US ban: షింజియాంగ్‌ వస్తువులపై నేటి నుంచి అమెరికా నిషేధం..!

షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీఘర్‌ ముస్లింలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకొనేందుకు అమెరికా చేపట్టిన చర్యలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.  దీనిలో భాగంగా షింజియాంగ్‌ ప్రావిన్స్‌

Updated : 21 Jun 2022 11:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీఘర్‌ ముస్లింలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తోన్నఅరాచకాలను అడ్డుకొనేందుకు అమెరికా చేపట్టిన చర్యలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.  దీనిలో భాగంగా షింజియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి వచ్చే దిగుమతులపై అమెరికాలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ప్రాంతం  నుంచి ఎగుమతి చేసే వస్తువులు వీఘర్ల వెట్టిచాకిరితో తయారు చేయించినవి కావని కంపెనీలు నిరూపించుకోవాలి. షింజియాంగ్‌లో వీఘర్‌ ముస్లింలను బంధించి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఇప్పటి వరకు అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పటికే అమెరికా ఈ ప్రాంతం నుంచి వచ్చే పత్తి, టమాటాలను నిషేధించింది. తాజాగా ఆ ఆంక్షలను అన్ని రకాల వస్తువులకు విస్తరించింది. దీంతో వీటిని నేటి నుంచి ‘ది వీఘర్‌ ఫోర్సుడ్‌ లేబర్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌’ కిందకు తీసుకొచ్చారు.

గత వారం దీనిపై అమెరికా చట్టసభ సభ్యులు మాట్లాడుతూ ‘‘చైనా కమ్యూనిస్టు పార్టీ బలవంతపు వెట్టి చాకిరి చేయించడాన్ని, మానవీయతపై దాడి చేయడాన్ని చూస్తూ ఊరుకోమని ఈ చట్టం స్పష్టమైన సందేశం పంపిస్తుంది’’ అని పేర్కొన్నారు. మరోపక్క రిపబ్లికన్ల నుంచి కూడా ఈ నిర్ణయానికి మద్దతు లభించింది. ‘‘బైడెన్‌ కార్యవర్గం కలిసి ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది’’ అని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మార్కో రూబియో పేర్కొన్నారు.  అమెరికా కాంగ్రెస్‌ లెక్కల ప్రకారం చైనా 2017 నుంచి దాదాపు 10 లక్షల మంది వీఘర్లను బంధించింది. వీరిలో వేల మంది అతి తక్కువ వేతనంతో షింజియాంగ్‌లోని పలు కర్మాగారాల్లో పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని