వెకేషన్‌ లాంటి అనుభూతినిచ్చే ‘స్టేకేషన్‌’.. ఇంతకీ ఏంటీ ట్రెండ్‌! - simple staycation ideas for vacationing at home in telugu
close
Updated : 17/07/2021 17:11 IST

వెకేషన్‌ లాంటి అనుభూతినిచ్చే ‘స్టేకేషన్‌’.. ఇంతకీ ఏంటీ ట్రెండ్‌!

వీకెండ్‌ వస్తే చాలు.. దానికి ముందో, వెనకో ఒకట్రెండు రోజులు సెలవులు పెట్టుకొని నచ్చిన చోటికి చెక్కేయడం మనలో చాలామందికి అలవాటే! కానీ కరోనా వల్ల ప్రస్తుతం బయట పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇలాంటప్పుడు ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలకు వెళ్లి ముప్పు కొని తెచ్చుకునే బదులు ఇంట్లోనే మనకు నచ్చినట్లుగా ఎంజాయ్‌ చేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల వైరస్‌ ముప్పు తప్పడమే కాదు.. డబ్బు, సమయం ఆదా అవుతాయని.. అదే సమయంలో ఎంజాయ్‌మెంట్‌ కూడా మన సొంతమవుతుందంటున్నారు. ఈ క్రమంలోనే వెకేషన్‌ లాంటి అనుభూతినిచ్చే ‘స్టేకేషన్‌’ని ఎంచుకోమని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ ఏంటీ ట్రెండ్‌? దీన్నెలా ప్లాన్‌ చేసుకోవాలో తెలుసుకుందాం రండి..

స్టేకేషన్‌.. వెకేషన్‌ మాదిరిగా బయటి దేశాలకు/ప్రాంతాలకు వెళ్లకుండా ఇంట్లోనే హాలిడేని ఎంజాయ్‌ చేయడమన్నమాట! ఇందులో భాగంగా స్థానికంగా ఉండే పర్యటక ప్రదేశాల్ని సైతం చుట్టి రావచ్చు. నిజానికి ఇది పాత ట్రెండే అయినా ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. మొన్నటిదాకా రోజువారీ పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందడానికి, డబ్బు-సమయాన్ని ఆదా చేసుకుంటూ ఎంజాయ్‌ చేయడానికి ఈ వెకేషన్‌ ట్రెండ్‌ని ఎంచుకున్న వారంతా.. ఇప్పుడు సామాజిక దూరం పాటించడంలో భాగంగా దీనికి ఓటేస్తున్నారు. మొత్తానికి కారణమేదైనా సురక్షితమైన ప్రదేశంలో ఉంటూ ఎంజాయ్‌మెంట్‌కి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. అయితే స్టేకేషన్‌ ప్లాన్‌ చేసుకునే క్రమంలో కొన్ని చిట్కాలు పాటిస్తే దాన్ని పూర్తిగా ఆస్వాదించచ్చంటున్నారు నిపుణులు.

‘డిజిటల్‌ డీటాక్స్‌’ చేయాల్సిందే!

వ్యక్తిగతంగానైనా, కెరీర్‌లో భాగంగానైనా.. మనమంతా రోజూ నిరంతరాయంగా మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌తో గడిపేస్తుంటాం.. దీనివల్ల ఎంతోకొంత మానసిక ఒత్తిడి ఎదురవుతుంటుంది. నిజానికి దీన్నుంచి రిలాక్స్‌ కావడానికే వెకేషన్‌ ప్లాన్‌ చేసుకుంటాం. అలాంటిది ఆ సమయంలోనూ ఇలాంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ పట్టుకొని కూర్చుంటే సరదాగా గడపాల్సిన సమయం కాస్తా వృథా అయిపోతుంది. అందుకే స్టేకేషన్‌ సమయంలో డిజిటల్‌ డీటాక్స్‌ పాటించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అంటే ఆ రోజంతా మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌, టీవీ.. వంటి వాటికి దూరంగా ఉండాలన్నమాట! ఈ క్రమంలో మొబైల్స్‌లో ఆడే గేమ్స్‌కి బదులు ఇంటి సభ్యులంతా కలిసి మీకు నచ్చిన ఆటలాడుకోవచ్చు.. అదే సినిమాలు చూసే బదులు.. అంత్యాక్షరి, డమ్‌షాట్‌, కొన్ని సినిమా సన్నివేశాలు తీసుకొని మీరే వాటిలో నటించి చూపించడం.. వంటి వినోదభరితమైన ఆటల్ని ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒత్తిడిని దూరం చేసి.. ఆనందాన్ని దగ్గర చేసేవే!

ప్రకృతితో గడిపేద్దాం!

మనం ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్లినప్పుడు ఆ ప్రదేశంలోని కొండ-కోనలు, పచ్చపచ్చటి ప్రకృతికి ఆలవాలమైన ప్రాంతాల్ని చూడందే వెనుదిరగం.. కదా! అయితే ఇదే పద్ధతిని స్టేకేషన్‌లోనూ ప్లాన్‌ చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగంటే.. ఇప్పుడు చాలా ఇళ్లలో గార్డెనింగ్‌కి కూడా ప్రాధాన్యమిస్తున్నారు. అంటే మీ ఇంట్లోనూ ఓ చిన్న ఉద్యానవనం ఉండే ఉంటుంది. సో.. స్టేకేషన్‌ కోసం అదే సరైన విడిది! ఈ క్రమంలో ఆ గార్డెన్‌ మధ్యలో ఓ చిన్న క్యాపింగ్‌ టెంట్‌ వేసేయండి.. ఇది వాటర్‌ప్రూఫ్‌ది అయితే మరీ మంచిది. ఒకవేళ అనుకోకుండా వర్షం పడినా.. మీ వెకేషన్‌కి అంతరాయం కలగకుండా ఉంటుంది. ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇందులోనే ఎంజాయ్‌ చేసేయచ్చు. ఈ క్రమంలో ఓ చిన్న పాట్‌లక్‌ పార్టీ (ఇంట్లో వాళ్లంతా తలా ఓ వంటకం తయారుచేసుకొని తీసుకురావడం) ఏర్పాటుచేసుకోవడం, మధ్యాహ్నం కాసేపు అక్కడే సేదదీరడం, సాయంత్రం సరదాగా నచ్చిన ఆటలాడుకోవడం, ఇక రాత్రుళ్లు కూడా ఇక్కడే క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటుచేసుకోవడం.. ఇలా రోజంతా పచ్చపచ్చటి ప్రకృతి మధ్య ఈ టెంట్‌లోనే బస చేయడం వల్ల నిజంగానే వెకేషన్‌కి వెళ్లిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు. కావాలంటే మీరూ ప్రయత్నించండి!

ఇట్స్‌ ‘స్పా’ టైమ్‌!

ఎంత వెకేషన్‌ అయినా, కుటుంబ సభ్యులందరితో కలిసి సమయం గడిపినా.. ఎవరికి వారు కాస్త సమయం కేటాయించుకోవడమూ అవసరమేనంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో హోమ్‌ స్పా చక్కటి ఎంపిక. అయితే ఇందులో భాగంగా అందానికి మెరుగులుదిద్దుకోవడం, కాసేపు బాత్‌టబ్‌లో సేదదీరడంతో పాటు నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం.. ఇలా మీకు ఏది ఇష్టమనిపిస్తే ఆ పని చేయచ్చు. ఇక బాడీ మసాజ్‌ చేయించుకోవాలనుకునే వారు ఇంట్లో వాళ్ల సహాయం తీసుకోవచ్చు. ఇలా మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. తద్వారా శరీరం, మనసు.. రెండూ ఏకకాలంలో రిలాక్సవుతాయి. ఎక్కడికెళ్లినా దొరకని ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇలా ఇంట్లో ఉంటూనే పొందచ్చంటున్నారు నిపుణులు.

తనివి తీరేలా.. మనసు నిండేలా!

స్టేకేషన్‌ అంటే రోజంతా ఇంట్లోనే ఉండాలన్న నియమమేమీ లేదు.. మీరు ఉండే ప్రాంతంలో చూడదగిన ప్రదేశాలుంటే అక్కడికి వెళ్లి కూడా ఎంజాయ్‌ చేయచ్చు. అయితే ఇందుకోసం ప్రజా రవాణా కాకుండా మీ సొంత వాహనాలైతే మరీ మంచిది. మీకు మీరే వెళ్లి రావచ్చు. అలాగే వెళ్లే ప్రదేశాల్లో రద్దీ లేకుండా చూసుకోవడమూ ముఖ్యమే! అంతేకాదు.. పెద్దలు, పిల్లలు.. మాస్కులు, శానిటైజర్లు.. వంటి కనీస జాగ్రత్తలు మరవకూడదు. ఆహారం కూడా ఇంటి నుంచే ప్రిపేర్‌ చేసుకొని తీసుకోగలిగితే మరీ మంచిది. తద్వారా బయటికి వెళ్లినట్లూ ఉంటుంది.. కుటుంబంతో సరదాగా గడిపిన సంతృప్తి కలుగుతుంది కూడా!

పిల్లల కోసం ప్రత్యేకంగా ఇలా!

ఎంత పెద్ద వాళ్లతో గడిపినా.. పిల్లలు తమ తోటి పిల్లలతో ఆడుకోవడానికే ఇష్టపడుతుంటారు. అయితే ఈ కరోనా సమయంలో అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకొస్తున్న ‘సోషల్‌ బబుల్‌’ అనే విధానంతో ఇది సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. మీరు ఉండే అపార్ట్‌మెంట్‌/ గేటెడ్‌ కమ్యూనిటీల్లో.. పెద్దలంతా టీకా వేయించుకొని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, దీనిపై కనీస అవగాహన పెంచుకున్న కుటుంబాలున్నట్లయితే.. వాళ్లంతా కలిసి ఒక కమ్యూనిటీ/బృందంగా ఏర్పడచ్చు. తద్వారా వాళ్లంతా అప్పుడప్పుడూ కలుసుకోవడం, ఈ కుటుంబాలకు చెందిన పిల్లలంతా కలిసి ఆడుకోవడం, కనీస జాగ్రత్తలు పాటించడం.. వంటివి చేయచ్చు..! ఒకవేళ ఇతర పిల్లలతో ఆడుకోవడం ఇష్టం లేకపోతే.. స్థానికంగా ఉండి, ఇంతకుముందు చెప్పినట్లుగా అన్ని కరోనా జాగ్రత్తలు పాటించే మీ బంధువుల కుటుంబాల్లోని పిల్లలంతా కలిసి ఆడుకునే అవకాశం కూడా ఇవ్వచ్చు. ఇలా సోషల్‌ బబుల్‌లో స్టేకేషన్‌నూ భాగం చేసుకోవచ్చు. తద్వారా పిల్లల్లోనూ మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. ఆనందం పెరుగుతుంది.. అయితే పిల్లలంతా తగిన జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే!

కాబట్టి వెకేషన్‌ అంటూ ఎక్కడెక్కడికో వెళ్లి కష్టాలు కోరి తెచ్చుకునే బదులు ఇంట్లోనే సురక్షితంగా ఇలా స్టేకేషన్‌ని ఎంజాయ్‌ చేయగలిగితే.. ఆ అనుభూతులు జీవితాంతం మనతోనే ఉండిపోతాయి.. పైగా వెకేషన్‌ అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాం.. స్టేకేషన్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ.. అదీ ఇంట్లోనే కాబట్టి వారానికో థీమ్‌ చొప్పున ప్లాన్‌ చేసుకోవచ్చు.

మరి, మీరూ ఇదివరకే స్టేకేషన్‌ని ఎంజాయ్‌ చేశారా? అయితే ఆ ఐడియాలు, ఈ క్రమంలో మీరు పొందిన మధురానుభూతుల్ని అందరితో పంచుకోండి..!

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని