close

వార్తలు / కథనాలు

స్టార్‌ కోచ్‌లు... కోట్ల రూపాయలు

పారితోషికంలో మొదటి స్థానం రవి శాస్త్రిదే!

ఒక్క మ్యాచ్‌తో రాత్రి రాత్రే స్టార్లు అయిన క్రికెటర్లను చూసుంటారు. వాళ్లకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు, బ్రాండ్‌ అంబాసిడర్‌ అవకాశాలు చాలానే వస్తాయి. అయితే కోట్ల రూపాయలు పారితోషికం పొందే కోచ్‌లు మాత్రం తక్కువ ఉంటారు. అందులోనూ అలా ఏళ్ల తరబడి సంపాదించేవాళ్లూ ఇంకా తక్కువగా ఉంటారు. అలాంటి కొద్దిమందిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న/ అందుకున్న కోచ్‌లు వీరు. పారితోషికంలో ఎవరి ర్యాంకు ఎంతో చూద్దాం!

పోస్టర్‌ బాయ్‌ అదుర్స్‌

ప్రపంచంలోనే ధనిక క్రికెట్‌ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ.. భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రవిశాస్త్రికి ప్రపంచంలోని అందరి కోచ్‌లకన్నా అధిక వార్షిక వేతనాన్ని చెల్లిస్తోంది. శాస్త్రి కాంట్రాక్టు గడువు 2019 వరల్డ్‌ కప్‌ వరకు ఉంది. ఆయన అందుకుంటున్న వార్షిక వేతనం సుమారు రూ. 8.5 కోట్లు. రవిశాస్త్రి 1981 - 1992 మధ్య కాలంలో ఓపెనింగ్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌గా భారత్‌ తరఫున ఆడారు. మనిషి ఎత్తుగా ఉండటంతో సహచరులు పోస్టర్‌ బాయ్‌ అని సరదాగా పిలిచేవారు. 2014 నుంచి 2016 ఏప్రిల్‌ వరకు టీం ఇండియా డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన శాస్త్రి.. అప్పటి కోచ్‌ అనిల్‌ కుంబ్లే బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జులై 2017లో కోచ్‌ పదవిని స్వీకరించాడు.

క్లాసికల్‌ కోచ్‌...

క్లాసికల్‌ ఆటతో, కళాత్మకమైన షాట్లతో క్రికెట్‌ ప్రేక్షకులను అలరించాడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డారెన్‌ లీమన్‌. 2005లో కెరీర్‌ ముగించిన తర్వాత ఐపీఎల్‌లో కోచ్‌ అవతారమెత్తాడు. 2009 నుంచి 2012 వరకు డెక్కన్‌ ఛార్జర్స్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు.. 2009 ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకోవడంతో కోచ్‌గా లీమన్‌ పేరు మార్మోగింది. 2013 యాషెస్‌ సిరీస్‌కు మూడు వారాల ముందు కంగారూల జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు. లీమన్‌ హయాంలో ఆ జట్టు 2015 వరల్డ్‌ కప్‌ కైవసం  చేసుకుంది. గత సంవత్సరం మార్చిలో బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో లీమన్‌ తప్పుకునే నాటికి వార్షిక వేతనంగా సుమారు రూ. 4 కోట్లు తీసుకునేవాడు.

కౌంటీ నుంచి...

మిడిల్‌ ఓవర్లలో హిట్టర్‌గా పేరొందిన ట్రెవర్‌ బేలిస్‌. ఇంగ్లండ్‌ జట్టులో చురుకైన ఫీల్డర్‌ కూడా. మొదట్లో న్యూ సౌత్‌వేల్స్‌ తరఫున సక్సెస్‌పుల్‌ కోచ్‌గా గుర్తింపు పొందిన ట్రెవర్‌.. అనంతరం శ్రీలంక జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. ట్రెవర్‌ హయాంలో లంక జట్టు టెస్ట్‌ క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకోవడంతోపాటు, 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కి వెళ్లింది. ఆ తర్వాత ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కోచ్‌గా కూడా వ్యవహరించిన ట్రెవర్‌.. 2015 మే నుంచి ఇంగ్లండ్‌ జట్టు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ట్రెవర్‌ ఏడాదికి రూ. 3.75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు.


 

22 ఏళ్లకే కోచ్‌గా...

సుదీర్ఘంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న మైక్‌ హెస్సన్‌ వార్షిక పారితోషికం రూ.1.8 కోట్లు. కేవలం 22 ఏళ్ల వయసులోనే కోచ్‌ అవతారం ఎత్తిన మైక్‌ మొదట్లో ఒటాగో క్రికెట్‌కు ఏడు సంవత్సరాలపాటు డైరెక్టర్‌గా ఉన్నాడు. అనంతరం 2003లో అసిస్టెంట్‌ కోచ్‌గా ప్రమోట్‌ అయ్యాడు. ఆ తర్వాత 2012లో న్యూజిలాండ్‌ కోచ్‌ అయ్యాడు. జాన్‌ రైట్‌ తప్పుకున్న తర్వాత బ్లాక్‌ క్యాప్స్‌కు కోచ్‌గా మారిన మైక్‌ జట్టకు చక్కని విజయాలు అందించాడు. మైక్‌ కోచ్‌గా వ్యవహరించిన 51 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 20 మ్యాచుల్లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 107 వన్డే మ్యాచ్‌లకు గాను 63 గెలుపొందింది.

పాక్‌ ’ఛాంపియన్‌’ అవ్వడంలో...

దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో కేవలం 6,557 పరుగులే చేశాడు. అయితేనేం కోచ్‌గా అదరగొడుతున్నాడు. సొంత దేశంలో డొమెస్టిక్‌ క్రికెట్‌లో కోచ్‌గా ప్రయాణం ప్రారంభించిన మికీ 2005లో జాతీయ జట్టుకు కోచ్‌ అయ్యాడు. జట్టు కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌, మికీ మధ్య సమన్వయం కుదరడంతో ఆ జట్టు వరుస విజయాలతో అదరగొట్టింది. 2010లో దక్షిణాఫ్రికా కోచ్‌గా పదవీకాలం ముగిసిన తర్వాత కొంతకాలం ఆస్ట్రేలియాలో టీ20 ప్రాంఛైజీలకు కోచ్‌గా సేవలందించారు. 2016 మేలో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన హయాంలో పాక్‌ 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మికీ రూ.1.57 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు