కార్లు... ట్రాక్టర్లవైపే మొగ్గు

ప్రధానాంశాలు

కార్లు... ట్రాక్టర్లవైపే మొగ్గు

దళితబంధు లబ్ధిదారుల్లో అత్యధికుల ఆకాంక్ష ఇదే

ఈనాడు, హైదరాబాద్‌: ‘సార్‌...! రూ.10 లక్షలతో సొంతంగా కారు కొని అద్దెకు ఇస్తా. లేకుంటే నేనే నడుపుతా’. ‘నియోజకవర్గంలో వ్యవసాయ పనులకు డిమాండ్‌ ఎక్కువ. అందుకే ట్రాక్టర్‌ కొంటా’... దళితబంధు లబ్ధిదారులు అధికారులకు చెబుతున్న స్వయం ఉపాధి పథకాలివి. 70 శాతానికి పైగా లబ్ధిదారులు వీటితోనే ఉపాధి పొందాలని భావిస్తున్నారు. హుజూరాబాద్‌లో దళితబంధును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం... హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దాదాపు 20 వేల ఎస్సీ కుటుంబాలున్నాయి. ఇప్పుడు దళితబంధు కోసం లెక్కలు వేయగా, దాదాపు 25 వేల కుటుంబాలున్నట్లు తేలింది. లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు 18 వేల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులు జమయ్యాయి. స్వయం ఉపాధి పథకానికి అధికారులు ఆమోదం తెలిపిన తరువాత ఆ నిధులను వినియోగించుకునే వీలుంది. ఎక్కువ మంది కార్లు, ట్రాక్టర్లు కోరుకోవడంతో, మెరుగైన ఆదాయం పొందే ఇతర పథకాల గురించి అధికారులు వారికి వివరిస్తున్నారు. కార్లు, ట్రాక్టర్లు ఎక్కువ మంది తీసుకుంటే డిమాండ్‌, ఆదాయం తగ్గే ప్రమాదముందని సూచిస్తున్నారు. వారం, పది రోజుల్లో అర్హత కలిగిన దళిత కుటుంబాలన్నిటికీ రూ.10 లక్షల చొప్పున నగదు జమయ్యే అవకాశముందని తెలుస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని