వీసీల నియామకంపై సర్కారుకు హైకోర్టు నోటీసులు

ప్రధానాంశాలు

వీసీల నియామకంపై సర్కారుకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ యూనివర్సిటీలకు అర్హతలు లేనివారిని వైస్‌ఛాన్సలర్‌(వీసీ)లుగా నియమించడంపై ప్రభుత్వానికి, వర్సిటీలకు బుధవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ వర్సిటీలకు వీసీల నియామకాన్ని సవాలు చేస్తూ నిజామాబాద్‌కు చెందిన మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.విద్యాసాగర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ వీసీగా నియామకానికి కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలన్నారు. కాకతీయ వర్సిటీ వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ టి.రమేశ్‌కు ఆ అనుభవం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పదేళ్లు లేదంటే తత్సమానమైన హోదాలో లేరా? అని ప్రశ్నించింది. న్యాయవాది బదులిస్తూ రమేశ్‌ టీచర్‌గా మాత్రమే పనిచేశారన్నారు. తెలుగు యూనివర్సిటీ వీసీగా నియమితులైన డాక్టర్‌ తంగెడ కిషన్‌రావు వయోపరిమితి దాటిందని, 70 ఏళ్లకు మించినవారిని నియమించరాదని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వం, యూనివర్సిటీలతో పాటు వీసీలుగా నియమితులైన రమేశ్‌, కిషన్‌రావులకు నోటీసులు జారీచేసింది. విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని