రీన్లు, పరికరాలు, ఇతర వస్తువుల ఉపరితలాలను తాకినా.. వాటి సంక్రమణకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే యాంటీ బ్యాక్టీరియల్‌ క్లీనర్‌లు అందుబాటులో ఉన్నా.. తక్కువ సమయంలోనే అవి పనిచేయకుండా పోవడం లేదా నెమ్మదైన పనితీరు వంటి లోపాలున్నాయి. ఈ సమస్యలకు చెక్‌ పెడుతూ.. మన్నికైన, నెలల తరబడి సమర్థంగా పనిచేసే ఓ క్రిమిసంహారక పూతను మిషిగన్‌ విశ్వవిద్యాలయ(University of Michigan) పరిశోధకులు అభివృద్ధి చేశారు. పరిశోధనా వివరాలు ‘మ్యాటర్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కరోనాకారక సార్స్‌ కొవ్‌ 2, ఈ-కొలి, ఎంఆర్ఎస్‌ఏ బ్యాక్టీరియా సహా ఇతర అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను ఈ పూత రెండుమూడు నిమిషాల వ్యవధిలో నాశనం చేయగలదని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ఇంజినీర్స్‌ అండ్ ఇమ్యూనాలజిస్ట్‌ బృంద సభ్యులు తెలిపారు. ఈ పూత పూసిన ఉపరితలాలను పదేపదే శుభ్రపరిచినా.. నెలల తరబడి 99.9 శాతం వరకు సూక్ష్మక్రిములను చంపగల సామర్థ్యం ఉంటుందని వెల్లడించారు. టీ ట్రీ ఆయిల్, దాల్చినచెక్క నూనె నుంచి సేకరించిన యాంటీమైక్రోబయాల్ అణువులతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. ‘పాలియురేథెన్‌’ అనే ఒక రకమైన పాలిమర్‌ పదార్థంతో పూతలో మన్నిక సాధ్యమవుతోందన్నారు.

తాము రూపొందించిన యాంటీ బ్యాక్టీరియల్‌ పూతలోని నూనె పూర్తిగా ఆవిరయ్యేందుకు, దాని క్రిమిసంహారక శక్తి తగ్గిపోయేందుకు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని మిషిగన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, పరిశోధన బృంద సభ్యుడు అనీష్ టుతేజా చెప్పారు. అంతవరకూ అది సమర్థంగా పనిచేస్తుందని తమ పూత మన్నిక పరీక్షల ఫలితాల్లో వెల్లడైందన్నారు. పనితీరు తగ్గిపోయినప్పుడు.. సంబంధిత నూనెను ఉపరితలాలపై పూయడం ద్వారా మళ్లీ రీఛార్జ్ చేయొచ్చని తెలిపారు. ఒక ఏడాదిలో ఈ సాంకేతికత.. వాణిజ్యపరంగా అందుబాటులోకి రావచ్చని అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని