Monkeypox: మంకీపాక్స్ టీకాలు 100 శాతం పనిచేయవు..!

కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచాన్ని ఇప్పుడు మంకీపాక్స్(monkeypox) ఇబ్బందిపెడుతోంది.

Updated : 18 Aug 2022 12:11 IST

ప్రస్తుత వ్యాప్తికి జన్యుమార్పులు కారణమా..?

జెనీవా: కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచాన్ని ఇప్పుడు మంకీపాక్స్(monkeypox) ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే 92 దేశాలకు విస్తరించిన ఈ వైరస్‌.. 35 వేల మందికి సోకింది. వీరిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారంలోనే దాదాపు 7,500 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు వారంతో పోల్చితే.. 20 శాతం మేర కేసులు పెరిగాయని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని గత నెల ప్రజారోగ్య అత్యయిక స్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీకా గురించి చర్చ నడుస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. మంకీపాక్స్ టీకాలు 100 శాతం ప్రభావం చూపుతాయని ఆశించలేమని వెల్లడించింది. అందుకే జాగ్రత్తలు పాటించే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించింది. 

‘‘మేము బ్రేక్‌థ్రూ కేసులను పరిశీలించడం మొదలుపెట్టినప్పుడు మాకు కీలక సమచారం లభించిందన్నది  వాస్తవం. ఎందుకంటే.. నివారణకు లేదా వైరస్‌ సోకిన తర్వాతగానీ టీకాలు నూరుశాతం ప్రభావ వంతం కాదని తెలుస్తోంది’’  అని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. స్మాల్‌పాక్స్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను డెన్మార్క్‌కు చెందిన బవారియన్‌ నార్డిక్‌ (Bavarian Nordic) అనే సంస్థ తయారు చేసింది. అయితే, మంకీపాక్స్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ లేనప్పటికీ స్మాల్‌పాక్స్‌కు అందుబాటులో ఉన్న టీకానే మంకీపాక్స్‌ నిరోధానికి ఆయా దేశాలు అనుమతి ఇస్తున్నాయి.

జన్యుమార్పులే వ్యాప్తికి కారణమా..?

ఈ వ్యాప్తికి ఉత్పరివర్తనలు కారణమా అనే ప్రశ్నపై ఆరోగ్య సంస్థ స్పందించింది. ‘ఈ జన్యుమార్పుల ప్రభావం గురించి సమాచారం తెలియాల్సి ఉంది. వైరస్ వ్యాప్తి, వ్యాధి తీవ్రతలో ఈ ఉత్పరివర్తనల ప్రభావం ఏమేరకు ఉందనేదానిపై  పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుత ఇన్ఫెక్షన్లకు  జన్యుమార్పులు లేక హోస్ట్ ఫ్యాక్టర్స్‌ కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది’ అని  పేర్కొంది. ప్రస్తుతం మంకీపాక్స్‌లో కాంగో బేసిన్(మధ్య ఆఫ్రికా), పశ్చిమ ఆఫ్రికాకు చెందిన రెండు వేరియంట్లు ఉన్నాయి. ఆరోగ్య సంస్థ వాటిని Clade I, Clade II గా పిలుస్తోంది. Clade IIలో  IIa, IIb అనే ఉప వర్గాలున్నాయి. ప్రస్తుత వ్యాప్తికి ఇవి దోహదం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని