Smart card: నిలిచిన స్మార్ట్‌ కార్డుల ముద్రణ

ప్రధానాంశాలు

Smart card: నిలిచిన స్మార్ట్‌ కార్డుల ముద్రణ

 గతంలో ఏడాది పాటు ఆగిన వైనం

 ఇటీవలే పాతవి ముద్రణ, మళ్లీ పలు జిల్లాల్లో కొరత

ఈనాడు, అమరావతి: రవాణా శాఖలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌(ఆర్సీ)ల ముద్రణ మళ్లీ మొదటికి వచ్చింది. నెలల తరబడి వాహనదారులకు ఇవి అందటం లేదు. వీటి సరఫరా, ముద్రణకు సంబంధించి సకాలంలో టెండరు ఖరారు చేయకపోవడంతో పదేపదే సమస్య తలెత్తుతోంది. గత ఏడాది జూన్‌, జులై నుంచి అన్ని జిల్లాల్లో డీఎల్‌, ఆర్సీ కార్డుల జారీ నిలిచిపోయింది. స్మార్ట్‌ కార్డులు సరఫరా చేసే గుత్తేదారు గడువు ముగియడంతో పాటు, బకాయిలు చెల్లించకపోవడంతో వీటి సరఫరా ఆపేశారు. దీంతో దాదాపు 10నెలల పాటు కార్డుల ముద్రణ నిలిచిపోయింది. మళ్లీ నాలుగు నెలల కిందట పాత గుత్తేదారుకు బకాయిలు చెల్లించి, స్మార్ట్‌కార్డులు సరఫరా చేయాలని కోరారు. దీంతో పెండింగ్‌లో ఉన్న లక్షల సంఖ్యలో కార్డులను మొన్నటి వరకు ముద్రించి వాహనదారులకు అందజేశారు. మళ్లీ పలు జిల్లాల్లో కార్డులు అయిపోవడంతో ముద్రణ, పంపిణీ ఆగిపోతోంది.

కొత్త విధానంపై స్పష్టత కరవు

వాస్తవానికి స్మార్ట్‌ కార్డులు సరఫరా చేసే గుత్తేదారు గడువు నాలుగేళ్ల కిందటే ముగిసింది. మళ్లీ రెండేళ్లు పొడిగించారు. ఇప్పటి వరకు ఉన్న విధానంలో కాకుండా, కార్డుల సరఫరాతో పాటు వాటి ముద్రణ, వాహనదారులకు అందజేసే బాధ్యత కూడా గుత్తేదారుకే ఇవ్వాలని భావించారు. సర్వీస్‌ ఛార్జి మొత్తం గుత్తేదారు తీసుకొని, అందులో ఖర్చుని మినహాయించుకొని, మిగిలినది ప్రభుత్వానికి జమ చేసేలా ప్రతిపాదించారు. ఈ మేరకు టెండరు ప్రతిపాదన సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో ఇందులో మార్పులు చేస్తున్నారు. అయినా సరే టెండరు దస్త్రం ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు.

గంటలోనే కార్డు జారీ కసరత్తు

తాజాగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డులను గంటలోనే జారీచేసే విధానంపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రవాణా శాఖకు 128 కార్యాలయాలు ఉండగా..  ఎంపికైన గుత్తేదారు అన్ని చోట్ల కార్డుల ముద్రణకు ఏర్పాటు చేసుకోవాలి. అక్కడికక్కడే గంటలోనే  కార్డులు ముద్రించి వాహనదారులకు అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు టెండరులో మార్పులు చేస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం ఎప్పటికి ఆమోదం తెలుపుతుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని