close
16 నుంచి ‘వాయు’వేగమే!

వేడెక్కనున్న ప్రచార సంరంభం
తిరుపతి నుంచి చంద్రబాబు
ఇడుపులపాయ నుంచి జగన్‌
ఉత్తరాంధ్ర నుంచి పవన్‌
హెలికాప్టర్లలో సుడిగాలి  పర్యటనలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సంరంభం వేడెక్కనుంది. ‘సమయం లేదు మిత్రమా? బహిరంగ సభలు, రోడ్డు షోలు, బస్సుయాత్రలే శరణ్యం’ అంటూ శనివారం నుంచే ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగుతున్నారు. వాయువేగంతో హెలికాప్టర్ల ద్వారా ప్రచారానికి ఉపక్రమిస్తున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏప్రిల్‌ 11న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 18న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అంటే ప్రచారానికి ఉన్న సమయం 25 రోజులే. ఇంత తక్కువ సమయంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముఖ్య నేతలు ప్రచారానికి వెళ్లడమంటే కష్టమే. అందుకే నోటిఫికేషన్‌ వెలువడకముందే ఈ నెల 16 నుంచే బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల నిర్వహణకు వేదికలను సిద్ధం చేసుకుంటున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు చుట్టొచ్చేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు వైకాపా అధ్యక్షుడు జగన్‌, జనసేన అధినేత పవన్‌ హెలికాప్టర్ల ద్వారా ప్రచార సభలకు హాజరు కానున్నారు.

తిరుపతి నుంచి...
తిరుపతి నుంచి శనివారం ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. అదే రోజు చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమవుతారు. 19లోగా అన్ని జిల్లాల్లో ఈ తరహా సమావేశాలు నిర్వహించి ఎన్నికల యుద్ధానికి కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు. ఆయన హెలికాప్టర్‌తోపాటు బస్సు యాత్ర, బహిరంగ సభలు, రోడ్డు షోల ద్వారా ప్రజల ముందుకు వెళ్లనున్నారు.

పిడుగురాళ్లలో...
వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఈ నెల 16 నుంచే ప్రచార రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళులర్పించి అదే రోజు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు. అదే రోజు గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలుత బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లాలని భావించినా సమయం తక్కువగా ఉండటంతో హెలికాప్టర్‌ ద్వారా సుడిగాలి పర్యటనలు చేయాలని యోచిస్తున్నారు.

ఒకే రోజు 3 ప్రాంతాల్లో...
జనసేన ఇప్పటికే 32 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. గురువారం రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ యుద్ధ శంఖారావం పూరించి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. శని, ఆదివారాల నుంచి ఓటర్ల ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచే ఆయన ప్రచారం ప్రారంభించనున్నారు. అదే రోజు దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పవన్‌ కూడా హెలికాప్టర్‌ ద్వారానే ప్రచారం సాగించనున్నారు. ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ రెండు మూడు నియోజకవర్గాల పరిధిలో రోడ్‌ షోలో పాల్గొనేలా పార్టీ మార్గసూచీ సిద్ధం చేస్తోంది. ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు భాజపా సన్నద్ధమైంది. 16న అభ్యర్థుల తొలి జాబితాను కేంద్ర నాయకత్వం ప్రకటిస్తుందని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు నాగభూషణం తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.