Rishi Sunak: బ్రిటన్‌లో ఏమిటీ గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌.. వాటిపై రిషి సునాక్‌ యుద్ధం దేనికి..?

యూకేలో పిల్లలను, యువతను వేధించే గ్రూమింగ్‌ గ్యాంగ్‌లపై రిషిసునాక్‌ ఏకంగా యుద్ధమే ప్రకటించారు. వాటిని అణచివేయడానికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 

Updated : 05 Apr 2023 14:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

బ్రిటన్‌(Britain)లో ‘గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌’ (grooming gangs)పేరు వింటేనే బాలికల తల్లిదండ్రులు వణికిపోతారు.  తమ బిడ్డలు ఈ తోడేళ్ల చెరలో చిక్కకూడదని కోరుకుంటారు. వీటిల్లో అధికంగా బ్రిటిష్‌ పాకిస్థానీల హస్తం ఉందని తాజాగా ఆ దేశ హోం మంత్రి సుయెలా బ్రావెర్మన్‌ నేరుగా బాంబు పేల్చారు. వీరి విషయంలో రాజకీయ పార్టీలు మౌనం పాటించాయని విమర్శించారు. మరోవైపు అంతకు ముందురోజే బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) ఆ దేశంలోని ఆడపిల్లల తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా ఈ గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌ను ఉక్కుపాదంతో అణచివేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వీటిపై ఓ పోలీస్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ గ్యాంగ్స్‌ బాధితులను ప్రభుత్వాలు పట్టించుకోలేదని సునాక్‌ విరుచుకుపడ్డారు. తమకు అటువంటి ప్రయోజనాలు ఏమాత్రం అడ్డంకి కావని పేర్కొన్నారు. ఈ నిర్ణయం బ్రిటన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

అసలు ఏమిటీ గ్యాంగ్‌లు..

బ్రిటన్‌లోని నేషనల్‌ సొసైటీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాల్టీ టు చిల్డ్రన్‌ (NSPCC) ప్రకారం.. పిల్లలు, కౌమారదశలోని వారితో గుర్తు తెలియని వ్యక్తులు లేదా తెలిసిన వారైనా సరే సంబంధాలు పెట్టుకోవడం, భావోద్వేగాలను ఉపయోగించుకొని వారిని వాడుకోవడం, వేధింపులకు పాల్పడటాన్ని గ్రూమింగ్‌ అంటారు. ముఖ్యంగా పిల్లలు, యవ్వన దశలోని వారిని లైంగిక అవసరాలు తీర్చుకోవడానికి , లేదా ఇతర అవసరాలకు వాడుకోవడానికి, మానవ అక్రమ రవాణా చేయడానికి ఈ సంబంధాలు పెట్టుకొంటారు. ఈ క్రమంలో చాలా మంది వ్యక్తులు కలిసి గ్యాంగ్‌ వలే పనిచేస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిచయాలు, ఆన్‌లైన్‌ వేదికలుగా వీరు పిల్లలను తమ వలలో వేసుకుంటున్నారు. 

బిత్తరపోయే వాస్తవాలు..

2019లో ఈ గ్రూమింగ్‌ గ్యాంగ్‌లపై దర్యాప్తు మొదలైంది. 1970 నుంచి ఒక్క షార్ప్‌షైర్‌లోని టెల్‌ఫోర్డ్‌ అనే ప్రదేశంలోనే దాదాపు 1000 మంది ఈ గ్యాంగ్‌ల బారినపడి జీవితాలను నాశనం చేసుకొన్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో చిక్కిన వారికి మాదక ద్రవ్యాలు అలవాటు చేయడం, లైంగికంగా వాడుకోవడం,  బ్రెయిన్‌ వాష్‌ చేయడం వంటివి చేశారు. దేశంలో ఇప్పటికీ ఇటువంటి గ్యాంగ్‌లు ప్రబలంగా ఉన్నాయని దర్యాప్తులో తేలింది.  ఈ దర్యాప్తు ఛైర్మన్‌గా చేసిన టామ్‌ క్రౌథెర్‌ మాట్లాడుతూ..  ఈ దారుణాలను చాలాకాలం పట్టించుకోకపోగా.. బాధిత బాలికలపై వేశ్యలుగా ముద్రవేయడం, వారి జీవనశైలిని నిందించడం చేశారు. నిందితులు ఆసియాకు చెందిన వారు కావడంతో జాతుల వైషమ్యానికి కారణమవుతుందని ఈ లైంగిక దోపీడీలపై దర్యాప్తు చేయలేదన్నారు. దీనికి తోడు టీచర్లు, యూత్‌ వర్కర్లు పిల్లలపై లైంగిక వేధింపుల విషయంలో ఫిర్యాదులు చేయించడానికి విముఖత చూపినట్లు చెప్పారు.  ప్రభుత్వం నుంచి గట్టి చర్యలు లేకపోవడంతో గ్రూమింగ్‌ గ్యాంగ్‌లు మరింత రెచ్చిపోయాయన్నారు. ఈ ముఠాల్లో అత్యధికంగా బ్రిటిష్‌ పాకిస్థానీలు లేదా ఇతర ఆసియా దేశాల వారు ఉంటున్నారు. పిల్లలతో సంబంధాలు పెట్టుకొని వారి నమ్మకం చూరగొన్నాక.. లైంగిక అవసరాలు తీర్చుకోవడానికి వాడుకొంటున్నారు. ఆ తర్వాత వారిని వేరేవారికి అప్పగించడం.. లేదా ట్రాఫికింగ్‌ చేయడం వంటివి జరుగుతున్నాయి. 

* 2014లో ప్రొఫెసర్‌ అలెక్స్‌ జాయ్‌ రిపోర్డు ప్రకారం ఒక్క సౌత్‌ యార్క్‌షైర్‌లోని రోథర్‌హాంలోనే 1,400 మంది పిల్లలు ఇటువంటి దారుణాల బారినపడినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక కథనంలో పేర్కొంది. అత్యధికంగా పాకిస్థానీలున్న గ్యాంగ్‌ 11 ఏళ్ల పిల్లల నుంచి పలువురిని తమ వలలో చిక్కించుకొన్నాయని పేర్కొన్నారు. రోచ్‌డేల్‌, బ్రాడ్‌ఫోర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌, న్యూకాజిల్ ప్రాంతాల్లో ఇటువంటి పలు కేసులు బయటపడ్డాయి. 

* రోథర్‌ హాం ఎంపీ సారా ఛాంపియన్‌ దీనిపై స్పందిస్తూ.. గతంలో ఈ దుర్మార్గాలను రిపోర్టు చేయడానికి ప్రయత్నించిన సమాజిక కార్యకర్తలను బలవంతంగా ‘రేస్‌ రిలేషన్స్‌’ కోర్సులకు పంపారన్నారు. దీంతోపాటు ‘నిందితుడు  పాకిస్థానీ పురుషుడు’ అని అన్న విషయాన్ని తొలగించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామనే హెచ్చరికలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.

* గతంలో హోం ఆఫీస్‌ చేసిన పరిశోధనలో చాలా వరకు ఈ గ్యాంగుల్లో 30 ఏళ్లలోపు శ్వేతజాతి పురుషులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కేవలం ఆసియా వాసులు ఉంటున్నారని చెప్పడానికి లేదని హోం ఆఫీస్‌ పేర్కొంది.

బ్రిటన్‌లో ఇదో ప్రధాన సమస్య..

‘ది ఇండిపెండెంట్‌ ఎంక్వైరీ ఇన్‌టూ ఛైల్డ్‌ సెక్స్‌వల్‌ అబ్యూజ్‌’ (IICSa) నివేదిక ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులు బ్రిటన్‌లో ప్రధాన సమస్యగా తేల్చింది. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి ఈ నివేదిక తయారు చేశారు. స్థానిక రాజకీయ నాయకుల పిల్లలు, యువత సంక్షేమాన్ని విస్మరించి కీర్తిప్రతిష్ఠలకే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపింది. దశాబ్దాల కొద్దీ ఈ దుర్మార్గాలను అణిచిపెట్టారని వెల్లడించింది. బ్రిటన్‌ చరిత్రలోనే అత్యంత వ్యయంతో కూడిన పరిశోధనగా ఇది నిలిచింది. 2014లో వరుసగా పలు కుంభకోణాలు బయటకు రావడంతో ఈ పరిశోధన చేపట్టారు. సమగ్ర సమాచారంతో మొత్తం 14 పరిశోధనాత్మక నివేదికలు, ఇతర రిపోర్టులు విడుదల చేశారు. వీటిల్లో పలు క్యాథలిక్‌ చర్చ్‌లు, పేరు మోసిన రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలిసింది.

మరోవైపు, హోం మంత్రి సుయెలా బ్రావెర్మన్‌ ప్రకటనపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. కేవలం ఒక జాతివారే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పలేమని, దాన్ని దాటి దృష్టిపెట్టాలని  ఎన్‌ఎస్‌పీసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్ సర్‌ పీటర్‌ వాన్లెస్‌ పేర్కొన్నారు. ఇక 2015లో నివేదిక ప్రకారం 1,231 మంది గ్రూమింగ్‌ గ్యాంగ్‌ నేరస్థుల్లో 42శాతం మంది శ్వేతజాతీయులు, 14శాతం మంది ఆసియా మూలలవారు, 17శాతం మంది నల్లజాతీయులు ఉన్నారని బీబీసీ కథనం వెల్లడిస్తోంది. 

రిషి సునాక్‌ కార్యాచరణ ఏమిటీ..?

గ్రూమింగ్‌ గ్యాంగ్‌ల అణచివేయడానికి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. వీరికి నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ మద్దతుగా నిలుస్తుంది. ఈ ఏజెన్సీ.. దర్యాప్తు సంస్థలకు ఈ గ్రూమింగ్‌ గ్యాంగ్‌ సభ్యుల వివరాలు అందించి సహకరిస్తుంది. సాంస్కృతికంగా సున్నితమైన అంశాలను అడ్డంపెట్టుకొని శిక్షను తప్పించుకోకుండా ఇది ఉపయోగపడుతుందని డౌనింగ్‌ స్ట్రీట్‌ పేర్కొంది. దీంతోపాటు ఈ గ్యాంగ్‌ నాయకులను కఠినంగా శిక్షించేలా చట్టాలను తీసుకురానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని