ఆ సమస్యను జయించింది.. ‘కలిసి చదువుకో’మంటోంది! - delhi teen overcame anorexia depression to become an author and edtech entrepreneur at 17
close
Published : 09/08/2021 18:19 IST

ఆ సమస్యను జయించింది.. ‘కలిసి చదువుకో’మంటోంది!

(Photo: Screengrab)

ఎంతసేపూ టెన్త్ ఎగ్జామ్స్‌, ఇంటర్ ఎగ్సామ్స్‌.. అంటూ అటు స్కూల్లో టీచర్లు, ఇటు ఇంట్లో తల్లిదండ్రులు పరీక్షల పైనే దృష్టి పెడుతుంటారు.. విశ్రాంతి లేకుండా చదవమని పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తుంటారు. ఇలా ఫోకస్‌ అంతా పైతరగతులపై ఉన్నప్పుడు ప్రాథమిక తరగతుల్లో చదివే పిల్లల్ని పట్టించుకునే వారెవరు?! ‘పెద్దయ్యాక వాళ్లే నేర్చుకుంటారులే!’ అని చాలామంది పేరెంట్స్‌ తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ‘మొక్కై వంగనిదే మానయ్యాక వంగుతుందా?!’ అంటోంది పదిహేడేళ్ల అర్ష్యా గౌర్‌. చిన్నతనం నుంచే పిల్లలకు అన్ని రకాల నైపుణ్యాలు నేర్పిస్తే.. పెద్దయ్యాక ఆయా అంశాల్లో మరింత ప్రజ్ఞ సంపాదించుకోగలుగుతారని, అలాంటి విద్యే ఎప్పటికైనా పిల్లల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందంటోంది. అందుకే ప్రాథమిక దశలో చదువుకునే చిన్నారులకు ఆంగ్ల పాఠాలు నేర్పడానికి ఓ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ను ప్రారంభించిందామె. స్కూల్లో చదువుకునే రోజుల్లో బుల్లీయింగ్‌కు గురై తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొన్న ఆమె.. దాన్నుంచి బయటపడి పిల్లలకు విద్యా దానం చేయడానికి ముందుకొచ్చింది. చదువే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పే అర్ష్య.. తన స్టార్టప్‌ సక్సెస్‌ గురించి ఏం చెబుతుందో మనమూ తెలుసుకుందాం రండి..

మనం అంతగా పట్టించుకోం.. కానీ మన చుట్టూ చదువుకు నోచుకోని పిల్లలెంతోమంది ఉంటారు. ఇక ఈ ఆన్‌లైన్‌ క్లాసుల పద్ధతి వచ్చినప్పట్నుంచి స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో లేక, వాటిని కొనే స్థోమత లేక చాలామంది చిన్నారులు పుస్తకాలకు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితి దిల్లీకి చెందిన 17 ఏళ్ల అర్ష్యా గౌర్‌కు మింగుడుపడలేదు. చదువుకు ధనిక, పేద భేదం లేదని.. అందరూ చదువుకోవడానికి అర్హులే అన్న సిద్ధాంతాన్ని నమ్మే ఆమె.. గతేడాది ‘రీడ్ టుగెదర్‌’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ను ప్రారంభించింది.

వాళ్లే నా టార్గెట్!

విద్యకు సాంకేతికత జోడించి రూపొందించిన ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధించడమే లక్ష్యంగా పెట్టుకుంది అర్ష్య. ‘ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించడం బానే ఉంది.. అది కూడా 1-5 తరగతుల విద్యార్థుల కోసం.. అందులోనూ ఇంగ్లిష్‌ పాఠాలు మాత్రమే చెబుతున్నానంటే.. ఎందుకలా అన్న సందేహం మీకు రావచ్చు. అయితే అందుకూ ఓ కారణముంది. బేసిగ్గా నాకు ఇంగ్లిష్‌ అంటే చాలా ఇష్టం. చాలా స్కూళ్లలో ఇంగ్లిష్‌ మొదటి లాంగ్వేజ్‌గా ఉండదు. ఆంగ్లంలో పట్టు సాధించడం ఈ తరం పిల్లలకు అవసరం. అది కూడా ప్రాథమిక తరగతుల్లో నేర్పిస్తే పైతరగతులకు వెళ్లే కొద్దీ వారిలో ఈ సబ్జెక్ట్‌పై అవగాహన మరింతగా పెరుగుతుంది. అందుకే చిన్న తరగతుల విద్యార్థుల్నే నా టార్గెట్‌ గ్రూప్‌గా ఎంచుకున్నా. 1-5 తరగతుల వరకు ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు సంబంధించిన NCERT సిలబస్‌తో ఆడియో-వీడియో రూపంలో పాఠాలు తయారుచేస్తున్నా. ఆడియో పాఠాలు నేరుగా వినేయచ్చు.. వీడియో పాఠాలకు వాయిస్‌ ఓవర్‌ జోడిస్తున్నా (కరావోకే పద్ధతిలో అన్నమాట!). చదవలేని, రాయలేని, వివిధ రకాల వైకల్యాలున్న పిల్లలందరికీ ఈ పాఠాలు ఉపయోగపడతాయి..’ అంటోందీ టీనేజీ అమ్మాయి.

ఆ పిల్లలు వెనకబడకూడదని..!

కరోనా దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పూట గడవడానికే కష్టంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ సదుపాయం అందించలేక.. ఎంతోమంది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. అయితే పేదరికం అట్టడుగు వర్గాల చిన్నారులకు అడ్డంకిగా మారకూడదని నిర్ణయించుకుంది అర్ష్య. ఈ క్రమంలో కడుపేదరికంలో చిక్కుకొని చదువుకు దూరమైన పిల్లలకు ట్యాబ్లెట్‌ పీసీలను అందిస్తోంది. అంతేకాదు.. వాటితో పాటు ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పిస్తోంది.

‘గత కొన్నేళ్లుగా చదువు కూడా డిజిటలైజ్‌ అవుతోంది. కరోనా వచ్చినప్పట్నుంచి పిల్లలంతా ఆన్‌లైన్‌ క్లాసులకే పరిమితమయ్యారు. కాస్త డబ్బున్నోళ్లు, మధ్యతరగతి స్థాయిలో ఉన్న వాళ్లు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్స్‌/ల్యాప్‌టాప్స్‌ సహాయంతో ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నారు. మరి, ఒక్కపూటైనా తిండికి నోచుకోని పేద పిల్లల పరిస్థితేంటి..? అలాంటి వారంతా పాఠాల్లేక, పాఠశాలలు లేక దాదాపుగా చదువును పక్కన పెట్టారని చెప్పచ్చు. అందుకే అలాంటి వారందరికీ చదువును దగ్గర చేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే వాళ్లకు ఓ క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థ సహకారంతో ట్యాబ్లెట్‌ పీసీలను అందిస్తున్నా. వాటితో పాటు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తున్నా. తద్వారా వాళ్లు నా పాఠాలు సులభంగా వినగలుగుతున్నారు. ఇంగ్లిష్‌ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు..’ అంటూ తనలోని సేవాభావం గురించి పంచుకుందీ బ్రిలియంట్‌ గర్ల్.

మానసికంగా కుంగిపోయా!

దిల్లీలో ఉండే అర్ష్య ప్రస్తుతం అక్కడి వసంత్‌ వ్యాలీ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచీ ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉండేది. అయితే అలా బొద్దుగా ఉండడమే ఆమెకు శాపమవుతుందని అప్పుడు ఊహించలేదామె. ‘అప్పుడు నాకు 13 ఏళ్లుంటాయనుకుంటా. చిన్నప్పట్నుంచి కాస్త బొద్దుగా ఉండే నాకు స్కూల్లో తోటి పిల్లల నుంచే విమర్శలు ఎదురయ్యాయి. ఛోటు-మోటు అంటూ అందరూ నన్ను ఆటపట్టించే వారు. అలా వాళ్లు అనే ఆ మాటలు, వారి వెకిలి నవ్వులు నా మనసు మీద ప్రభావం చూపాయి. వాటినే పదే పదే తలచుకుంటూ కుంగిపోయేదాన్ని. రోజులు గడిచే కొద్దీ నా పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకలి మందగించింది.. ఈ సమయంలో నా కుటుంబం, టీచర్లు అండగా నిలిచారు. ఈ మానసిక పరిస్థితి నుంచి బయటపడడానికి ఫుట్‌బాల్‌ ఆడేదాన్ని. కొందరు మేటి అథ్లెట్స్‌ జీవిత చరిత్రలు చదివేదాన్ని. అయినా థెరపీ తీసుకుంటే కానీ నేను దీన్నుంచి పూర్తిగా బయటికి రాలేకపోయా. అందుకు రెండేళ్లు పట్టింది.

నా మనోభావాలకు ప్రతిరూపమే ఈ పుస్తకం!

ఇక ఈ సమయంలో నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి.. నా మదిలోని ఆలోచనలు, బాధను పేపర్‌పై పెట్టేదాన్ని.. వాటినే కవితలుగా మలిచేదాన్ని. అలా కొన్నాళ్లకు నాకు రైటింగ్‌పై పట్టు పెరిగింది. ముందు నేను రాసిన ఈ కవితలు ఎవరికీ ఉపయోగపడవనుకున్నా.. కానీ ఆ తర్వాత అర్థమైంది.. నాలా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారందరికీ ఈ కవితలు ఓ మందుగా పనికొస్తాయనిపించింది. అందుకే వాటన్నింటినీ కొలేజ్‌ చేసి ‘హౌ టు ఓపెన్‌ ఎ ప్యారాచూట్‌’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చా. ఓ యువ రచయిత్రిగా నా నైపుణ్యాలకు గుర్తింపుగా 2019లో జరిగిన ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’, ఈ ఏడాది జరిగిన ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ నుంచి నాకు ఆహ్వానాలు అందాయి. వీటితో పాటు ‘క్వీన్స్‌ కామన్వెల్త్‌ ఎస్సే రైటింగ్‌ కాంపిటీషన్’లో గోల్డ్‌ అవార్డు కూడా అందుకున్నా..’ అంటూ తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను బయటపెట్టిందీ కాలేజీ అమ్మాయి.

అవగాహన పెరగాలి!

ఇప్పటికే ఆన్‌లైన్‌ విద్యతో ఎంతోమంది చిన్నారులకు విద్యా దానం చేస్తోన్న అర్ష్య.. వీలు చిక్కినప్పుడల్లా ఆయా వేదికలపై మానసిక ఆరోగ్యం గురించి కూడా తన గళాన్ని వినిపిస్తుంటుంది. ఈ క్రమంలో పిల్లలు స్కూల్లో బుల్లీయింగ్‌కి గురికాకుండా పాఠశాల వాతావరణంలో పలు మార్పులు రావాలంటోంది. ‘బుల్లీయింగ్‌ పిల్లలు ఆడుకునే సరదా ఆటలానే అనిపించచ్చు.. కానీ దానివల్ల ఆ పసి మనసులపై ఎంత ప్రతికూల ప్రభావం పడుతుందో నాకు అనుభవమే. అందుకే ఇలాంటి పరిస్థితి మరే చిన్నారికీ రాకూడదు. ఈ క్రమంలో టీచర్లు తమ విద్యార్థులందరికీ మానసిక సమస్యలు-వాటి పరిష్కారాలు, మానసిక ఆరోగ్యం.. తదితర అంశాలపై అవగాహన పెంచాలి. ఏదైనా సమస్య వస్తే వాళ్లకు అండగా నిలబడాలి. స్కూల్‌ వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేలా చూడాలి. వాళ్ల మనసులోని ఆలోచనల్ని, బాధల్ని పంచుకునే వేదికలా పాఠశాల మారాలి.. అప్పుడే ఈ మానసిక సమస్యలు మనసును కమ్మేయకుండా ఉంటాయి..’ అంటోందీ దిల్లీ గర్ల్.

ఇప్పటికే చాలామంది పిల్లలకు తన స్టార్టప్‌ని చేరువ చేయడానికి కొన్ని స్కూల్స్‌, ఎన్జీవోలతో మమేకమైన అర్ష్య.. దేశంలోని పేద పిల్లలందరికీ టెక్నాలజీని, తన ఈ-పాఠాల్ని చేరువ చేసినప్పుడే తన లక్ష్యం సంపూర్ణమవుతుందని చెబుతోంది.
మరి, తన అంతిమ లక్ష్యం నెరవేరాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం.. అక్కడితో ఆగిపోకుండా విద్యకు నోచుకోని పేద పిల్లల్ని ఆదుకోవడానికి మనమూ మనకు చేతనైనంత సహాయం చేద్దాం..!

 మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని