Ukraine Crisis: అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్లో ఉన్నది ఎవరు..?

మేరియుపొల్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. కానీ, అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ మాత్రం ఇంకా తమ ఆధీనంలోకి రాలేదని అంగీకరించారు. దాని నుంచి ఈగ కూడా

Published : 22 Apr 2022 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మేరియుపొల్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. కానీ, అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ మాత్రం ఇంకా తమ ఆధీనంలోకి రాలేదని అంగీకరించారు. దాని నుంచి ఈగ కూడా బయటకు వెళ్లలేనంత చుట్టుముట్టాలని దళాలను ఆదేశించారు. దాదాపు నాలుగుమైళ్ల వైశాల్యంలో విస్తరించిన ఈ ప్లాంట్‌ మాత్రమే ఉక్రెయిన్‌ సేనలకు చివరి స్థావరంగా నిలిచింది. 

దీనిలో ఉన్న ఫైటర్లు ఎవరు..?

అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌లోపల 36వ మెరైన్‌ బ్రిగేడ్‌ సైనికులు ఉన్నారు. బుధవారం దీని కమాండర్‌ మేజర్‌ షెర్హీవ్‌ వోల్యన్‌ మాట్లాడుతూ తమ దళాలు ఏమాత్రం లొంగిపోవని పేర్కొన్నారు. కానీ, తమ వద్ద గాయపడిన 500 మంది సైనికులకు సాయం అందజేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దీంతోపాటు వందల మంది పిల్లలు, మహిళలు ఈ ప్లాంట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఇప్పటికే ఉక్రెయిన్‌ తరపున మేరియుపొల్‌ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న అడెన్‌ అస్లైన్‌, సహున్‌ పిన్నర్‌లను గత వారం రష్యా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి. వీరుకూడా ఈ బ్రిగేడ్‌లోని సభ్యులే. 

అజోవ్‌ బ్రిగేడ్‌ కూడా ఇక్కడే..

ఈ స్టీల్‌ ప్లాంట్‌లో మిగిలిన మరో దళం అజోవ్‌ బ్రిగేడ్‌. ఈ బ్రిగేడ్‌ను అజోవ్‌ సముద్రం పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. వీరిని పుతిన్‌ నియోనాజీలుగా అభివర్ణించారు. దాదాపు 900 మంది అతివాదులు దీనిలో ఉన్నారు. మెరైన్‌ బ్రిగేడ్‌ బృందం గత వారం నుంచి వీరితో కలిసి రష్యాపై పోరు జరుపుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని