ఆహ్వానం ఏదో సరదాకి... ఫన్‌ ఎస్సెమ్మెస్‌... సాంగ్‌ కౌంటర్‌... హైకూలను కార్డుపై రాసి పంపండి. ‘మనసులో మాట’ శీర్షికకు రాసేవారు, అడ్రస్‌ తప్పకుండా రాయాలి. మీరు కోరితే వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ రచనలు
పంపాల్సిన చిరునామా:

ఈతరం
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు,
రామోజీ ఫిల్మ్‌ సిటీ,
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
you@eenadu.net


‘ఛెళ్లు’మనిపించింది... అయినా ప్రేమిస్తున్నా!
రెండేళ్ల ప్రేమ. పరిస్థితులు అనుకూలించక వదులుకుంది అమ్మాయి. నేను మాత్రం కొత్తగా ప్రేమలో పడ్డా అంటున్నాడు అబ్బాయి. ఇదేం విచిత్రం?

అందరిలాగే నా ప్రేమ కూడా ఆకర్షణతో మొదలైంది. తను మా వీధిలోనే ఉండేది. ఆమెను ఆకట్టుకోవడానికి నేను చేయని గిమ్మిక్కులు లేవు. జోకులతో నవ్వించేవాణ్ని. ఆకట్టుకునే మాటలతో కవ్వించేవాణ్ని. తను దగ్గరుంటే మాటలు. దూరమైతే మెసేజ్‌లు. ఆ ధ్యాసలో పడి గడియారంలో ఏ ముల్లు ఎక్కడుందో మర్చిపోయా.

రోజురోజుకీ తనపై మోజు పెరిగిపోయేది. ఎంతలా అంటే ఎన్నడూ కాలేజీకి ఎగనామం పెట్టని నేను అరుదుగా క్లాసులకు హాజరయ్యేవాణ్ని. ‘రేయ్‌.. వెధవా.. చెడిపోతున్నావ్‌.. ఇలాగైతే బాగుపడవ్‌’ నా తీరు గమనించి ముందే హెచ్చరించారు లెక్చరర్లు. ఆ మాట చెవికెక్కితేగా! ఎవరేం అనుకున్నా ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్టు ప్రవర్తించేవాళ్లం. మాకు మేమే లోకమైనట్టు.. మా మాటలు మేమే వింటూ.. మా వూసులు మేమే చెప్పుకుంటూ మీతో మాకేం పని? అన్నట్టుగా ఉండేవాళ్లం. రెండేళ్ల ప్రేమలో కనీసం రెండువందలసార్లైనా ఐలవ్యూ చెప్పుకున్నాం. తనే ఫీలింగ్‌తో చెప్పిందోగానీ ప్రేమించిన అమ్మాయికి ఐలవ్యూ చెప్పడం నాకు ఓ ప్యాషన్‌. అంతే.

‘వచ్చేవారం అన్నయ్య పెళ్లి. పనులు చాలా ఉన్నాయ్‌. నువ్వు తప్పకుండా రావాల్రోయ్‌’ ఆర్డరేశాడు స్నేహితుడు. ఓరోజు ముందే వాలిపోయా. ‘మీలాగే మా అన్నయ్యా వదినలదీ గాఢమైన ప్రేమ. పెద్దవాళ్లని ఒప్పించి ఒక్కటవుతున్నారు’ వివరాలందించాడు. ‘ఏడాది ప్రేమకే పెళ్లితో ఏకమవుతున్నారు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మాకెందుకు ఆ ఆలోచన రాలేదంటావ్‌?’ నా ధర్మసందేహం వాడి ముందుంచా. ‘అవసరాల కోసం ప్రేమిస్తే ప్రేమిస్తూనే ఉంటారు. జీవితాంతం ప్రేమ అవసరమనుకువారే పెళ్లాడతారు’ అనేశాడు వేదాంతిలా. ఆ మాట నాకు తెగ నచ్చేసింది. అదే మాట ఆ రాత్రి నాకు నిద్దుర లేకుండా చేసింది.

మర్నాడు ఉదయం ఎప్పట్లాగే నా లవర్‌కి ఫోన్‌ కలిపా. ఈసారి మాత్రం గుండెలో ఏదో తెలియని ఉద్వేగం. ‘అర్జెంట్‌గా నిన్ను కలవాలని ఉంది’ అన్నా. ‘ఇంట్లో ఎవరూ లేరు వచ్చెయ్‌’మంది. క్షణాల్లో తన ముందు ప్రత్యక్షమయ్యా. వెంటనే తనని అమాంతం గుండెలకు హత్తుకొని ‘ఐ లవ్యూ బంగారం’ అన్నా మనస్ఫూర్తిగా.

మా ప్రేమ మొదలైన రెండేళ్లలో ఏం చేయాలనుకుంటే అది చేశాం. కలవాలనుంటే కలుసుకున్నాం. వీలు చేసుకొని షికార్లకెళ్లాం. గంటలకొద్దీ ఫోన్లో మాట్లాడుకున్నాం. ఎప్పుడూ ఏ అవాంతరం ఎదురుకాలేదు. కానీ నా బ్యాడ్‌టైం. ప్రేమ విలువ తెలిసినరోజే నా జీవితంలో పెను తుపాను మొదలైంది. తనని కౌగిలించుకున్న క్షణమైనా గడవకముందే వాళ్ల నాన్న వూడిపడ్డారు. ఆపై జరిగింది అసలు నేనూహించని సీన్‌. ‘చాలా రోజులుగా వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటున్నాడు’ అని ఏడుస్తూ నన్ను దూరంగా నెట్టేసింది తను. జాలి, అసహ్యం, షాక్‌, బాధ.. ఇలా ఒకేసారి నాలో ఎన్నో భావోద్వేగాలు.

ఈ సంఘటన జరిగి చాన్నాళ్లైంది. అప్పుడు వాళ్ల నాన్న కొట్టిన చెంపదెబ్బ గుర్తు లేదు. ఆ అమ్మాయి నాపై వేసిన అభాండం గుర్తు లేదు. కానీ తన కౌగిలింత మాత్రం ఇప్పటికీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ క్షణంలోనే నేను నిజంగా ఆమెతో ప్రేమలో పడిపోయా. సంతోషం, బాధ, కష్టం, సుఖం.. అన్నింట్లో తోడు నిలవడానికి జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటా.

- శివ
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • Pratibha_SSC
  • sthirasthi_300-50.gif