మీ భాగస్వామి తరచూ నిందిస్తున్నారా..? - tips to coping with criticism in marriage
close
Published : 10/08/2021 20:58 IST

మీ భాగస్వామి తరచూ నిందిస్తున్నారా..?

భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడూ మాటామాటా అనుకోవడం సహజం. అయితే ఎప్పుడో ఒకసారి కాకుండా తరచూ మీ భాగస్వామి మిమ్మల్ని నిందిస్తుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇవి భార్యాభర్తల మధ్య బంధాన్ని బీటలు వారేలా చేయడమే కాకుండా, ఒకింత అభద్రతా భావాన్ని కూడా కలిగించే అవకాశాలున్నాయట! ఈ నేపథ్యంలో భాగస్వామి తరచూ మిమ్మల్ని నిందిస్తుంటే ఏం చేయాలి? అలాంటి సందర్భాల్లో వివాహ బంధం బీటలు వారకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం రండి..

భార్యాభర్తల మధ్య చిరుకోపం, చిన్న చిన్న కలహాలు.. ఇవన్నీ హద్దుల్లో ఉన్నంత వరకు ముద్దుగానే ఉంటాయి. హద్దు దాటితేనే చినికి చినికి గాలివానగా మారతాయి. అలాగే దంపతులిద్దరూ ఒక్కో సందర్భంలో ఒకరినొకరు నిందించుకోవడం సహజం. అయితే వాటి వల్ల వైవాహిక బంధానికి బీటలు వారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

పూర్తిగా వినండి..

భాగస్వామి ఏ విషయంలో, ఎందుకు మిమ్మల్ని నిందిస్తున్నారో తెలుసుకోవాలంటే ముందుగా వారు చెప్పేది పూర్తిగా వినడం చాలా అవసరం. ఆ తర్వాత వెంటనే మీరు మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. మొదట వారికి కోపం తగ్గే వరకు వారిని కదపకపోవడం ఉత్తమం. ఆ తర్వాత భాగస్వామితో నిదానంగా మాట్లాడుతూనే వారు మీ వల్ల సమస్యగా భావిస్తున్న అంశం ఏంటో, నిజంగా అది సమస్యా? కాదా? అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఫలితంగా మిమ్మల్ని మీరు సరైన దారిలో పెట్టుకోవడమో లేదంటే వారు తమ తప్పు తెలుసుకొని క్షమాపణ కోరడమో.. ఇలా చేయడం వల్ల ఇరువురి మధ్య తలెత్తిన వాదనకు తెరపడుతుంది.

వాస్తవాలను అంగీకరించండి..

భాగస్వామి మిమ్మల్ని తరచూ నిందిస్తున్నారంటే మీరు వారికి బాధ కలిగించే పనులేవైనా చేస్తున్నారేమో గమనించాలి. అలాగే వారే అకారణంగా మిమ్మల్ని పదే పదే కసురుతున్నారేమో పరిశీలించాలి. అసలు తప్పెవరిదో కచ్చితంగా తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడే సమస్యకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఫలితంగా ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తపడచ్చు.

వాదనలు వద్దు..!

భార్యాభర్తల మధ్య తరచూ ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు చాలామంది వాదనలకు దిగుతూ ఉంటారు. ఫలితంగా మానసిక ప్రశాంతత లోపించడమే కాకుండా దాంపత్య బంధం క్రమంగా సన్నగిల్లే అవకాశాలూ లేకపోలేదు. కాబట్టి సమస్యను భూతద్దంలో చూస్తూ భాగస్వామితో వాదనకు దిగకుండా, మూడో వ్యక్తి దృష్టికి తీసుకెళ్లకుండా మీలో మీరే సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది.

మీ విషయంలోనే ఇలా చేస్తున్నారా..?

ఇలాంటి సందర్భాలు తరచూ ఎదురైతే ముందుగా మీ భాగస్వామి మీ విషయంలోనే ఇలా ప్రవర్తిస్తున్నారా? లేక అందరితోనూ అలాగే మెలుగుతున్నారా? అన్నది తెలుసుకోవాలి. ప్రత్యేకించి మీ విషయంలోనే ఇలా ప్రవర్తిస్తుంటే మాత్రం వారితో నిదానంగా మాట్లాడుతూనే ఆ అంశానికి సంబంధించి విపులంగా చర్చించండి. ఈ క్రమంలో 'తప్పంతా నీ దగ్గర పెట్టుకొని నన్ను నిందిస్తావేంటి..' అంటూ బిగ్గరగా అరవడం, అజమాయిషీ చెలాయిస్తూ వారిపై దాడిచేయడం ఎంతమాత్రమూ సబబు కాదు. ఫలితంగా సమస్య పరిష్కారం దిశగా కాకుండా మరింత పెద్దదిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ తప్పు మీవైపున్నప్పటికీ దాన్ని కూల్‌గా అంగీకరించడం, తప్పు మీది కాకపోతే దాన్ని సున్నితంగా తిరస్కరించడం.. అన్నివిధాలా శ్రేయస్కరం.

ప్రశంసిస్తూనే..

ఒకవేళ మీ భాగస్వామిలోనే లోపాలు ఉండి, వాటి గురించి మీరు వారికి తెలియజేయాలనుకుంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ముందుగా వారిలో ఉన్న బలాలను లేదా మంచితనాన్ని ప్రశంసిస్తూ నెమ్మదిగా వారిని మీవైపు తిప్పుకోవాలి. ఆ తర్వాత వారిలో ఉన్న లోపాల గురించి విశదీకరించి చెప్పాలి. అలాగే వాటిని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడే చిట్కాలను సైతం సూచించాలి. అప్పుడు వారు కూడా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తపడే వీలుంటుంది. ఇద్దరి మధ్యా అనురాగం, అనుబంధం రెట్టింపవుతాయి.

ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా, సర్ది చెప్పినా భాగస్వామి ధోరణి మారకుంటే మాత్రం విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లడం, మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించడం వంటివి చేయాలి.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని