Sunday, February 14, 2016


Untitled Document
ట్రేడ్‌సెంటర్‌కు భూమి కేటాయింపునకు కృషి
రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మొగల్రాజపురం, న్యూస్‌టుడే: నవ్యాంధ్ర రాజధానిలో ట్రేడ్‌ సెంటరు ఏర్పాటు చేసేందుకు అవసరమైన 500 ఎకరాల భూమి కేటాయింపునకు కృషి చేస్తానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ట్రేడ్‌ సెంటరు ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, ఇతర కార్యవర్గ సభ్యులు మంత్రి ఉమాను శనివారం కలసి వినతిపత్రం సమర్పించారు. ట్రేడ్‌ సెంటరులో బిజినెస్‌ మాల్స్‌, హోల్‌సేల్‌ వ్యాపార సంస్థలు, రవాణా సంస్థలు, బ్యాంకింగ్‌ సంస్థలు, కోల్డ్‌ స్టోరేజిలు, పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని వక్కలగడ్డ వివరించారు. అమరావతిలో స్థలం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య హబ్‌గా రూపాంతరం చెందుతుందని వివరించారు. ట్రేడ్‌ సెంటరు ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని ఛాంబర్‌ ప్రతినిధులకు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛాంబరు ప్రధానకార్యదర్శి అన్నవరపు వెంకట కోటేశ్వరరావు, ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ వీసీలో కలెక్టరు బాబు.ఎ
సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి దృశ్య, శ్రవణ సదస్సు (వీసీ) నిర్వహించారు. రాష్ట్రంలో ఎలక్ట్రోల్‌ ఇన్‌సెంటివ్‌ కార్యక్రమంలో భాగంగా 15 పట్టణ, నగర ప్రాంతాల్లోని 29 శాసనసభ నియోజకవర్గాలను ఎంపిక చేశామని తెలిపారు. ఈక్రమంలో విజయవాడ ఉపకలెక్టరు కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టరు బాబు.ఎ మాట్లాడుతూ నజరీ రక్ష కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో ఇన్‌సెంటివ్‌ ఎలక్టోరల్‌ రివిజను ప్రక్రియను మార్చి ఒకటి నుంచి చేపట్టామన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను, ఈఏడాది జనవరి నాటి జాబితాతో క్రోడీకరిస్తున్నామన్నారు. ఈకార్యక్రమ నిర్వహణ కోసం హైదరాబాద్‌లో ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించే సాంకేతిక శిక్షణకు జిల్లా నుంచి ఎంపిక చేసిన సిబ్బందిని పంపుతామన్నారు. ఈక్రమంలో ఈనెల 15 నుంచి వచ్చే నెల 15 వరకూ నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం అధికారులు ఒక క్రమ పద్ధతిలో ఇంటి నంబర్ల నమోదు ప్రక్రియను చేపడతారని వివరించారు. ఈమొత్తం ప్రక్రియను ‘ట్యాబ్‌’లో నిక్షిప్తం చేయడం ద్వారా పూర్తి పారదర్శకతతో వివరాలను సేకరిస్తున్నామని వివరించారు. పోలింగు కేంద్రాల రేఖా చిత్రాల (మ్యాపింగు) ప్రక్రియను ఈనెల 15 నుంచి 22 వరకూ, క్షేత్ర స్థాయి వివరాల నమోదు మార్చి ఒకటి నుంచి 31 వరకూ నిర్వహిస్తామన్నారు. ఈనెల 22 నుంచి 29 వరకూ జీఐఎస్‌ అప్లికేషనుతో బీఎల్‌ఓల సహకారంతో పోలింగు కేంద్రాల హద్దులను గుర్తిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 11న ముసాయిదా జాబితా ప్రదర్శన, 26 వరకూ అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. తుది ఓటర్ల జాబితాను మే నెల 16న ప్రచురిస్తామని తెలిపారు. వీసీలో విజయవాడ, నూజివీడు ఉపకలెక్టర్లు జి.సృజన, లక్ష్మిశ, డి.ఆర్‌.ఒ. రంగయ్య తదితరులు పాల్గొన్నారు.


అమరావతి తరహాలోనే భూసమీకరణ
వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు
స్వీకరించిన జేసీ చంద్రుడు
కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎంఏడీఏ) ద్వారా చారిత్రక మచిలీపట్నానికి పూర్వ వైభవం రానుందని జేసీ గంధం చంద్రుడు అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన మడ వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టుతో పాటు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను సాకారం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించి, వాటిని సకాలంలో అమలు చేస్తామన్నారు. అమరావతి తరహాలోనే భూ సమీకరణ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. అక్కడ అమల్లో ఉన్న లోటుపాట్లను సవరించుకుని తయారుచేసిన నిమయ, నిబంధనలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు. జేసీకి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ రంగయ్య, ఆర్డీవో పి.సాయిబాబు, బందరు తహసీల్దార్‌ నారదముని, మున్సిపల్‌ కమిషనర్‌ జస్వంతరావు, ఇతర సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ‘మడ’ పరిధిలోని గ్రామాలు, ఇతర వివరాలతో రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ బాధ్యతతో పనిచేయాలని కోరారు. భూసమీకరణ గురించి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నియమ, నిబంధనల అమలుపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. భూ సమీకరణకు సంబంధించిన నివేదికపై ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమష్టిగా సహకారం అందించాలని జేసీ కోరారు.


కాపు సంస్థ రుణాలను సద్వినియోగం చేసుకోండి
గాంధీనగర్‌, న్యూస్‌టుడే: కాపు కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను కాపులంతా సద్వినియోగం చేసుకోవాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు కోరారు. రుణాల కోసం దరఖాస్తులు, కుల ధ్రువీకరణను గాంధీనగర్‌లోని కాపునాడు కార్యాలయంలో ఉచితంగా అందిస్తున్నామని ఉదయం 10 నుంచి రాత్రి 9.30 వరకు అందుబాటులో ఉంటామన్నారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు మాట్లాడుతూ మూడు వేల మంది దరఖాస్తు చేశారని తెలిపారు.


అదుపుతప్పి.. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
గూడూరు(గూడూరు గ్రామీణం),న్యూస్‌టుడే: అదుపు తప్పిన ఓకారు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇల్లు దెబ్బతింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన కె.ప్రభాకరరావు కారులో మండల పరిధిలోని తుమ్మలపాలెం వెళ్లివస్తుండగా మార్గంమధ్యలో గూడూరు రాగానే మలుపులో కారు సరిగా తిరగక ఆపక్కనే ఉన్న రెహమాన్‌ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇల్లు ధ్వంసం కావడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రక్తహీనత నివారణే లక్ష్యం
పెడన, న్యూస్‌టుడే: చిన్నారుల్లో ఇనుము ధాతు(ఐరన్‌) లోపం కారణంగా ఆశించే రక్తహీనతను నియంత్రించేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ ద్రావణాన్ని పంపిణీ చేశారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఈ ద్రావణాన్ని అందించారు. రెండేళ్లలోపు చిన్నారులకు ఒక ఎంఎల్‌(మిల్లీలీటరు), ఆపై వారికి 2ఎంఎల్‌ వంతున అందించారు. క్లస్టర్‌ పరిధిలోని ఎనిమిది పీహెచ్‌సీల్లో ఈకార్యక్రమం జరిగిందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.ప్రసాదరావు చెప్పారు. క్లస్టర్‌ పరిధిలో ఐదువేల మంది చిన్నారులు లక్ష్యంకాగా తొలిరోజున 50శాతానికి పైగా పూర్తయిందని, సోమవారం నాటికి పూర్తిస్థాయిలో ఈకార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పిల్లల్లో రక్తహీనత కారణంగా సోకే వ్యాధులను నియంత్రించటమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దీన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


జూన్‌ నాటికి పట్టిసీమ జలాలు
పెడన, న్యూస్‌టుడే: జూన్‌ నాటికి పట్టిసీమ ప్రాజెక్ట్‌ నుంచి పూర్తిస్థాయిలో కృష్ణాకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ ఛైర్మన్‌ గుత్తా శివ రామకృష్ణ(చంటి)అన్నారు. శనివారం పెడన మండలం కమలాపురంలో నిర్వహించిన కమలాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ) సమావేశంలో ఆయన ప్రసంగించారు. దీనిలో కమలాపురం డీసీ ఛైర్మన్‌ గుడిశేవ సుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ కౌతవరం సబ్‌డివిజన్‌ డీఈ సత్యనారాయణ, పలువురు సాగు నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్ట్‌ నాలుగు గేట్ల నుంచి నీటిని కృష్ణాకు మళ్లిస్తున్నారని, జూన్‌ నాటికి 12 గేట్ల నుంచి నీటి విడుదల జరుగుతుందని చెప్పారు. దీంతో రైతుల సాగు నీటి కష్టాలు తొలగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇక నీరు చెట్టు కింద సాగునీటి కాలువలకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులను ఆదేశించామని, ఈపథకం కింద నిధులకు కొరతలేదని శివరామకృష్ణ తెలిపారు. డీసీ ఛైర్మన్లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు ఈపథకం కింద పనులు చేపట్టేందుకు చొరవ చూపించాలని విజ్ఞప్తిచేశారు. 2008లో ప్రారంభమైన డెల్టా ఆధునికీకరణ పనులు పాక్షికంగా పూర్తయ్యాయని, వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.

డీఈపై ధ్వజం: కౌతవరం డీఈ పనితీరుపై చేవేండ్ర నీటి సంఘం అధ్యక్షుడు అంకెం వెంకటేశ్వరరావు నిరసన తెలిపారు. డీఈ బాధ్యతాయుతంగా పనిచేయటం లేదని, ఫలితంగా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కౌతవరం సబ్‌డివిజన్‌ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కాలువలపై ఫలసాయాన్ని విక్రయించుకొంటున్నారని ఆరోపించారు.మద్యంతో సమాజంలో అగౌరవం
బంటుమిల్లి, న్యూస్‌టుడే: మద్యం తాగినా, తయారు చేసినా, విక్రయించినా సమాజంలో అగౌరవం పాలవుతారని ఆ కుటుంబానికి విలువ లేకుండా పోతుందని బంటుమిల్లి మేజిస్ట్రేట్‌ సీ.హెచ్‌.ఎల్‌.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం కోర్టులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కష్టపడిన సొమ్మును పిల్లలను మంచి చదువులు చదివించేందుకు వినియోగించాలని, మద్యానికి బానిసలై సొమ్ము ఖర్చు చేస్తే పిల్లల భవిత ముళ్ల బాటవుతుందని అన్నారు. ఒకటికి రెండు సార్లు నాటుసారా కాస్తూ, అమ్ముతూ కోర్టుకు రావటం సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొన్నారు. సమాజంలో తలదించుకునే పనులు మాని, ప్రజలు మెచ్చే విధంగా, గౌరవ ప్రదమైన జీవితాలను గడపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు యాళ్ల శ్యాంబాబు, పళ్లెం వెంకటేశ్వరావు, ఎస్‌.ఆశోక్‌కుమార్‌, ఏపీపీ శశికళ, ఏజీపీ పరసా సుబ్రహ్మణ్యం, బంటుమిల్లి, కృత్తివెన్ను ఎస్సైలు వాసు, లోవరాజు, ఎక్సైజ్‌ ఎస్సై సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

36 కేసులు పరిష్కారం: శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 36 కేసులులను పరిస్కరించారు. వీటిలో 21 ఎక్సైజ్‌ కేసులు కాగా 5 స్టేట్‌బ్యాంకు కేసులు, మిగిలినవి ఇతర కేసులు ఉన్నాయి.అసలే నీటి కొరత... అపై చేపల పట్టివేత
ఆందోళనలో కైకలూరు వాసులు
కైకలూరు, న్యూస్‌టుడే: అసలే తీవ్రంగా వేధిస్తున్న నీటి కొరత... రెండు మూడు రోజులకు ఒకసారి కొళాయిలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ దశలో గ్రామంలోని దాదాపు 28 ఎకరాల మంచినీటి చెరువులో శనివారం చేపలు పట్టడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులో దాదాపు ఆరడుగులకు పైగా నీరుందని, చేపలు పట్టడంతో తాగునీరు కలుషితం అవుతుందని చెప్పారు. గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయలేని పంచాయతీ పాలకులు చేపలు పట్టుకోవడానికి ఆసక్తిచూపడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీకి చెందిన 12 మంది సభ్యులు ఎ.అప్పారావు పేరున రూ.5.52 లక్షలకు చేపల పట్టుబడి పాటను ఖరారుచేశారు. ఈ పాటలో కొందరు పంచాయతీ వార్డుసభ్యులు ఉండడం విశేషం.

ప్రభుత్వ ఆనుమతి మేరకే..: జిల్లా పంచాయతీ అధికారి అదేశాల మేరకే మంచినీటి చెరువులోని చేపలను వేలం పెట్టామని పంచాయతీ ఈవో డి.లక్ష్మీనారాయణ చెప్పారు. వేసవి ప్రారంభంకావడంతో చెరువులో నీరు అడుగంటిందని, ఆ నీటిని తొలగించి కాలువలకు నీటిని వదిలితే పెట్టుకునేలా పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారన్నారు. స్థానిక భవానమ్మ చెరువులో నీటిని నిండుగా నిల్వచేసిన తర్వాత మాత్రమే చేపల పట్టుబడికి వేలం ద్వారా అనుమతి ఇచ్చామని వివరించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.పని ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి
వణుదుర్రు (ముదినేపల్లి), న్యూస్‌టుడే: కుటుంబ పోషణ నిమిత్తం కూలిపనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదినేపల్లి మండలం వణుదుర్రుకు చెందిన వీరమల్లు నరసింహస్వామి (53) శనివారం కొత్తపల్లిలో నిర్వహిస్తున్న ఉపాధి హమీ తవ్వకం పనుల్లో పాల్గొన్నాడు. ఉదయం 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు ఆటోలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఆ వెంటనే మృతదేహాన్ని నరసింహస్వామి ఇంటికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తవ్వకాలు చేపట్టిన ప్రదేశం నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లిపోవడంతో ఎలాంటి పరిహారం రాదని అధికారులు చెప్పడంతో మృతుని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రెండు వేర్వేరు చోట్ల పనులు జరుగుతుండటంతో క్షేత్ర సహాయకుడు మరో చోట ఉండడం, అతనికి సమాచారం చేరేసరికి ఆలస్యమైందని, దీనికి కూలీ కుటుంబానికి పరిహారం రాదనడం ఎంతవరకు సమంజసమని మృతుడి బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏపీవో రాంప్రసాద్‌ను వివరణ కోరగా పనిచేస్తున్న ప్రదేశంలో మృతిచెందితే రూ.50 వేల పరిహారం అందుతుందన్నారు. అయితే మధ్యాహ్నం ఒంటిగంట వరకు మృతిచెందినట్లు తమకు సమాచారం అందలేదన్నారు. పని కూడా ఉదయం 11 గంటలలోపే పూర్తయ్యిందని, ఆ తర్వాత మృతిచెందినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మృతిచెందిన సమాచారం కేవలం క్షేత్ర సహాయకుడే అందించాల్సి అవసరం లేదన్నారు. వీటన్నింటినీ పరిశీలించి పరిహారం అందుతుందా లేదా అనేది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని చెప్పారు.


ఆరు మట్టి ట్రాక్టర్లు సీజ్‌
మండవల్లి, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు శుక్రవారం రాత్రి సీజ్‌ చేశారు. ‘ముమ్మరంగా చెరువుల పూడ్చివేత’ శీర్షికన ‘ఈనాడు’ కైకలూరు నియోజకవర్గం పేజీలో శుక్రవారం ప్రచురించిన కథనంతో అధికారులు స్పందించారు. నిబంధనలు పాటించకుండా మట్టిని తవ్వడం, తరలించడం, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆరు మట్టి ట్రాక్టర్లను ఎస్‌ఐ మణికుమార్‌ సాయంతో తహసీల్దారు వీవీ.భరత్‌రెడ్డి సీజ్‌చేశారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. మండలంలో అక్రమంగా చెరువులను పూడ్చుతున్న పనులను నిలిపివేసి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనుమతులు ఉంటేనే చెరువులను పూడ్చాలని, మట్టిని తరలించాలని సూచించారు. మట్టి తోలకాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాక్టర్లపై టార్పాలిన్‌ వేసిన తర్వాతే మట్టిని తరలించాలన్నారు. సీజ్‌చేసిన ఆరు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.


సీఎం ఫొటో మార్ఫింగ్‌ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
నందిగామ, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబునాయుడు ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో కమ్మ కులస్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు అమ్మినేని జ్వాలా ప్రసాద్‌ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఫేస్‌బుక్‌ను చూడగా సీఎం ఫొటో పక్కన చెప్పు ఉంచి, పలకపై కమ్మ కులస్థుల మనోభావాలు దెబ్బతిసే విధంగా రాసి, దాన్ని సీఎం పట్టుకున్నట్లు ఫొటో మార్ఫింగ్‌ చేసి ఓ వ్యక్తి పేరు మీద పోస్టు చేశారని తెలిపారు. సీఎంను అవమానించటమే కాకుండా, కమ్మ కులస్థుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై నందిగామ డీఎస్పీ రాధేష్‌ మురళిని వివరణ కోరగా, సీఎం ఫొటో మార్ఫింగ్‌ చేయటం నేరమన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేయమని నందిగామ పోలీస్‌స్టేషన్‌ సీఐ సత్యనారాయణను ఆదేశించానని తెలిపారు.


బొమ్మపలికే.. బోలెడు భావాలు
కరెన్సీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: చిత్రకళాకారులకు నవ్యాంధ్రప్రదేశ్‌ వెన్నుదన్నుగా నిలుస్తుందని పర్యాటక శాఖ అధికారి మల్లిఖార్జునరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్రకళాకారుల సమాఖ్య, కళాదర్శిని సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల ‘చిత్ర కళా సంత’ శనివారం లయోల కళాశాల ఆవరణలోని కళాదర్శినిలో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కళాకారులను ప్రోత్సహించే చర్యలు తీసుకుంటున్నా, ఇంకా కళాకారులు ఆర్థికంగా బలోపేతం కావాలంటే కళాభిమానులు ముందుకు రావాలని నగర ప్రముఖలు తుర్లపాటికుటుంబరావు అన్నారు. దేశవ్యాప్తంగా విచ్చేసిన కళాకారులతో 200 స్టాల్స్‌లో అద్భుతమైన, రమణీయ, సుందర దృశ్యాలతో కూడిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. రెండో శనివారం కావడంతో పెద్ద ఎత్తున చిత్ర కళా ఔత్సాహికులు ప్రదర్శనను తిలకించారు. ఆదివారం కూడా ప్రదర్శన ఉంటుందని కళాదర్శిని డైరెక్టర్‌ ఫాదర్‌ దూసి రవిశేఖర్‌ అన్నారు. రాజధాని బెజవాడలో వరుసగా రెండో సారి చిత్ర కళా సంతను నిర్వహించడం జరుగుతుందని చిత్రకారుల సమాఖ్య అధ్యక్షులు పిలానీ, కార్యదర్శి బాలయోగిలు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి- సంప్రదాయాల మేళవింపుతో వివిధ రంగులు, కుంచె, చేతితో, చేనేతపై, రెప్లికా... కళానైపుణ్యాలు అబ్బురపర్చాయి. 

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మొగల్రాజపురం, న్యూస్‌టుడే: నవ్యాంధ్ర రాజధానిలో ట్రేడ్‌ సెంటరు ఏర్పాటు చేసేందుకు అవసరమైన 500 ఎకరాల భూమి కేటాయింపునకు కృషి చేస్తానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ట్రేడ్‌ సెంటరు ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, ఇతర కార్యవర్గ సభ్యులు మంత్రి ఉమాను శనివారం కలసి వినతిపత్రం సమర్పించారు. ట్రేడ్‌ సెంటరులో బిజినెస్‌ మాల్స్‌, హోల్‌సేల్‌ వ్యాపార సంస్థలు, రవాణా సంస్థలు, బ్యాంకింగ్‌ సంస్థలు, కోల్డ్‌ స్టోరేజిలు, పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని వక్కలగడ్డ వివరించారు. అమరావతిలో స్థలం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య హబ్‌గా రూపాంతరం చెందుతుందని వివరించారు. ట్రేడ్‌ సెంటరు ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని ఛాంబర్‌ ప్రతినిధులకు మంత్రి చెప్పారు. ఛాంబరు ప్రధానకార్యదర్శి అన్నవరపు వెంకట కోటేశ్వరరావు, ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వాసుపత్రుల సేవలపై నమ్మకం పెంచాలి
సత్తెనపల్లి, న్యూస్‌టుడే : సామాజిక సేవకు ఆకాశమే హద్ధు అని.. ఆస్పత్రి బాగా పనిచేస్తుందంటే దాని అభివృద్ధికి వూతమిచ్చే దాతలకు ప్రస్తుతం కొదవ లేదని సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి సోసైటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి సోసైటీలు, కమిటీలు వైద్య సేవలను మరింత బలోపేతం చేసేలా ఉండాలే తప్పించి పెత్తనం చలాయించేలా ఉండకూడదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలనే ఆలోచన ప్రజల్లో ఉందని, ప్రభుత్వ వైద్య సేవలపై ఉన్న అపనమ్మకాన్ని తొలగించేందుకు అందరి నుంచి కృషి జరగాలన్నారు. చాలా ఆస్పత్రుల్లో యంత్రం ఉంటే దాన్ని నడిపించే సిబ్బంది ఉండరని.. ఇవి రెండు ఉంటే యంత్రం పనిచేయదని, వైద్యుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని దీన్ని తొలగించేందుకు వైద్యఆరోగ్యశాఖాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సామాజిక రుగ్మతల్ని రూపుమాపేందుకు ఆస్పత్రి సోసైటీలు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు కృషి చేయాలన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి టి.పద్మజారాణి, ఆస్పత్రి అభివృద్ధి సోసైటీ ఛైర్మన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడారు. సభాపతి డాక్టర్‌ కోడెల ఆస్పత్రి సొసైటీ బాధ్యులైన ఆర్డీఓ భాస్కరనాయుడు, సభ్యులు బి.పూర్ణచంద్రరావు, పి.ఖాశిం(ర్యాంబోబుడే), డాక్టర్‌ ఎం.మంత్రునాయక్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రితో తనకు 64 ఏళ్ళ అనుబంధం ఉందని సభాపతి డాక్టర్‌ కోడెల బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. పురపాలక సంఘం ఛైర్మన్‌ రామస్వామి, కమిషనర్‌ సాంబశివరావు, యార్డు ఛైర్మన్లు సాంబయ్య, మోహన్‌, ధూళిపాళ్ళ రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్‌ గురవయ్య, తదితరులున్నారు.


సీఎం దిల్లీ వెళ్తే వర్గీకరణకు పరిష్కారం
మందా కృష్ణమాదిగ
చిలకలూరిపేట, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీ వెళ్తే పరిష్కారమవుతుందనే నమ్మకం ఉందని ఎమ్మార్పీయస్‌ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ అన్నారు. స్థానిక మోడరన్‌ కాంప్లెక్స్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996లోనే భాజపా మ్యానిఫెస్టోలో వర్గీకరణ విషయం ఉందని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటే 50శాతం పైన రిజర్వేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికి పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని వివరించారు. భాజపా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపులను బీసీలో చేర్చే విషయం లేదన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన వర్గీకరణను కాదని.. కాపులను బీసీలలో ఎలా చేరుస్తారన్నారు. కేంద్రం అనుకూలంగా ఉన్న వర్గీకరణ మీదే దృష్టిపెట్టని ముఖ్యమంత్రి, కేంద్రం మాట ఇవ్వని కాపులను బీసీలో చేర్చే విషయంపై ఎలా పరిష్కరిస్తారన్నారు. కాపునేత ముద్రగడ పద్మనాభంపై కేసులు పెట్టినా అతనిని అరెస్టుచేసే దమ్ము ఉందా? అంటూ ప్రశ్నించారు. వర్గీకరణ చేయకపోతే ఏపీ అతలాకుతలమవుతుందన్నారు. వర్గీకరణకు త్యాగాలతో కూడిన నిర్ణయాలను తీసుకుంటామని తెలిపారు. మాదిగ జాతిని మోసం చేస్తే వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసానికి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్న మాటలకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. దీనిపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 30వ తేదీన విజయవాడలో గాని, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన మంగళగిరి ప్రాంతంలోగాని భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఉన్నం ధర్మారావు, బొంతా వేణు, అడుసుమల్లి ప్రతాప్‌, కె.సుబ్బు, నాగేశ్వరరావు, చంటి పాల్గొన్నారు.


సమాచారం లేకుండా మాట్లాడటం భావ్యం కాదు
ప్రత్తిపాటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి డొక్కా
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం భావ్యంకాదని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పేర్కొన్నారు. గుంటూరు లక్ష్మీపురంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సున్నితమైన అంశాలపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సామాజిక పరమైన అంశాలపట్ల మంత్రులు జాగరూకతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి అన్ని కులాలకు సామాజిక న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఎస్సీల విషయంలో ఏమైనా ఉంటే మాట్లాడేందుకు ప్రభుత్వం, పార్టీలో సంబంధిత మంత్రులు ఉన్నారన్నారు. మంద కృష్ణ మాదిగ మా ముద్దుబిడ్డ, ఆయనే మా నెంబర్‌వన్‌ అని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ, ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు చేసి నాయకులయ్యారని, తాను చెబితేనో, పుల్లారావు చెబితేనో నాయకులు కాలేదన్నారు. వ్యవసాయశాఖ చాలా పెద్దదని, దాని గురించి ఎక్కువగా మాట్లాడితే మంచిదని హితవు పలికారు. నేనైతే 24గంటల్లో ఎస్సీ వర్గీకరణను పరిష్కరిస్తానన్నారు. మందకృష్ణ మాదిగ వెనుక జగన్‌ ఉన్నారని వ్యాఖ్యలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు.


ఐలు జిల్లా అధ్యక్షుడిగా సలీం
గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: ఆలిండియా న్యాయవాదుల సంఘం (ఐలు) జిల్లా అధ్యక్షుడిగా బి.సలీం నియమితులయ్యారు. శనివారం ఏసీ కళాశాలలో జరిగిన ఐలు సమావేశంలో సలీంను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరావు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. వీసీ రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఏఎన్‌యూ పరిధిలో ఉన్న న్యాయకళాశాలల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు రూ.5 వేల ఉపకార వేతనం ఇవ్వాలని, మరణానంతరం లభించే మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాలని, న్యాయవాదులకు ఇళ్ల స్థలాలతోపాటు ఆరోగ్యకార్డులు జారీ చేయాలని ఐలు సమావేశంలో తీర్మానించారు. జిల్లా అధ్యక్షునిగా సలీంతోపాటు కార్యదర్శిగా మధుబాబు, గౌరవ అధ్యక్షునిగా పాములయ్య, ఉపాధ్యక్షునిగా ఉపేంద్ర, శ్యామ్‌, మూర్తి ఎన్నికయ్యారు.

లోక్‌ అదాలత్‌లో 3857 కేసులు పరిష్కారం .. జిల్లా వ్యాప్తంగా శనివారం వివిధ న్యాయస్థానాల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 3,857 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. బాధితులకు రూ.11,31,91,415 పరిహారం మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎం.రఫి, పలువురు న్యాయమూర్తులు, వివిధ సంస్థల అధికారులు పాల్గొన్నారు.విశ్వజనీన వ్యక్తిత్వం.. అంబేడ్కర్‌ సొంతం
తెనాలి(మారీస్‌పేట),న్యూస్‌టుడే: విశ్వజనీనమైన వ్యక్తిత్వంతో జీవనయానం సాగించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ భారత నిర్మాణంలో పోషించిన పాత్ర మరువలేనిదని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కత్తి పద్మారావు అన్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని పింఛనుదారుల భవనంలో ‘అంబేడ్కర్‌- వ్యక్తిత్వ నిర్మాణం’ అనే అంశంపై ఒక్కరోజు శిక్షణ తరగతుల్లో ఆయన బోధకునిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ అంబేడ్కర్‌ మేధావిగా తయారవడం వెనుక ఆయన తల్లిదండ్రుల పాత్ర ప్రశంసనీయమని చెప్పారు. కుల వివక్షను దేశం నుంచి తరిమివేయాలని కలలుగన్న అంబేడ్కర్‌, ఓటు హక్కు ద్వారా అన్ని కులాల వారికి రాజకీయ సమానత్వాన్ని చూపించిన ఘనత దక్కించుకున్నారని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను నడుస్తున్న గ్రంథాలయంగా చెప్పుకోవచ్చన్నారు. కులాన్ని, ఓటును అమ్ముకోవద్దని చెప్పిన బాబాసాహెబ్‌ ఒక మనిషికి వేరొక మనిషిని చంపే హక్కు లేదనే విషయాన్ని రాజ్యాంగం ద్వారా ప్రపంచానికి చాటారని కొనియాడారు. కుల వివక్ష పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలని చెప్పిన అంబేడ్కర్‌ ఆశయాలకు నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారన్నారు. ఇటీవల ఒక వర్గానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని పద్మారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌, దళిత మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బట్టు వెంకయ్య, న్యాయవాది పిల్లి విద్యాసాగర్‌, కనపర్తి అబ్రహం లింకన్‌, కోడూరు బాబు, దారా రామకృష్ణ, అక్కిదాసు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


మతాలు వేరైనా దృక్పథం ఒక్కటే
నిడమర్రు (గ్రామీణమంగళగిరి), న్యూస్‌టుడే: మతాలు వైరైనా ప్రాపంచిక దృక్పథం ఒక్కటేనని అఖిల భారత అభ్యుదయ వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు మర్ల విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. నిడమర్రు చార్వాకాశ్రమంలో 24వ నాస్తిక మేళా శనివారం జరిగింది. విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మానవ జాతి ప్రారంభం నుంచి భౌతిక, భావ వాదాలకు సంఘర్షణ జరుగుతోందన్నారు. నాగరిక ప్రారంభం నాటి నుంచి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మానవుడు ప్రయత్నించాడని, దాన్నే తత్వం అన్నారని గుర్తు చేశారు. మతం, దేవుడు, మూఢనమ్మకాలు, విగ్రహారాధనపై చార్వాకులు బౌద్ధుల కాలం నుంచే పోరాటాలు చేశారన్నారు. నాస్తిక హేతు దృక్పథం ప్రచారం కోసం, మతతత్వంపై పోరాడేందుకు మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాస్తిక కేంద్రం సంచాలకులు విజయం మాట్లాడుతూ.. విద్యార్థులకు బాల్యం నుంచే శాస్త్రీయ దృక్పథంపై అవగాహన అలవరచాలన్నారు. నేటి సమాజంలో హేతువాదులు, ప్రశ్నించే వారిని మతవాదులు హత్యలు చేస్తున్నారన్నారు. నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్న, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవానీ, చైతన్య మహిళా సంఘం కార్యదర్శి రాజేశ్వరి, నాస్తిక సమాజం కార్యదర్శి సుధాకర్‌, అరుణ్‌కుమార్‌, సుబ్బరాజు, పార్వతమ్మ, పలువురు నాస్తిక, హేతువాదులు పాల్గొన్నారు.


మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రదర్శన
మంగళగిరి, న్యూస్‌టుడే: మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శనివారం భారీ ప్రదర్శన జరిగింది. మతతత్వం, మూఢనమ్మకాలను వీడాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు. నిడమర్రు రోడ్డు నుంచి ప్రదర్శన పట్టణ వీధుల్లో సాగింది.


ఏఎన్‌యూ ఫార్మసీ విద్యార్థుల ప్రతిభ
గ్రామీణ మంగళగిరి, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల విద్యార్థులు గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన ఫార్మసీ స్పోర్ట్స్‌ మీట్‌ 2కె16 పోటీల్లో ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్‌ ప్రమీలారాణి శనివారం తెలిపారు. వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు వీసీ రాజేంద్రప్రసాద్‌, రెక్టార్‌ సాంబశివరావు, రిజిస్ట్రార్‌ రాజశేఖర్‌, ఓఎస్డీ దత్తాత్రేయరావు, చంద్రశేఖరరావు, రాంబాబు అభినందించారు.


బ్యారేజీ వద్ద పెరిగిన నీటి మట్టం
తాడేపల్లి, న్యూస్‌టుడే: కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిల్వలు పెరిగాయి. నిన్నటి వరకు బ్యారేజీ వద్ద 8 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం 10.6 అడుగులకు చేరింది. కేఈ మెయిన్‌ కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా కేడబ్ల్యూ కాలువకు 1818, గుంటూరు వాహినికి 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.


కరవు మండలాలను ప్రకటించాలి
మంగళగిరి, న్యూస్‌టుడే: సాగునీరు అందక పొలాలు బీడువారుతున్న తరుణంలో ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మంగళగిరిలో జరగనున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రచార ప్రతులను శనివారం ఆవిష్కరించారు. వేములపల్లి శ్రీకృష్ణ భవనంలో మాట్లాడుతూ.. 20న మంగళగిరిలో రైతు ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు పులి సాంబశివరావు, గని, సీపీఐ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, పట్టణ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, జాన్‌బాబు పాల్గొన్నారు.


పీహెచ్‌సీ అభివృద్ధికి కృషి
పెదవడ్లపూడి (గ్రామీణ మంగళగిరి), న్యూస్‌టుడే: పెదవడ్లపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తానని అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అన్నే చంద్రశేఖర్‌ చెప్పారు. ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కొల్లిపర క్లస్టర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఏసుప్రసాద్‌, శివచరణి, లక్ష్మనరసమ్మ, వైద్యాధికారిణి వూర్మిళాదేవి, సిబ్బందిని కలిసి మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యురాలు సంధ్యారాణి, మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సభ్యుడు యేళ్ల శివరామయ్య, ఈమని పీహెచ్‌సీ హెచ్‌డీసీ కమిటీ అధ్యక్షుడు పెమ్మసాని రామకృష్ణ పాల్గొన్నారు.


నేడు రాజధాని ప్రాంత రైతు సమస్యలపై సదస్సు
పెనుమాక (తాడేపల్లి), న్యూస్‌టుడే: రాజధాని ప్రాంత రైతు సమస్యల పరిష్కారం కోరుతూ రాజధాని రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ చెప్పారు. మండలంలోని పెనుమాకలో ఈ సదస్సు జరుగుతుందన్నారు.


తహసీల్దార్‌ కార్యాలయంలో స్వచ్ఛభారత్‌
తాడేపల్లి: రెండో శనివారం కావడంతో తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని తహసీల్దారు వెంకటేశ్వర్లు చేపట్టారు. స్టోర్‌ రూంలో దస్త్రాల దుమ్ము దులుపుతూ చిత్తు కాగితాల ఏరివేత పనులు చేశారు. సర్వేయర్‌, వీఆర్వో, సిబ్బంది పాల్గొన్నారు.


21న పర్యావరణ పరిరక్షణ యాత్ర
తాడేపల్లి, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 21న సైకిల్‌ యాత్ర చేపట్టనున్నట్లు ఆక్వా డెవిల్స్‌ సంక్షేమ సంఘ సభ్యులు తెలిపారు. 32 కిలోమీటర్లు పరిధిలోని ఏడు గ్రామాలను కలుపుతూ సైకిల్‌ యాత్ర సాగుతుందన్నారు. 21వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి సైకిల్‌యాత్రను ఎంపీ గోకరాజు గంగరాజు ప్రారంభిస్తారని ఆక్వా డెవిల్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రరావు, రామకృష్ణ, ఈవెంట్‌ కన్వీనర్‌ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు.


నేడు శివరామకృష్ణ సంస్మరణ సభ
చినపాలెం (దుగ్గిరాల), న్యూస్‌టుడే: రైతు సంఘం మండల కార్యదర్శి స్వర్ణాల శివరామకృష్ణ సంస్మరణ సభ చినపాలెంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని సీపీఎం మండల కార్యదర్శి సాంబశివరావు చెప్పారు.


నిప్పంటుకుని వ్యక్తికి గాయాలు
దుగ్గిరాల: చిలువూరులో రవి (50) అనే వ్యక్తిపై పెట్రోల్‌ పడి నిప్పంటుకున్న ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. 75 శాతం కాలిన గాయాలైన అతడ్ని దుగ్గిరాల 108 సిబ్బంది తెనాలి ఆసుపత్రికి తరలించారు.


అహింసా సంస్కార్‌ పాదయాత్ర
మంగళగిరి: అహింసా సంస్కార్‌ ప్రసన్నసాగర్‌ మహరాజ్‌ శనివారం పాదయాత్ర నిర్వహించారు. అహింసా సంస్కార్‌ పాదయాత్ర పేరుతో సాగిన యాత్ర బెంగళూరు చేరుతుందని నిర్వాహకులు తెలిపారు. యాత్రలో దింగబరస్వాములు పాల్గొన్నారు. వీరు పాదయాత్రగా ఎన్నారై ఆసుపత్రి వరకు వచ్చి సీఎన్‌ఆర్‌ గ్రానైట్‌కు చెందిన ప్రాంగణంలో కొద్ది సేపు ఉన్నారు. అనంతరం పాదయాత్రగా జైన దేవాలయానికి చేరుకున్నారు.


స్వచ్ఛభారత్‌ స్ఫూర్తికి విఘాతం
దేశమంతా స్వచ్ఛభారత్‌ అంటూ నినదిస్తుంటే.. రైల్వే అధికారులు, సిబ్బంది నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చిలువూరు రైల్వే గేటు వద్ద ఎక్కడి నుంచో చెత్తను తీసుకువచ్చి పడేస్తున్నా.. స్పందించి చర్యలు చేపట్టడం లేదు. గేటు వద్ద నిల్చుని తెనాలి దిశగా చూస్తే ఎంగిళి విస్తర్లు, ప్లాస్టిక్‌ సంచులు దర్శనమిస్తున్నారు. దుగ్గిరాల రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో పిచ్చికంప పెరిగింది. గతంలో క్వార్టర్స్‌ ఉన్న ప్రదేశంతోపాటు స్టేషన్‌ మాస్టర్‌ గది ఎదురుగా ఉన్న స్థలంలోనూ ఇదే పరిస్థితి. - న్యూస్‌టుడే, చిలువూరు (దుగ్గిరాల)


నేడు సీపీఐ నియోజక వర్గ స్థాయి సమావేశం
మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకవర్గ సీపీఐ సర్వ సభ్య సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రావుల శివారెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పాల్గొంటారని పేర్కొన్నారు.
Untitled Document
ట్రేడ్‌సెంటర్‌కు భూమి కేటాయింపునకు కృషి
ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ వీసీలో కలెక్టరు బాబు.ఎ
అమరావతి తరహాలోనే భూసమీకరణ
కాపు సంస్థ రుణాలను సద్వినియోగం చేసుకోండి
అదుపుతప్పి.. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
రక్తహీనత నివారణే లక్ష్యం
జూన్‌ నాటికి పట్టిసీమ జలాలు
మద్యంతో సమాజంలో అగౌరవం
అసలే నీటి కొరత... అపై చేపల పట్టివేత
పని ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి
ఆరు మట్టి ట్రాక్టర్లు సీజ్‌
సీఎం ఫొటో మార్ఫింగ్‌ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
బొమ్మపలికే.. బోలెడు భావాలు
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
ప్రభుత్వాసుపత్రుల సేవలపై నమ్మకం పెంచాలి
సీఎం దిల్లీ వెళ్తే వర్గీకరణకు పరిష్కారం
సమాచారం లేకుండా మాట్లాడటం భావ్యం కాదు
ఐలు జిల్లా అధ్యక్షుడిగా సలీం
విశ్వజనీన వ్యక్తిత్వం.. అంబేడ్కర్‌ సొంతం
మతాలు వేరైనా దృక్పథం ఒక్కటే
మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రదర్శన
ఏఎన్‌యూ ఫార్మసీ విద్యార్థుల ప్రతిభ
బ్యారేజీ వద్ద పెరిగిన నీటి మట్టం
కరవు మండలాలను ప్రకటించాలి
పీహెచ్‌సీ అభివృద్ధికి కృషి
నేడు రాజధాని ప్రాంత రైతు సమస్యలపై సదస్సు
తహసీల్దార్‌ కార్యాలయంలో స్వచ్ఛభారత్‌
21న పర్యావరణ పరిరక్షణ యాత్ర
నేడు శివరామకృష్ణ సంస్మరణ సభ
నిప్పంటుకుని వ్యక్తికి గాయాలు
అహింసా సంస్కార్‌ పాదయాత్ర
స్వచ్ఛభారత్‌ స్ఫూర్తికి విఘాతం
నేడు సీపీఐ నియోజక వర్గ స్థాయి సమావేశం
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net