close

ప్రధానాంశాలు

కష్ట కాలంలో కేంద్రం భరోసా

రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ

నిరుపేదలకు మూడు నెలలపాటు ఉచిత రేషన్‌
వైద్య సిబ్బందికి రూ.50 లక్షల వ్యక్తిగత వైద్య బీమా
రైతులకు పీఎం కిసాన్‌ కింద రూ.2వేలు
జన్‌ధన్‌ ఖాతాలున్న మహిళలకు రూ.500
100 మంది లోపు ఉద్యోగులున్న సంస్థల్లో పనిచేసే వారి పీఎఫ్‌ కేంద్రమే చెల్లింపు

‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ పేరిట ప్రకటించిన నిర్మలా సీతారామన్‌
ఈనాడు, దిల్లీ

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నిరుపేదలను ఆదుకోవడానికి ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే మూడు నెలల పాటు దీన్ని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌లు గురువారం వెల్లడించారు.

పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. లాక్‌డౌన్‌ ప్రకటించిన 36 గంటల్లోనే సమగ్ర ప్యాకేజీని తెచ్చినట్లు తెలిపారు. మిగతా రంగాల సమస్యలపై అధ్యయనం చేసి త్వరలోనే వాటిపై స్పందిస్తామని చెప్పారు. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి, పూటగడవడమెలా అని ఆందోళన చెందుతున్నారని, వారి సంక్షేమం కోసం ఈ ప్యాకేజీని తెచ్చినట్లు ప్రకటించారు. ఎవరి కడుపులు, బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండకూడదన్నదే దీని ఉద్దేశమన్నారు. ఈ ప్యాకేజి ద్వారా ఆహార, ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు, నగదు బదిలీ ద్వారా డబ్బు పేదలకు చేరతాయని ప్రకటించారు. కేంద్ర మంత్రి
ప్రకటించిన ప్యాకేజీ వివరాలు ఇలా...


వైద్య సిబ్బందికి వైద్య బీమా: ప్రాణాలను పణంగా పెట్టి, కరోనా వైరస్‌ రోగులకు వైద్యసేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, వైద్య సాంకేతిక, పారిశుద్ధ్య, పారా మెడికల్‌ సిబ్బంది, నర్సులు, వైద్యులకు రూ.50 లక్షల వ్యక్తిగత వైద్య బీమా. దీనివల్ల 20 లక్షల మందికి ప్రయోజనం.


ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన: 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా ప్రస్తుతం నెలకు 5 కిలోల చొప్పున గోధుమలు/బియ్యం ఇస్తున్నారు. దీనికి అదనంగా.. వచ్చే మూడు నెలలపాటు నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా ఇస్తారు. ప్రతి కుటుంబానికి నెలకు కేజీ పప్పు ధాన్యాలను అందిస్తారు.


ఉపాధి హామీ వేతనం రూ.20 పెంపు: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాలు రూ.182 నుంచి రూ.202కి పెంపు. దీనివల్ల 5 కోట్ల కుటుంబాలకు అదనపు లబ్ధి.


దుర్బల వర్గాలకు రెండు విడతల్లో రూ.వెయ్యి: 60 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎక్స్‌గ్రేషియా కింద వచ్చే 3 నెలల్లో రెండు విడతల్లో రూ.వెయ్యి జమ.


రైతులకు రూ.2 వేలు: ప్రస్తుతం ‘పీఎం కిసాన్‌’ కింద ఏటా రూ.6వేలను మూడు వాయిదాల్లో అందిస్తున్నారు. ఈ దఫా తొలి వాయిదా రూ.2వేలను ఏప్రిల్‌ మొదటి వారంలోనే జమ చేస్తారు. దీనివల్ల 8.69 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.


జన్‌ధన్‌ మహిళలకు నెలకు రూ.500: జన్‌ధన్‌ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు వచ్చే మూడు నెలలపాటు నెలకు రూ.500 చొప్పున జమ చేస్తారు.


3 నెలలు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌: ప్రధాన మంత్రి ‘ఉజ్వల యోజన’ కింద లబ్ధి పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు వచ్చే 3 నెలలపాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్ల సరఫరా.


మహిళా స్వయం సహాయక సంఘాల రుణ పరిమితి రెట్టింపు: దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల స్వయం సహాయక సంఘాలకు పూచీకత్తు లేకుండా ఇస్తున్న రుణ పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. దీనివల్ల 7 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం.


సంఘటిత రంగ కార్మికులు
100 మంది వరకు పనిచేస్తున్న సంస్థల్లో 90% మంది ఉద్యోగులు నెలకు రూ.15వేల లోపు వేతనాలు పొందుతున్నట్లయితే వారికి సంబంధించిన ప్రావిడెంట్‌ ఫండ్‌ను మూడు నెలలపాటు కేంద్రమే చెల్లిస్తుంది. ఉద్యోగి వాటా 12%, యజమాని వాటా 12% కలిపి 24% మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా జమవుతుంది. దీనివల్ల 80 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది.

ఈపీఎఫ్‌ఓ ఉపసంహరణ
సంఘటిత రంగంలోని కార్మికులు ప్రస్తుత కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వారి పీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తంలో 75% కానీ మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తం కానీ (ఏదితక్కువైతే అది) నాన్‌ రీఫండబుల్‌ అడ్వాన్స్‌ కింద తీసుకోవచ్చు. ఈపీఎఫ్‌ కింద నమోదైన 4.8 కోట్లమంది కార్మికులు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు.

నిర్మాణరంగ కార్మికులు
‘భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి’ కింద జమ అయిన రూ.31 వేల కోట్లను.. 3.5 కోట్ల మంది రిజిస్టర్డ్‌ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసలుబాటు కల్పిస్తారు.

జిల్లా ఖనిజ నిధి
రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్న జిల్లా ‘ఖనిజ నిధి’ని కొవిడ్‌-19 వైద్య పరీక్షలు, స్క్రీనింగ్‌, మందులు, కరోనా నియంత్రణకు అవసరమయ్యే ఇతర సౌకర్యాలకు ఉపయోగించుకొనే వెసులుబాటు. ఇవన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. బ్యాంకు ఖాతాలు లేనివారి వివరాలను తమ దృష్టికి తీసుకొస్తే తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. పేదలు డబ్బు, ఆహారం గురించి ఆందోళన చెందే పరిస్థితిని ఈ ప్యాకేజీ దూరం చేస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా ఒకేసారి ఇంత పెద్దఎత్తున చేసే నగదు బదిలీ వల్ల బ్యాంకులపై పడే భారాన్ని ముందే ఊహించామని, అందుకే లాక్‌డౌన్‌ నుంచి బ్యాంకులను మినహాయించామని మంత్రి చెప్పారు. బ్యాంకులు, బ్రాంచీలు, ఏటీఎంలు, బ్యాంకు మిత్రలు, రూపే కార్డు కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు. దాదాపు 80% జన్‌ధన్‌ ఖాతాదారులకు రూపే కార్డులున్నందున ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకోవచ్చని చెప్పారు. భారతీయ పారిశ్రామిక రంగానికి ప్యాకేజీ గురించి అడగ్గా.. మిగతా విషయాలపై సంప్రదింపులు సాగిస్తున్నామన్నారు. అక్వా రైతులకు అవసరమైన శానిటరీ వస్తువుల దిగుమతులకు అనుమతి ఇవ్వడంతోపాటు, పలు రాయితీలు ప్రకటించామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. బ్యాంకుల విలీనానికి ఏప్రిల్‌ 1వ తేదీ గడువు యథావిధిగా ఉంటుందని చెప్పారు. రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించినప్పటికీ.. ఆర్థిక శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటనలో మాత్రం రూ.1,18,600 కోట్లకు మాత్రమే వివరాలున్నాయి.


ప్యాకేజీతో పేదలకు భరోసా

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నష్టపోయే పేదలకు మా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఆహార, జీవనోపాధి భద్రత సమకూరుస్తుంది. ఈ విపత్కర సమయాన్ని ఎదుర్కొనేలా పేదలు, అణగారిన వర్గాలకు సాధ్యమైనంత సహాయం అందాలన్నదే మా దృఢ సంకల్పం.

- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.