close

ప్రధానాంశాలు

ఉద్యమం ఆగదు

రాజధానిగా అమరావతిని సాధించేవరకు ఆందోళన కొనసాగిస్తామన్న రైతులు
కృష్ణా నదిలో జలదీక్ష
తెలంగాణ రైతుల సంఘీభావం
రాజధానిలో 42వ రోజు కొనసాగిన దీక్షా శిబిరాలు
నేడు రాజధాని గ్రామాల్లో వాహన ర్యాలీ

‘మాట వినకపోతే వేటేనా...రద్దుల పద్దే మీ విధానమా?.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తగునా? రైతులు, సామాన్య ప్రజల ఓట్లతో గెలిచి వారిపైనే స్వారీ చేస్తారా? వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా.. రాజధాని రైతులు మీకు చేసిన అన్యాయమేంటో చెప్పాలి? అన్నీ రద్దు చేసుకుంటూ పోతే ఏమీ మిగలవు’ అంటూ రాజధాని రైతులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అమరావతి సాధించే వరకు ఈ పోరాటం ఆగదని నినదించారు. మంగళవారం 42వ రోజు తుళ్లూరు, వెలగపూడి, మందడంలో దీక్షా శిబిరాలు కొనసాగాయి.

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి

రాయపూడి గ్రామం సమీపంలో కృష్ణా నదిలో రైతులు జలదీక్ష చేపట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా నుంచి రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాల్లో, తాడికొండ మండలం అడ్డరోడ్డులో, తాడేపల్లి మండలం పెనుమాకలో నిరసన దీక్షలు కొనసాగాయి. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యమూర్తి, తెదేపా నేత జియావుద్దీన్‌ తదితరులు సంఘీభావం ప్రకటించారు.

రాజధాని ప్రాంత రైతుల జలదీక్ష

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ప్రాంత ప్రజలు రాయపూడి లాంచీల రేవులో మంగళవారం ఉదయం జల దీక్ష చేపట్టారు. కృష్ణా నదిలో రైతులు, మహిళలు మెడ లోతు వరకు నీళ్లలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని రైతులు, రైతుకూలీల సమాఖ్య జెండాలు పట్టుకుని జై అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, ‘భూములు ఇచ్చాం... రోడ్డున పడ్డాం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రకటన విరమించుకునేవరకు నిరసన దీక్షలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. మండలిలో ఊరట లభించిందని అనుకుంటే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం ఆమోదించి తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేసి ఫలాలను 13 జిల్లాలకు ప్రజలకు పంచితే మాకు అభ్యంతరం లేదన్నారు.


నల్లబెలూన్లు ఎగరేసి నిరసన

మందడంలో 42వ రోజు రైతులు, మహిళల నిరసన దీక్ష కొనసాగింది. 3 రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగురవేశారు. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో మరణించిన రంగిశెట్టి వెంకటేశ్వరరావుకు రైతులు, మహిళలు నివాళులర్పించారు. మాజీ ఎంపీ మాగంటి బాబు సోదరి గిరిజ, విజయవాడ నుంచి వచ్చిన పలువురు సంఘీభావం తెలిపారు.


హనుమాన్‌ చాలీసా పారాయణం

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ పెదకాకానికి చెందిన పలువురు మహిళలు 108 సార్లు ‘హనుమాన్‌ చాలీసా’ పారాయణం చేశారు. ఉద్ధండరాయునిపాలెంలోని ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.


నేడు రాజధానిలో వాహన ర్యాలీలు

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, రైతు కూలీలు బుధవారం ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు రైతులందరూ తుళ్లూరు చేరుకోవాలని సూచించారు. ర్యాలీ 25 గ్రామాల గుండా కొనసాగుతుందని రైతుల ఐకాస ప్రతినిధులు ప్రకటించారు.


‘జస్టిస్‌ ఫర్‌  అమరావతి’ కి భారీ మద్దతు

నీరుకొండ గ్రామానికి చెందిన రైతులు రూ.50వేలు, దిల్లీలో నివాసం ఉంటున్న రాజధాని వాసి సూరపనేని పిచ్చేశ్వరరావు రూ.75వేలు రైతుల ఐకాసకు విరాళంగా ఇచ్చారు. విజయవాడకు చెందిన ప్రవాసాంధ్రుడు సంతోష్‌ సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని ‘జస్టిస్‌ ఫర్‌ అమరావతి’ పేరుతో చేంజ్‌.ఓఆర్‌జీ పిటిషన్‌ దాఖలు చేస్తే.. అనూహ్యంగా 1.2 లక్షల మంది సంతకాలు చేసి మద్దతు తెలిపారన్నారు.

తుళ్లూరులో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన రైతులు సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు రంగనాథ్‌, ఇందిరమ్మ దంపతులు రూ.లక్ష విరాళంగా అందించారు.


రైతులపై కేసులా..?

‘‘ప్రజల పక్షాన ఉండాల్సిన ముఖ్యమంత్రి ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. న్యాయం చేయాలంటూ బయటికొచ్చిన రైతులపై కేసులు పెట్టడం దారుణం. అమరావతి ప్రజల ఉద్యమానికి అన్ని ప్రాంతాల ప్రజలు అండగా ఉంటారు. రైతుతో కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వమూ బాగుపడదు’’.

- దుర్గాప్రసాద్‌, కిరణ్మయి, నల్గొండ జిల్లా

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.