Ukraine: రష్యాతో తెగతెంపులకు సిద్ధమే..! ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తూ రష్యా నిర్ణయం తీసుకోవడానికి ప్రతిస్పందనగా రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఉక్రెయిన్‌ పేర్కొంది.

Published : 22 Feb 2022 18:42 IST

నార్డ్‌స్ట్రీమ్‌ 2 ప్రాజెక్టు నిలివేతకు డిమాండ్‌

కీవ్‌: వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తూ రష్యా నిర్ణయం తీసుకోవడాన్ని ఉక్రెయిన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ రెండు ప్రాంతాలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఉక్రెయిన్‌.. వీటికి ప్రతిస్పందనగా రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘నార్డ్‌ స్ట్రీమ్‌ 2’ పైపులైన్‌ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. అనంతరం ఎదురయ్యే ఎటువంటి పర్యవసానాలకైనా ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించింది.

‘ఉక్రెయిన్‌, రష్యా మధ్య సంబంధాలను తెంచుకునే అంశాన్ని పరిశీలించాలంటూ మా విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి ఓ విజ్ఞప్తి వచ్చింది. దీనిని పరిశీలనలోకి తీసుకున్నాం. ఇదే అంశంపై వెంటనే కసరత్తు ప్రారంభిస్తాం’ అని తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్‌పై భారీ సైనిక దాడి జరిపేందుకు క్రెమ్లిన్‌ ఇప్పటికే  ఆ కుట్రకు అడుగులు వేస్తోందని.. ఇందుకు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పించడమే తొలి అడుగు అన్నారు. ఈ నేపథ్యంలో జర్మనీకి గ్యాస్‌ సరఫరా చేసేందుకు రష్యా నిర్మించిన ‘నార్డ్‌ స్ట్రీమ్‌ 2’ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలని వొలొడిమిర్‌ జెలెన్‌స్కీ డిమాండ్‌ చేశారు.

ఇక అంతకుముందు దేశ ప్రజలనుద్దేశిస్తూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెలెన్‌స్కీ ప్రసంగించారు. తాము శాంతిని మాత్రమే కోరుకుంటున్నామని, అయినప్పటికీ తమ భూభాగాన్ని కోల్పోవడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము ఎవ్వరికీ భయపడేది లేదన్న ఆయన, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో వెనకడుగు వేసేదే లేదన్నారు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు రష్యా తీరుపై మండిపడ్డాయి. రష్యా చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని