close
మంగళవారం వరకు ముందుకెళ్లొద్దు

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
‘నవయుగ’ సంస్థ అప్పీలుపై స్పందించిన ధర్మాసనం
పలు శాఖల అధికారులకు నోటీసులు

ఈనాడు, అమరావతి: పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌(పీహెచ్‌ఈపీ) ఒప్పందం రద్దుపై గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎత్తివేయడాన్ని సవాలు చేస్తూ నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థ దాఖలు చేసిన అప్పీలుపై ధర్మాసనం స్పందించింది. పీహెచ్‌ఈపీ పనుల విషయంలో మంగళవారం వరకు ముందుకెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందో అలాగే ఉంచాలని తేల్చిచెప్పింది. ఏపీ జెన్‌కో ఛైర్మన్‌, జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌(హెచ్‌పీసీ, హైడల్‌ప్రాజెక్ట్స్‌), సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌, పీఐపీహెచ్‌డబ్ల్యూ సర్కిల్‌(ధవళేశ్వరం) ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ(పీపీఏ) సీఈవోలకు నోటీసులు జారీచేసింది. ప్రమాణపత్రం దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

నవయుగ సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ వాదనలు వినిపిస్తూ. సింగిల్‌ జడ్జి గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో పాటు, తాము దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొంటూ తమ అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారన్నారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులో తప్పు ఏమిటో చెప్పాలని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఒప్పందం రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేయడంతోపాటు పీహెచ్‌ఈపీ పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించే ప్రక్రియ చేపట్టవద్దని గతంలో ఆదేశించారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై జెన్‌కో ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేయకుండా.. సింగిల్‌ జడ్జి వద్దే స్టే ఎత్తివేత కోసం అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ నిర్వహించింది. ఆ చర్య కోర్టుధిక్కరణ కిందకు వస్తుంది’ అని పేర్కొన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది. స్టే ఎత్తివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు ఆదేశాలు జారీచేస్తున్న సందర్భంలో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేయవద్దని..వాదనలు చెప్పేందుకు అవకాశమివ్వాలని కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. సింగిల్‌ జడ్జి స్టే ఎత్తివేశాక పనులను ఓ సంస్థకు అప్పగించామన్నారు. రివర్స్‌ టెండర్‌ విధానం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయ్యిందన్నారు. పనులను ఆపొద్దని కోరారు. పనుల విషయంలో మూడు నెలలు ఆగినవాళ్లు మరో 15 రోజులు ఆగలేరా? అని ప్రశ్నించింది. అప్పీల్‌ను విచారణకు స్వీకరించాక సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేయాల్సిన అవసరం ఉందని మరోమారు వ్యాఖ్యానించింది. అప్పీలుపై సోమవారం లేదా మంగళవారం విచారణ జరపాలని ఏజీ విజ్ఞప్తి చేశారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.