కళ్లు లేకపోతేనేం..!
close
Published : 18/03/2021 00:33 IST

కళ్లు లేకపోతేనేం..!

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ... కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ..’ అని తెలుసుకుంది నిధి గోయల్‌. ముంబయికి చెందిన ఈమె రెటీనాకు సంబంధించిన వ్యాధితో పదిహేనేళ్లకే చూపును కోల్పోయింధి. అయినా ఆ చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా పట్టుదలగా చదువును కొనసాగించింది. కాలేజీ రోజుల నుంచీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి వెంటనే ఉద్యోగాన్నీ సంపాదించింది. తన చుట్టూ జరిగిన సంఘటనలకు కాస్త హాస్యాన్ని జోడించి చెప్పడం నిధికి చిన్నతనం నుంచీ అలవాటు. దాన్నే పెద్దయిన తర్వాతా కొనసాగించింది. దివ్యాంగులు, అంధులు ఎదుర్కొనే అనేక సమస్యలను మనసుకు హత్తుకునేలా చెప్పడం మొదలుపెట్టింది. స్నేహితుల ప్రోత్సాహంతో నాలుగేళ్ల కిందట మొదటిసారిగా ప్రదర్శన ఇచ్చింది. అంధురాలైన మొదటి మహిళా స్టాండప్‌ కమెడియన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అలాగే అంధులు, దివ్యాంగులైన బాలికలు, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ‘రైజింగ్‌ ఫ్లేమ్‌’ అనే సంస్థను ముంబయిలో ఏర్పాటుచేసింది. వారు ఎదుర్కొంటోన్న లైంగిక సమస్యల మీదా నిధి పోరాడుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం దివ్యాంగుల విభాగంలో ఈమె సభ్యురాలు. అంతేకాదు యూఎన్‌ ఉమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌ అడ్వెయిజరీ గ్రూప్‌లోనూ సభ్యురాలు. తను చేస్తోన్న వివిధ సేవలకుగానూ ‘నీలమ్‌ కంగా’ లాంటి జాతీయ అవార్డులనూ అందుకుంది నిధి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి