న్యుమోనియాపై టీకా అస్త్రం

ప్రధానాంశాలు

న్యుమోనియాపై టీకా అస్త్రం

ఐదేళ్లలోపు చిన్నారులకు రక్ష 

ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చేనెల నుంచి ఉచిత పంపిణీ

ఈనాడు- హైదరాబాద్‌: ఐదేళ్లలోపు చిన్నారులకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వ్యాధుల్లో ‘న్యుమోనియా’ ముఖ్యమైనది. మనదేశంలో ఈ వ్యాధి కారణంగా ఏటా ఐదేళ్ల లోపు పిల్లలు సుమారు 1.4 లక్షలమంది మృత్యువాతపడుతున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాల్లో.. ప్రతి ఆరుగురిలో ఒకరు న్యుమోనియా కారణంగానే మృతి చెందుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వ్యాధిని నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘న్యుమోకాకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ)’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేటులో ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో డోసుకు సుమారు రూ. 2,800- 3,800 వరకూ వసూలు చేస్తున్నారు. ఇంత ఖరీదైన ‘పీసీవీ’ టీకాను ఇప్పుడు సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యంలో ఉచితంగా అందజేయనున్నారు. న్యుమోనియా కారక మరణాలు అత్యధికంగా నమోదవుతున్న బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిని ప్రారంభించారు. తెలంగాణలో వచ్చే నెల రెండోవారం నుంచి ప్రభుత్వ వైద్యంలో ఈ టీకాను ప్రారంభించడానికి వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది.

ఏటా 6.35 లక్షలమందికి లబ్ధి

ప్రైవేటు వైద్యంలో టీకా ఇప్పటికే అందుబాటులో ఉన్నా ఖరీదు ఎక్కువగా ఉండడంతో.. ఎక్కువమంది ముందుకురావడం లేదు. తెలంగాణలో ఏడాది లోపు శిశువుల సంఖ్య ఏటా 6.35 లక్షలుగా నమోదవుతుండగా.. ఐదేళ్లలోపు చిన్నారులు 40 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ వైద్యంలో టీకా ఉచితంగా అందుబాటులోకి వస్తుండడంతో.. ఏడాదిలోపు చిన్నారులకు ప్రయోజనం కలుగుతుందని వైద్యవర్గాలు తెలిపాయి.

9 నెలల్లోపు మూడుసార్లు

ఈ టీకాను 3దశల్లో 0.5 మి.లీ. చొప్పున ఇస్తారు. శిశువు పుట్టిన 6 వారాలకు తొలిడోసు.. 14 వారాలకు మలిడోసు ఇవ్వాల్సి ఉంటుంది. బూస్టర్‌ డోసును శిశువు పుట్టిన 9 నెలలకు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఏడాదిలోపు తప్పనిసరిగా తీసుకోవాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని