రజనీ, కమల్‌ రాజకీయ నేతలు కాలేరు
మోదీని చాయ్‌వాలా, తక్కువ జాతి అని వ్యాఖ్యానించలేదు
కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌అయ్యర్‌ వెల్లడి
\
ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ తమిళ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లు పేరొందిన రాజకీయ నాయకులు కాలేరని కాంగ్రెస్‌ బహిష్కృత నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీని చాయ్‌వాలా అని సంబోధించలేదని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయ ఆరోపణలు మానుకోవాలని పేర్కొంటే.. ప్రధానిని తక్కువ జాతివాడివి అని వ్యాఖ్యానించినట్లు తప్పుడు ప్రచారాలు చేశారని విమర్శించారు. శుక్రవారమిక్కడ ‘ఇండియాటుడే’  గ్రూపు నిర్వహించిన సదస్సులో పాల్గొని తమిళ రాజకీయాలపై మాట్లాడారు. ‘‘అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్‌లు ద్రవిడ ఉద్యమంతో సంబంధం ఉన్న నాయకులు. సినిమాను రాజకీయ పరపతికి ఉపయోగించుకున్నారు. శివాజీ గణేశన్‌, విజయకాంత్‌ పేరున్న నటులెనా రాజకీయాల్లో రాణించలేకపోయారు. రజనీకాంత్‌ తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీని ఓడించవచ్చేమో కానీ ఏ ఇతర పార్టీని ఓడించలేరు.’’ అని పేర్కొన్నారు. ఇక నుంచి ఎన్నికలప్పుడు మీడియాతో మాట్లాడబోనని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు, తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు కొన్ని ద్రవిడ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని డీఎంకే అధికార ప్రతినిధి మనురాజ్‌ పేర్కొన్నారు. సినిమాల ప్రభావం తొలుత కొన్ని రోజులు రాజకీయాల్ని నడిపించినా.. తర్వాత పరిస్థితులే నిర్ణయిస్తాయని ఏఐఏడీఎంకే ఎంపీ వి.మైత్రేయన్‌ పేర్కొన్నారు.

లవ్‌జిహాద్‌ అనలేం..
రెండు మతాల యువతీ, యువకుల మధ్య ప్రేమను లవ్‌జిహాద్‌ అనే అభిప్రాయానికి రాలేమని కేరళ మాజీ డీజీపీ పీకే హోర్మిస్‌ అభిప్రాయపడ్డారు. కేరళలో ఐసిస్‌ సానుభూతిపరుల అరెస్టులు ఎక్కువగా ఉన్నాయన్నారు. గత పదేళ్లలో ఏటా 800 మంది ఇస్లాంలోకి మారారనీ, గత ఏడాదిలో ఈ సంఖ్య 1000గా నమోదైందని కేరళ ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ టికే వినోద్‌కుమార్‌ తెలిపారు. కేరళలో లవ్‌జిహాద్‌ జరుగుతోందని ఓ బాధిత యువతి తల్లి బిందు సంపత్‌ ఆరోపించారు. దీని కారణంగా మోసపోయిన యువతుల తల్లులు ఎంతో బాధతో ఉన్నారనీ, తమ బిడ్డలు ఎక్కడున్నా తమ వద్దకు తీసుకురావాలని కోరారు.

రాజకీయ హత్యలకు సీఎందే బాధ్యత..
కేరళలో రాజకీయ హత్యలకు సీఎం బాధ్యత వహించాలని ఎంపీ రాజీవ్‌చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ‘‘గత 16 ఏళ్లలో 176 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. 2016 నుంచి 14 మంది చనిపోతే.. వీరిలో 10 మంది భాజపా, 4 గురు వామపక్ష కార్యకర్తలు ఉన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులు లేవు. నిరుద్యోగిత పెరిగింది. అప్పులు ఎక్కువయ్యాయి. పర్యటకులు కేరళ కాదని శ్రీలంకకు వెళ్తున్నారు’’ అని విమర్శించారు. కేరళలో గతంతో పోలిస్తే రాజకీయ హత్యల సంఖ్య తగ్గిందని సీపీఎం కార్యదర్శి కేఎన్‌బాలగోపాల్‌ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కేరళ నుంచి వెళ్లిపోవాలని వామపక్షం బెదిరిస్తోందనీ, కానీ తాము అక్కడే నివసించాలని కోరుకుంటున్నామని ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కన్వీనర్‌ జె.నందకుమార్‌ పేర్కొన్నారు. కేరళలో రాజకీయ హత్యలకు భాజపా, వామపక్షాల వైఖరులే కారణమని సుప్రీంకోర్టు న్యాయవాది మాథ్యూ కుజల్‌నదన్‌ పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ ఒక్కరే నిజాయతీ కలిగిన నేత
నేడు 95 శాతం మంది దుష్టులే: మోహన్‌బాబు 
రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది దుష్టులని సీనియర్‌ నటుడు మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంత వరకు పెద్దన్న, స్నేహితుడు ఎన్టీఆర్‌ ఒక్కరే నిజాయతీ కలిగిన నాయకుడనీ, లంచం అంటే ఏమిటో తెలియని మహానాయకుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ రాజ్యసభకు పంపించినప్పుడు, ఎలాంటి మచ్చలేకుండా వెనక్కి వచ్చానని తెలిపారు. సినిమాలు, రాజకీయాలు వేరన్నారు. శుక్రవారమిక్కడ ‘ఇండియాటుడే’ గ్రూపు నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ రాజకీయ నాయకుల్లో అవినీతి, ప్రస్తుత రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయ నాయకులు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. అవన్నీ అమలు చేస్తే భారత్‌ ఎప్పుడో మెరుగైన స్థానంలో ఉండేది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లతో కలిసి నేనెప్పుడూ పని చేయలేదు. వారే నాతో పనిచేశారు. రజనీకాంత్‌ 40 ఏళ్లుగా తెలుసు. మంచి మిత్రుడు. కమల్‌హాసన్‌తో సుహృద్భావ సంబంధాలున్నాయి.’’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో సినీనటి మంచు లక్ష్మి పాల్గొన్నారు

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.