
30వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కొత్త పథకం
సీఎం జగన్కు ప్రతిపాదనలు సమర్పించిన అధికారులు
రూ.90 వేల కోట్లతో చిన్నా, పెద్ద కలిపి 25 కొత్త ప్రాజెక్టులు
ఈనాడు - అమరావతి
రాయలసీమ జిల్లాల్లోని బీడుబారిన పొలాలను సస్య శ్యామలం చేసేందుకు నూతన ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిప్రకారం ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి దాదాపు 30 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసి రాయలసీమ జిల్లాలకు జలాలను మళ్లించాలనేది యోచన. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ప్రస్తుతం 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకువెళ్లే సామర్థ్యం ఉండగా దానిని పెంచితేనే తక్కువ రోజుల్లో ఎక్కువగా శ్రీశైలం నీటిని తీసుకువెళ్లగలమనే ఉద్దేశంతో దీనికి రూపకల్పన చేశారు. 40 రోజుల వరద సమయంలోనే అధిక జలాలు తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని గతంలో ముఖ్యమంత్రి సూచించిన మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో 854 అడుగుల వద్ద మాత్రమే సీమ జిల్లాలకు నీటిని తీసుకువెళ్లడం సాధ్యమవుతోంది. కొత్త పథకంలో ముచ్చుమర్రి వద్ద 794 అడుగుల వద్ద కూడా 30వేల క్యూసెక్కులు తీసుకునేలా భారీ ఎత్తిపోతల చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. దీనిని ముఖ్యమంత్రి జగన్ బుధవారం నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో అధికారులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టదలచిన 20 నుంచి 25 ప్రాజెక్టుల అవసరం, ప్రాధాన్యాలతోబాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి కృష్ణా అనుసంధానం, కృష్ణా నదిపై కొత్త బ్యారేజీల నిర్మాణం, గుండ్రేవుల ఎత్తిపోతల, కడప జిల్లాలో కొత్త జలాశయాలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులపై ఈ చర్చ జరిగింది. జలవనరులశాఖ అధికారులు రూపొందించిన ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ప్రాజెక్టు వారీగా సమీక్షించారు. కొత్త ప్రాజెక్టులకు దాదాపు రూ.80 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, ఇందులో తొలిదశలో ఏవి చేపట్టాలి? మలిదశలో ఏవి చేపట్టాలనే విషయాలపై చర్చించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొత్త ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కార్యాలయం చేపట్టేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలియజేసిన తర్వాత వాటిపై పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) రూపొందించేందుకు టెండర్లు పిలవనున్నారు. డీపీఆర్లు సిద్ధమైన తర్వాత పాలనామోదంతో పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.