Compensation: ఇంట్లో మరణించినా.. కరోనా పరిహారం

ప్రధానాంశాలు

Compensation: ఇంట్లో మరణించినా.. కరోనా పరిహారం

వైద్యుడి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి

రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రాథమిక మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ బారినపడి ఆసుపత్రుల్లోనే కాదు.. ఇళ్లలోనూ మరణిస్తుంటారు. ఆసుపత్రుల్లోనే కాకుండా ఇళ్లలో మృతి చెందిన వారికి కూడా కరోనా పరిహారం అందనుంది. అయితే.. ‘కరోనాతో మృతి చెందారు’ అంటూ వైద్యుడు జారీ చేసే మరణ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలి. దీని ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సాధారణంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 25 రోజుల్లోపే 95 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. కొవిడ్‌గా తేలిన తేదీ నుంచి 30 రోజుల్లోపు సంభవించే మరణాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో నెల దాటిన తర్వాత కూడా మహమ్మారితో మరణిస్తున్నారు. వైద్యుడు ధ్రువీకరిస్తే అటువంటి వారికి పరిహారం అందించాలని సూచించింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించింది. అయితే.. ఇవి ప్రాథమిక మార్గదర్శకాలేననీ, పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చిన తరవాతే పరిహారం అంశంపై దృష్టి పెడతామని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయమే కీలకం

ఆసుపత్రుల్లో మృతి చెందిన కొవిడ్‌ బాధితులకు సంబంధిత వైద్యుడు మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. దాని ఆధారంగానే పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అధికారిక గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు 3,911 మంది కరోనాతో మృతి చెందారు. అయితే, ఈ గణాంకాల పరిధిలోకి రాని మృతులకు సంబంధించిన దరఖాస్తులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కరోనా మరణాల ధ్రువీకరణ కోసం ఇప్పటికే వైద్యనిపుణుల బృందంతో రాష్ట్రంలో ప్రత్యేక కమిటీ నియమించారు. దీనికి తోడుగా జిల్లా స్థాయుల్లోనూ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటిలో అదనపు కలెక్టర్‌, ముఖ్య వైద్యాధికారి, వైద్య కళాశాల ప్రధానాచార్యులు, ఒక వైద్యనిపుణుడు సభ్యులుగా ఉంటారు. వీరే కరోనా మరణాల దరఖాస్తులను పరిశీలించి ధ్రువీకరిస్తారు. జిల్లాల్లో జారీ చేసే ధ్రువపత్రాలు, దరఖాస్తులపై చిక్కులు, సందేహాలు ఉంటే రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ కమిటీ నిర్ణయమే పరిహారం మంజూరుకు కీలకం. కమిటీ ధ్రువపత్రం ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇదిలా ఉండగా.. తుది మార్గదర్శకాలు ఎప్పటిలోగా జారీ అవుతాయి, పరిహారం కోసం ఎప్పటి నుంచి దరఖాస్తులు సమర్పించాలి అన్న అంశాలపై స్పష్టత రాలేదని రాష్ట్ర వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. విషప్రయోగాలు, హత్యలు, ఆత్మహత్యలు, ఇతర ప్రమాదాల కారణంగా సంభవించిన మరణాలను కరోనా మరణాలుగా పరిగణించవద్దని రాష్ట్రాలకు కేంద్రం కచ్చితంగా తెలియజేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని