Pak Army: పాక్‌ ఆర్మీకి గట్టి దెబ్బ! బీఎల్‌ఏ దాడుల్లో వందకుపైగా సైనికుల మృతి?

పాకిస్థాన్‌ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది! ఇక్కడి బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని రెండు వేర్వేరు సైనిక శిబిరాలపై ‘బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ)’ వేర్పాటువాదులు బుధవారం అర్ధరాత్రి భారీ ఎత్తున ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ క్రమంలో దాదాపు వందకుపైగా...

Published : 04 Feb 2022 02:23 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది! ఇక్కడి బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని రెండు వేర్వేరు సైనిక శిబిరాలపై ‘బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ)’ వేర్పాటువాదులు బుధవారం అర్ధరాత్రి భారీ ఎత్తున ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ క్రమంలో దాదాపు వందకుపైగా సైనికులను హతమార్చినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. అయితే, పాక్‌ ఆర్మీ మాత్రం.. దాడులను తిప్పికొట్టినట్లు తెలిపింది. ఒక సైనికుడు మృతి చెందినట్లు, తిరుగుబాటుదారుల్లో నలుగురిని మట్టుబెట్టినట్లు వెల్లడించింది. వింటర్ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీజింగ్‌కు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు ఈ దాడులు జరగడం గమనార్హం. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోన్న విషయం తెలిసిందే.

పంజ్‌గుర్‌, నౌష్కీ జిల్లాల్లోని సైనిక స్థావరాలపై జరిగిన ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన బీఎల్‌ఏ.. తమ ఆత్మాహుతి బాంబర్లు సైనిక స్థావరాల ప్రవేశద్వారం వద్ద పేలుడు పదార్థాలతో నింపిన వాహనాలను పేల్చినట్లు ప్రకటించింది. ఈ శిబిరాలు ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉన్నట్లు చెప్పింది. మరోవైపు ఈ ఘటనపై ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందిస్తూ.. ఉగ్రదాడులను సమర్థంగా తిప్పికొట్టిన భద్రతా బలగాలకు సెల్యూట్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం సైతం.. బీఎల్‌ఏ సభ్యులు గ్వాదర్ ఓడరేవు సమీపంలోని ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసి 10 మంది సైనికులను హతమార్చారు.

బలోచిస్థాన్‌లోని గ్యాస్, ఖనిజ వనరులను దోపిడీ చేస్తోందని, ఈ నేపథ్యంలో తమకు స్వాతంత్ర్యం కావాలంటూ ఇక్కడి బీఎల్‌ఏ వేర్పాటువాదులు దశాబ్దాలుగా పాక్‌ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా చేపడుతున్న ప్రాజెక్టులు, సైనిక బలగాలపై దాడులకు దిగుతున్నారు. ఇదిలా ఉండగా.. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌(సీపెక్‌)లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు బలోచ్‌ తిరుగుబాటుదారులకు భారత్ రహస్యంగా మద్దతు ఇస్తోందని పాక్‌ పలు సందర్భాల్లో ఆరోపించింది. కానీ, భారత్‌ దీన్ని ఖండిస్తూ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని