మినుములు పండిస్తే కొంటాం

ప్రధానాంశాలు

మినుములు పండిస్తే కొంటాం

ఆయిల్‌పాం పంట సాగును ప్రోత్సహిస్తాం
వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి  

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత యాసంగిలో మినుములు సాగు చేస్తే మద్దతు ధరకు కొంటామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ పంటను విరివిగా సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. మార్కెట్‌లో ఎంత ధర ఉన్నా కనీస మద్దతుధర క్వింటాకు రూ.6300 చొప్పున కొనడానికి ప్రభుత్వం సిద్ధమని శుక్రవారం జరిగిన మార్క్‌ఫెడ్‌ పాలకవర్గ సభ్యుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. దేశవ్యాప్తంగా మినుములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ను సంప్రదించింది. వీటి కొనుగోలుకు నాఫెడ్‌ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పెసలు, వేరుసెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలనూ సాగు చేయాలి’ అని రైతులకు విజ్ఞప్తిచేశారు.

పామాయిల్‌ మిల్లులు నిర్మించాలి

జిల్లాలవారీగా ఆయిల్‌పాం సాగు పెంచడానికి కాంట్రాక్టు పొందిన కంపెనీలు తక్షణం పామాయిల్‌ ఉత్పత్తి మిల్లులు నిర్మిస్తే ఆ పంట సాగుపై రైతాంగానికి నమ్మకం కలిగి ఆసక్తిగా ముందుకొస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో అధికారులు, కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రాంరెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ ఎండీ సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఆయిల్‌పాం తోటల సందర్శనకు తీసుకెళ్లి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పెద్దఎత్తున ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున, కంపెనీలు నాణ్యమైన మొక్కలను నర్సరీలలో పెంచి రైతులకు సకాలంలో అందించాలన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని