Australia: చైనాకు మరో షాక్‌.. ఆస్ట్రేలియాకు 220 టొమహాక్‌ క్షిపణులు

చైనా(China)కు అమెరికా(USA) మరో భారీ షాక్‌ ఇచ్చింది. ఆస్ట్రేలియాకు అత్యాధునిక టొమహాక్‌ క్షిపణులను సరఫరా చేయాలని నిర్ణయించింది. 

Updated : 17 Mar 2023 19:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)కు మరో షాక్‌ ఇచ్చేందుకు అమెరికా (USA) సిద్ధమైంది. ఇప్పటికే ఆస్ట్రేలియా (Australia)కు అణుశక్తి జలాంతర్గాములను సమకూర్చాలని ఆకస్‌(AUKUS) (ఆస్ట్రేలియా,యూకే, యూఎస్‌) కూటమి నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాకు 220 టొమహాక్‌ దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణులను కూడా సరఫరా చేయాలని ఆమెరికా నిర్ణయించింది. వీటిని జలాంతర్గాములు, యుద్ధనౌకల్లో వినియోగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికాలోని ‘డిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ’ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ డీల్‌ విలువ 895 మిలియన్‌ డాలర్లు అని పేర్కొంది. ‘‘ఈ క్షిపణి విక్రయాలతో అమెరికా, ఇతర మిత్రదేశాల దళాలతో ఆస్ట్రేలియా సమన్వయం చేసుకొంటూ.. సంయుక్త ప్రయోజనాలను కాపాడే ఆపరేషన్లను విజయవంతంగా చేయగలదు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ఆకస్‌ డీల్‌లో భాగంగానే ఈ కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి.

ఈ డీల్‌పై ఆస్ట్రేలియా రక్షణశాఖ మంత్రి పాట్‌ కాన్రే మాట్లాడుతూ.. 2033 నాటికి ఆస్ట్రేలియాకు తొలి మూడు వర్జీనియా శ్రేణి సబ్‌మెరైన్లు అందుతాయన్నారు. అప్పటికి టొమహాక్‌ క్షిపణులు కూడా దళాలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఆకస్‌ ఒప్పదం జరిగిన తొలినాళ్లలోనే టొమహాక్‌ క్షిపణులను ఆస్ట్రేలియా తమ నౌకాదళంలోని హోబర్ట్‌ శ్రేణి డెస్ట్రాయర్లలో అమర్చాలని భావించింది. తాజా ఆ కల నిజం కానుండడంతో.. సుదూరాల్లోని శత్రువులపై దాడి చేసే సామర్థ్యం కూడా ఆస్ట్రేలియాకు లభించనుంది. 

టొమహాక్‌ క్షిపణులను 1991లో తొలిసారి గల్ఫ్‌ యుద్ధంలో అమెరికా వాడింది. ఈ క్షిపణులు భూమికి అత్యంత తక్కువ ఎత్తులో సబ్‌సోనిక్‌ వేగంతో ప్రయాణించి రాడార్ల కళ్లుగప్పి లక్ష్యాలను ఛేదించాయి. ఇవి 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఢీకొట్టగలవు. ఈ క్షిపణులను జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించే అవకాశం ఉంది.  ఇప్పటి వరకు అమెరికా నుంచి బ్రిటన్‌ మాత్రమే ఈ క్షిపణులను కొనుగోలు చేసింది. జపాన్‌ కూడా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తోంది. 

ఇటీవల ఆకస్‌ కూటమి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2030ల ప్రారంభం నుంచి అమెరికా మూడు వర్జీనియా తరగతి జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు విక్రయిస్తుంది. అవసరమైతే మరో రెండు సబ్‌మెరైన్లనూ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. త్వరలో ఆస్ట్రేలియా నౌకాదళ సిబ్బందికి అమెరికా, బ్రిటన్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే 2027 నుంచి దశలవారీగా ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను పంపుతామన్నారు. దీనివల్ల ఆ దేశ నౌకాదళానికి ఈ తరహా సబ్‌మెరైన్లపై తగిన శిక్షణ లభిస్తుందన్నారు. ఆ తర్వాత బ్రిటన్‌, ఆస్ట్రేలియాల కోసం కొత్త రకం అణు జలాంతర్గాములను నిర్మిస్తారు. వీటిని ‘ఎస్‌ఎస్‌ఎన్‌-ఆకస్‌’గా పేర్కొంటారు. అందులో మూడు దేశాల పరిజ్ఞానాలను ఉపయోగిస్తారు. వీటిలో సంప్రదాయ అస్త్రాలు ఉంటాయి.

తాజా ఒప్పందంలో భాగంగా.. తన సబ్‌మెరైన్‌ నిర్మాణ సామర్థ్యాన్ని, వర్జీనియా తరగతి జలాంతర్గాముల నిర్వహణ వసతులను మెరుగుపరుచుకోవడానికి 460 కోట్ల డాలర్లను అమెరికా వెచ్చిస్తుంది.  ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద డీజిల్‌ ఇంజిన్‌ జలాంతర్గాములు ఉన్నాయి. వాటి సామర్థ్యం పరిమితం. వర్జీనియా తరగతి సబ్‌మెరైన్లు అందితే.. సాగరగర్భంలో ఆస్ట్రేలియా పరిధి మరింత విస్తరించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని