శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో నీటి వృథా

ప్రధానాంశాలు

శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో నీటి వృథా

తెలంగాణపై కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ‘ప్రస్తుతం నాగార్జున సాగర్‌ దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నా జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తోంది. ఆ నీరంతా సముద్రంలోకి వృథాగా పోతోంది. ఇప్పటికే శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా వాడుకున్న 113.57 టీఎంసీల నీటిని.. కృష్ణా నదిలో ఆ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా 299 టీఎంసీలలో భాగంగా పరిగణించాలి. ఈ మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు కేంద్రానికి లేఖ రాయాలి’ అని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును డిమాండ్‌ చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు బుధవారం బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాల నుంచి (86.60+ 23.63) 110.23 టీఎంసీల నీటిని తెలంగాణ అనధికారికంగా విద్యుదుత్పత్తికి వాడుకుందని, అంతే నీటిని ఏపీకి కేటాయించాలని లేఖలో కోరారు. రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూలు తొమ్మిదో పేరాలో పేర్కొన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రస్తావించారు. జలవిద్యుదుత్పత్తి అంశం సహా, 14వ బోర్డు భేటీలో మిగిలిపోయిన ఎజెండాపై చర్చించేందుకు తక్షణమే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ‘14వ బోర్డు సమావేశంలో చర్చించిన మేరకు.. ప్రాజెక్టుల దిగువ నీటి అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పత్తి చేయాలి తప్ప, అనుమతులు లేకుండా చేయడానికి వీల్లేదని నిర్ణయించారు. తద్విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నేటికీ శ్రీశైలంలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది’ అని ఏపీ లేఖలో పేర్కొంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని