మా నాన్న హత్యకు పోలీసుల కుట్ర
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా నాన్న హత్యకు పోలీసుల కుట్ర

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రఘురామకృష్ణరాజు కుమారుడి ఫిర్యాదు

ఈనాడు, దిల్లీ: ఎంపీ అయిన తన తండ్రి రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకొని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు కుమారుడు కనుమూరు భరత్‌ ఆదివారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు ఫిర్యాదు చేశారు. రెండు పేజీల లేఖతోపాటు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, పోలీసు కస్టడీలో తన తండ్రికి తగిలిన గాయాలు, శనివారం ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను జత చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు ఈ నెల 14న హైదరాబాద్‌లోని మా నివాసం నుంచి అరెస్ట్‌ పేరుతో నా తండ్రిని చట్టవిరుద్ధంగా ఎత్తుకెళ్లారు. విచారణ పేరుతో 14వ తేదీ రాత్రి  పోలీసు కస్టడీలో ఆయన్ను కనీసం నడవడానికి వీల్లేకుండా తీవ్రంగా కొట్టారు.  ఆయన శరీరం, కాళ్లపై స్పష్టంగా కనిపించే గాయాలయ్యాయి. సీఐడీ పోలీసులు 15న ఆయన్ను తమ కస్టడీకి అడిగినప్పుడు ముందురోజు రాత్రి పోలీసు కస్టడీలో తనను హింసించిన తీరుపై నా తండ్రి గుంటూరు 6వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నా తండ్రి పార్లమెంటు సభ్యుడు కావడంతో రిమాండ్‌కు ఇవ్వడానికి స్పీకర్‌ అనుమతి కావాలని చెప్పి మెజిస్ట్రేట్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ను తిప్పి పంపినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మౌఖిక ఆదేశాలకు విరుద్ధంగా పోలీసులు నా తండ్రిని తీవ్రంగా గాయపరిచి, హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ చర్యల నుంచి రక్షణ కోసం ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు సహా, వివిధ న్యాయస్థానాలను ఆశ్రయించారు.  ఇప్పుడు నేను సమర్పించిన రికార్డులన్నింటినీ పరిశీలించి ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకొని భారతీయ పరిపాలన, న్యాయవ్యవస్థపై సామాన్యులకు విశ్వాసం కలిగించేలా చేయాలి’ అని భరత్‌ హోం శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు