Published : 18 May 2022 10:22 IST

Plane Crash: చైనా విమాన ప్రమాదం.. పైలట్లే కూల్చేశారా..?

బ్లాక్‌బాక్స్‌ చెబుతున్నదేంటీ?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది మార్చిలో చైనాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రమాదం తర్వాత లభించిన బ్లాక్‌బాక్స్‌ డేటాను విశ్లేషించగా.. ఈ విషయం తెలిసినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం వెల్లడించింది.

చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం (ఎంయూ5735) ఈ ఏడాది మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో కున్మింగ్‌ నుంచి గాంగ్‌ఝౌ వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విమానం కున్మింగ్‌ నగరం నుంచి బయల్దేరిన తర్వాత గగనతలంలో 29,100 అడుగుల ఎత్తులో ప్రయాణించింది. అయితే కొంతసేపటి తర్వాత ఒక్కసారిగా ఈ ఎత్తు 9వేల అడుగులకు పడిపోయింది. ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు ఏకంగా 3,225 అడుగులకు దిగింది. టెంగ్షియన్‌ కౌంటీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలిపోగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు.

కాక్‌పిట్‌ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే..

ఈ ప్రమాద ఘటనపై చైనా దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో సహకారం అందించేందుకు బోయింగ్‌ ప్రతినిధులతో పాటు యూఎస్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (ఎన్‌టీఎస్‌బీ) సభ్యులు చైనాకు వెళ్లారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో లభించిన బ్లాక్‌బాక్స్‌లను విశ్లేషించారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాక్‌పిట్‌ సెక్యూరిటీని ఉల్లంఘించినట్లు విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్‌ కూడా రాలేదని చైనా అధికారులు తెలిపారు. అంటే.. ఉగ్రదాడి, హైజాక్ వంటి అనుమానాలను కొట్టిపారేయొచ్చని అన్నారు.

కాగా.. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ఆ విమానానికి సమీపంలో వెళ్తోన్న విమానాల పైలట్లు కూడా సమాచారం ఇచ్చేందుకు పదేపదే కాల్స్‌ చేశారు. కానీ, ఆ పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే ఉద్దేశపూర్వకంగా విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని బ్లాక్‌బాక్స్‌ డేటా ప్రకారం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు చెప్పారని రాయిటర్స్‌ వెల్లడించింది.

దీనిపై బోయింగ్‌ నుంచి గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన పైలట్‌, కో పైలట్‌ విమానయానంలో ఎంతో అనుభవమున్న వారేనని, వారి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉందని చైనా ఈస్ట్రన్‌ చెబుతోంది. వారికి ఆర్థికపరమైన లేదా కుటుంబ సమస్యలు కూడా ఏం లేవని పేర్కొంది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts