H-1B visas: హెచ్‌-1బీ వీసాల్లో మోసాలకు చెక్‌.. ఎంపిక ప్రక్రియలో కొత్త రూల్స్‌

H-1B visas: హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియ కోసం అమెరికా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు లబ్ధిదారుల కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.

Updated : 31 Jan 2024 14:13 IST

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసాల (H-1B visa) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా (USA) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే వీసాల ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై, ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా.. ఒకే అప్లికేషన్‌గా పరిగణించనున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా.. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ ‘కేంద్రీకృత-ఎంపిక ప్రక్రియ’ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) వెల్లడించింది.

2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మొదలయ్యే వీసాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఈ నిబంధనలను అమలు చేయనున్నారు. అంతేగాక, ప్రతి లబ్ధిదారు సరైన పాస్‌పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. తప్పుడు సమాచారం ఇస్తే ఆ పిటిషన్లను తిరస్కరించే లేదా రద్దు చేసే అధికారం యూఎస్‌సీఐఎస్‌కు ఉంటుంది. పాస్‌పోర్టు, ఇతర గుర్తింపు వివరాల ఆధారంగా దరఖాస్తుదారుడి రిజిస్ట్రేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

అమెరికాలోనే హెచ్‌-1బీ వీసాల రెన్యువల్‌ ప్రారంభం

హెచ్‌-1బీ వీసాల కోసం మొదటి రిజిస్ట్రేషన్‌ పీరియడ్‌ మార్చి 6 నుంచి మార్చి 22 వరకు కొనసాగనుంది. ఈ వ్యవధిలో పిటిషనర్లు, సంస్థలు.. రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము చెల్లింపుల కోసం తప్పనిసరిగా USCIS ఆన్‌లైన్‌ అకౌంట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి కంపెనీలు తమ అకౌంట్లను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఫామ్‌ ఐ-129, నాన్‌-క్యాప్‌ హెచ్‌-1బీ పిటిషన్ల కోసం ఫామ్ ఐ-907 పత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని USCIS వెల్లడించింది.

వృత్తి నిపుణులకు ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్‌-1బీ వీసాలు జారీ చేస్తారు. ఇందుకోసం ఏటా కొత్తగా దాదాపు 65 వేల వీసాలతోపాటు అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ కోసం మరో 20వేల వీసాలను కేటాయిస్తారు. నాన్‌ ఇమిగ్రేషన్‌ (అమెరికాలో కొంతకాలం ఉండేందుకు) కింద ఇచ్చే హెచ్‌-1బీ వీసాలు పొందే వారిలో ఎక్కువగా భారతీయులే ఉంటారు. కంప్యూటరైజ్డ్‌ లాటరీ విధానంతో వీటిని జారీ చేస్తుంటారు.

అయితే, గత కొంతకాలంగా ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది ఈ వీసాల కోసం ఏకంగా 7.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒకే లబ్ధిదారుని తరఫున బహుళ రిజిస్ట్రేషన్లు సమర్పించి కొన్ని సంస్థలు లాటరీ విధానంలో అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో వీటిని అరికట్టేందుకు తాజా నిబంధనలను తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని