మీ ఆరోగ్య సమస్యలను పోస్టుకార్డు మీదే, క్లుప్తంగా,
స్పష్టంగా రాయండి.

సమస్య-సలహా
సుఖీభవ,
ఈనాడు కాంపౌండ్‌,
సోమాజిగూడ,
హైదరాబాద్‌- 500082.

మీ పళ్లెంలో పొటాషియం ఉందా?
రోగ్యానికి తోడ్పడే పోషకాలు అనగానే ముందుగా విటమిన్లే గుర్తుకొస్తాయి. కానీ వీటితో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరమని చాలామందికి తెలియదు. ముఖ్యంగా పొటాషియం.. మన శరీరంలో ద్రవాల స్థాయులను నియంత్రించటం దగ్గర్నుంచి కండరాలు సరిగా పనిచేయటం వరకు ఎన్నో కీలకమైన పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇది గుండె, కిడ్నీ జబ్బుల బారినపడకుండా కాపాడుతున్నట్టూ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనకు రోజుకు కనీసం 4,700 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం. కానీ చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవటం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతటి కీలకమైన పోషకం తగినంత అందటం లేదని తెలుసుకోవటం ఎలా? కొన్ని లక్షణాలను బట్టి దీన్ని అంచనా వేయొచ్చు.

అలసట, బలహీనత: తగినంత నిద్ర పోతున్నప్పటికీ ఎప్పుడూ అలసి పోయినట్టు, కళ్లు మూతలు పడుతున్నట్టు అనిపిస్తుంటే పొటాషియం తగినంత తీసుకోవటం లేదని అనుమానించాలి.

పిక్కలు పట్టేయటం: తరచుగా పిక్క కండరాలు పట్టేసి బాధిస్తుండటమూ పొటాషియం లోప లక్షణమే. క్రీడాకారులు, బాగా కష్టపడి పనిచేసేవారిలో ఇలా పిక్క కండరాలు పట్టేయం ఎక్కువ. దీనికి కారణం చెమటలో పొటాషియంతో పాటు ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా పోవటమే.

గుండెదడ: పొటాషియం మోతాదులు తగ్గితే గుండె కొట్టుకోవటం అస్తవ్యస్తమవుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది.

అధిక రక్తపోటు: పొటాషియం స్థాయులు తగ్గితే రక్తపోటు పెరుగుతున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. ఎందుకంటే ఇది సోడియం మోతాదులను నియంత్రిస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది.

- రకరకాల రంగులతో కూడిన పండ్లు, కూరగాయలు దండిగా తింటే పొటాషియం తగినంత లభించేలా చూసుకోవచ్చు. అరటిపండ్లలో దీని మోతాదు ఎక్కువ. ఉడికించిన బంగాళాదుంపల్లో మరింత అధికంగా ఉంటుంది. పాలకూర, స్ట్రాబెర్రీ, గోబీపువ్వులతోనూ పొటాషియం లభిస్తుంది. అయితే కిడ్నీ జబ్బు గలవారు డాక్టర్ల సలహా మేరకే పొటాషియం లభించే పదార్థాలను తీసుకోవాలి.

cinema-300-50.gif
sthirasthi_300-50.gif