Dmitry Medvedev: అమెరికాలో అంతర్యుద్ధం.. బ్రిటన్‌ తిరిగి ఈయూలోకి..! రష్యా ‘2023’ అంచనాలివే

2023లో ఇవి జరుగుతాయంటూ ఊహాజనిత పరిణామాల జాబితాను రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్‌దేవ్ ట్విటర్ వేదికగా పోస్ట్‌ చేశారు. అమెరికాలో అంతర్యుద్ధం, బ్రిటన్‌ మళ్లీ యూరోపియన్‌ యూనియన్‌లో చేరుతుందంటూ పేర్కొన్నారు.

Published : 27 Dec 2022 13:12 IST

మాస్కో: కొత్త ఏడాది వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే 2022లో చోటుచేసుకున్న కీలక పరిణామాలను గుర్తుచేసుకుంటున్న పలువురు.. వచ్చే ఏడాదిలో ఏం జరగనుందో కూడా అంచనాలు వేస్తున్నారు. రష్యా(Russia) మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రష్యా భద్రతామండలి డిప్యూటీ ఛైర్మన్‌ దిమిత్రి మెద్వ్‌దేవ్‌(Dmitry Medvedev) సైతం.. అంతర్జాతీయ పరిణామాలపై తనదైన అంచనాలు వెల్లడించారు. ‘నూతన సంవత్సర వేళ.. అందరూ భవిష్యత్తుకు సంబంధించి ఊహాత్మక, అసంబద్ధ అంచనాలతో ముందుకొస్తున్నారు. మా తరఫున కూడా అంచనాలివే’ అంటూ ట్విటర్‌ వేదికగా వాటిని పోస్ట్‌ చేశారు.

చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు పెరుగుతుంది. గ్యాస్ ధర వెయ్యి క్యూబిక్ మీటర్లకు 5 వేల డాలర్లకు చేరుకుంటుంది.

బ్రిటన్‌ తిరిగి యూరోపియన్‌ యూనియన్‌లో చేరుతుంది. ఇది జరిగాక.. ఈయూ కూలిపోతుంది. ఈయూ కరెన్సీగా ‘యూరో’ వినియోగం నిలిచిపోతుంది.

పోలాండ్, హంగేరీలు గతంలో ఉన్న ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలను ఆక్రమిస్తాయి. జర్మనీ భూభాగం, పోలాండ్, బాల్టిక్ రాష్ట్రాలు, చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేకియా, కీవ్ రిపబ్లిక్, ఇతర ప్రాంతాలతో కలిపి.. నాల్గో జర్మనీ రాజ్యం(Fourth Reich) ఏర్పడుతుంది.

ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌కు, నాల్గో రాజ్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఐరోపా విభజనకు గురవుతుంది. ఈ ప్రక్రియలో పోలాండ్ పునర్విభజన చెందుతుంది.

ఉత్తర ఐర్లాండ్.. బ్రిటన్‌ నుంచి విడిపోయి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లో చేరుతుంది.

అమెరికాలో అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. కాలిఫోర్నియా, టెక్సాస్‌లు స్వతంత్ర ప్రాంతాలుగా అవతరిస్తాయి. టెక్సాస్-మెక్సికోలు మిత్రరాజ్యంగా ఏర్పడతాయి. ఈ అంతర్యుద్ధం ముగిసిన తర్వాత.. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా చాలా రాష్ట్రాల్లో ఎలాన్ మస్క్ విజయం సాధిస్తారు.

అతిపెద్ద స్టాక్ మార్కెట్లు, ఆర్థిక కార్యకలాపాలు.. అమెరికా, ఐరోపాను వీడి ఆసియాకు తరలిపోతాయి

బ్రెట్టన్ వుడ్స్ ద్రవ్య నిర్వహణ వ్యవస్థ కుప్పకూలి.. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు పతనానికి దారి తీస్తుంది. ప్రపంచ రిజర్వ్ కరెన్సీలుగా.. యూరో, డాలర్‌ల చలామణి ఆగిపోతుంది. బదులుగా ప్రభుత్వం జారీ చేసే డిజిటల్ కరెన్సీలు విరివిగా ఉపయోగిస్తారు.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తారని తన పేరును ఉటంకించడంపై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. మెద్వ్‌దేవ్‌ చేసిన ట్వీట్‌లను ‘అతి వర్ణన’గా అభిప్రాయపడ్డారు. అత్యంత అసంబద్ధ అంచనాలుగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని