దేశానికే దిక్సూచి దళిత బంధు

ప్రధానాంశాలు

దేశానికే దిక్సూచి దళిత బంధు

ప్రశంసించిన ప్లీనరీ
ఏకగ్రీవంగా ఏడు తీర్మానాలకు ఆమోదం


ఏకగొంతుతో అభినందన

 ప్రతిపాదన: మాజీ సభాపతి మధుసూదనాచారి 

 బలపరిచింది: విప్‌ గొంగిడి సునీత

‘తెలంగాణ దళితబంధు పథకం దేశానికి దారి చూపుతుంది. తద్వారా దేశంలోని దళితుల జీవనగతిని మార్చివేసే ఉజ్వలమైన పథకంగా చరిత్రకెక్కుతుంద’నే  విశ్వాసాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ (ప్లీనరీ) ప్రకటించింది. ‘75 సంవత్సరాలుగా వివక్షకు గురైన దళితులు ఇక ముందు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలనే ఈ పథకం లక్ష్యాన్ని ప్రభుత్వం నూటిని నూరుపాళ్లు నెరవేరుస్తుంది. ఈ పథకంతో నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్న ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించడంపైనా అభినందనలు అందిస్తున్నాం’ అని తెరాస ప్లీనరీ ప్రకటించింది. మొత్తం ఏడు తీర్మానాలపై చర్చించి ఆమోదించింది.


తెరాస విజయాలతో మొదలు..   

 ప్రతిపాదన: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

 బలపరిచింది: కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అరిగెల నాగేశ్వరరావు

ఇరవై ఏళ్ల ప్రస్థానంలో ప్రాంతీయంగా, జాతీయ స్థాయిలో తెరాస సాధించిన చారిత్రక విజయాల స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ప్లీనరీ తీర్మానించింది. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలంగాణ ప్రాంతంతోపాటు జాతీయస్థాయికి తెరాస ఏ విధంగా తీసుకెళ్లిందనే వివరాలను ప్రతినిధులు వెల్లడించారు. ఏడేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి, సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్షను ప్రతినిధులు అభినందించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2013-14లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126. నేడు రూ.2,37,632. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ.1,28,829. దేశ తలసరి ఆదాయం కన్నా  రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉంది. దీర్ఘ దృష్టితో రూపొందించిన ప్రణాళికతో, స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా నిలుస్తోంది.  మిషన్‌భగీరథ కారణంగా రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ బారిన కొత్తగా ఎవరూ పడటం లేదని కేంద్రం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. గోదావరి, కృష్ణా జలాలను బీడుభూములకు మళ్లించడానికి సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు ఫలిస్తున్నాయి. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యం సాకారమవుతోంది. మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం, చెక్‌డ్యాంల నిర్మాణం, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో ఆయకట్టుకు నీరందుతోంది.


దళిత రక్షణ నిధి   

 ప్రతిపాదన: వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ 

 బలపరిచింది: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ స్వయంగా  దళిత బంధు పథకానికి రూపకల్పన  చేశారు. ఇన్నాళ్లూ వారికి అందించిన చిన్న చిన్న రుణాలు, రాయితీల వంటి అరకొర సహాయాలతో వారి పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదు. అందుకే ఒక యూనిట్‌ పెట్టుకోవడానికి రూ.10 లక్షలను ఆర్థిక ప్రేరణగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేసింది. దళితులను వివిధ వ్యాపారాల్లో ప్రోత్సహించడానికి ప్రత్యేక రిజర్వేషన్లు అమల్లోకి తేనున్నది. ప్రభుత్వ కాంట్రాక్టులు, మద్యం దుకాణాల లైసెన్సులు తదితరాల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్‌ అమల్లోకి తేనుంది.  


సంక్షేమ తెలంగాణ  

 ప్రతిపాదన: మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి 

 బలపరిచింది: మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, సత్యవతి

సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసంతో తెలంగాణ సమాజం ఛిన్నాభిన్నమైందున  ఆవిర్భావం నుంచి బడ్జెట్‌లో ఎక్కువభాగం ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం కేటాయిస్తోంది. ఏటా సగటున రూ.50 వేల కోట్లను అందుకు ఖర్చుచేస్తోంది. సమైక్య రాష్ట్రంలో రూ.200 పింఛను ఉండగా తెరాస ప్రభుత్వం రూ.2016కు పెంచింది. వృద్ధాప్య పింఛను వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. షెడ్యూల్డు కులాలు, తెగలకు రూ.1,00,116 మొత్తాన్ని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఇస్తోంది. ¸పేదలకు 100 శాతం రాయితీతో 2.91 లక్షల రెండు పడక గదుల ఇళ్లను కట్టించి ఇస్తుండగా వీటిలో 1.03 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.


పరిపాలన సంస్కరణలు 

 ప్రతిపాదన: మంత్రి కేటీ రామారావు 

 బలపరిచింది: మంత్రి జగదీశ్‌రెడ్డి

రాష్ట్రంలో పాలన సంస్కరణలు శరవేగంగా సాగుతున్నాయి. 60 లక్షల మందికి రైతుబంధు సులువుగా అందుతోంది. ధరణి పోర్టల్‌ ఏర్పాటుతో నూతన శకానికి నాంది పలికింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న సాగునీటి వ్యవస్థల నిర్వహణ భవిష్యతులో నీటిపారుదల శాఖకు ప్రధాన బాధ్యతగా మారనుంది.కేంద్ర ప్రభుత్వంతో సీఎం జరిపిన నిరంతర చర్చల ఫలితంగా జోనల్‌ వ్యవస్థ సాకారమైంది. ఫలితంగా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాడు స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7788 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వ కృషి మూలంగా ఆ సామర్థ్యం 16,425 మెగావాట్లకు చేరుకుంది. టీఎస్‌ ఐపాస్‌ విధానం ప్రపంచాన్ని తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసింది.


విద్య.. వైద్యం.. అభివృద్ధి  

 ప్రతిపాదన: మాజీ మంత్రి వి.లక్ష్మారెడ్డి 

బలపరిచింది: తక్కెళ్లపల్లి రవీందర్‌రావు

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 298 గురుకులాలు ఉండగా ఈ ఏడేళ్లలో 661 కొత్త స్థాపించింది. రాష్ట్రంలో ఇప్పుడు 268 ఎస్సీ గురుకులాలు, 30 ఎస్సీ మహిళల డిగ్రీ కళాశాలలు, 281 బీసీ గురుకుల పాఠశాలలు, 204 మైనారిటీ సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. మహిళల ప్రసూతి విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. మాతా, శిశు సంరక్షణకు ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ దేశంలోనే గొప్పగా నిలిచింది. దేశంలోనే తొలిసారి మెటర్నిటీ ఐసీయూలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 12 వైద్య కళాశాలలు మంజూరు చేసింది. రాబోయే రోజుల్లో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. నగరానికి నాలుగు దిక్కులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను మంజూరు చేసింది.


కేంద్ర ప్రభుత్వానికి తెరాస డిమాండ్లు  

 ప్రతిపాదన: ఎంపీ నామా నాగేశ్వరరావు 

 బలపరిచింది: ఎంపీ రంజిత్‌రెడ్డి

2020-21 జనగణనలో కులాలవారీగా బీసీ జనాభా లెక్కలను సేకరించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. దీనిపై శాసనసభలోనూ ప్రభుత్వం తీర్మానించి కేంద్రానికి పంపింది. బీసీ కులాల కోసం కేంద్రంలో ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ అనేకసార్లు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు మరోసారి డిమాండ్‌ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపైనా శాసనసభ పంపిన తీర్మానాన్ని ఆమోదించాలి. ముస్లిం రిజర్వేషన్లు బీసీ-ఈ కోటా కింద నాలుగు శాతం నుంచి 12 శాతానికి, గిరిజనులకు ఆరు శాతం నుంచి 10 శాతానికి పెంచాలి. ఐటీఐఆర్‌ రద్దు, వరంగల్‌లో రైల్వే కోచ్‌ పరిశ్రమ పెట్టబోమని కేంద్రం ప్రకటించడం ఆక్షేపణీయం. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విభజన, కాళేశ్వరం లేదా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లో ఒక దానికి జాతీయ హోదా, వెనకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, గిరిజన వర్సిటీ, కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎం ఏర్పాటు, అసెంబ్లీ స్థానాల పెంపు, పారిశ్రామిక రాయితీ సమస్యలనూ పరిష్కరించాలి.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని