దోపిడీదారులకు ట్రస్టులో చోటులేదు
close

ప్రధానాంశాలు

దోపిడీదారులకు ట్రస్టులో చోటులేదు

అశోక్‌ గజపతిరాజు స్పష్టీకరణ
మాన్సాస్‌ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకారం

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: మాన్సాస్‌ ట్రస్టులో దోపిడీదారులకు చోటు లేదని ట్రస్టు ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు స్పష్టం చేశారు. ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజు నియామకం చెల్లదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఆయన విజయనగరం కోటలోని ట్రస్టు కార్యాలయంలో ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు, కరస్పాండెంట్‌ కె.వి.ఎల్‌.రాజు గైర్హాజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతకు ముందు విలేకరులతో మాట్లాడుతూ... సింహాచలం ఈవో తనను కలిసేందుకు ఇష్టపడలేదని తెలిపారు. ప్రభుత్వాలు కక్షలు, కార్పణ్యాలతో ముందుకెళ్తే నష్టపోయేది ప్రజలేనని వ్యాఖ్యానించారు. రామతీర్థంలో విగ్రహాల తయారీకి ఇచ్చిన చెక్కును వెనక్కి పంపి తనను మానసిక క్షోభకు గురి చేశారని, విగ్రహ పునఃప్రతిష్ఠకు ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మం బతికి ఉంది కాబట్టే చెక్కును అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వగలిగానని తెలిపారు. మాన్సాస్‌ భూముల్లో ఇసుక తవ్వకాలు ఎవరి హయాంలో జరిగాయో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండు చేశారు. ట్రస్టు సిబ్బందికి గత ఛైర్‌పర్సన్‌ వేతనాలను ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని, ఈ ఏడాది ఆడిట్‌ జరగలేదంటే ఆశ్చర్యంగా ఉందని, దానిని చేయించాల్సిన బాధ్యత అధికారులది కాదా అని ప్రశ్నించారు. ఏడాదిగా ట్రస్టును భ్రష్టు పట్టించారని విమర్శించారు.

వివరాలను సమర్పించండి... అశోక్‌ గజపతి బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఈవోకు పలు ఆదేశాలిచ్చారు. ట్రస్టు కార్యకలాపాలపై పదేళ్లుగా ఆడిటింగ్‌ జరగలేదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 21లోగా ఆడిట్‌ వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలోని ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు ఎవరు అనుమతులిచ్చారో నివేదిక సమర్పించాలని కోరారు. విద్యా సంస్థల బడ్జెట్‌ ప్రతిపాదనలను వారంలో తయారు చేయాలని, సిబ్బంది జీతాల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు కార్యాలయంలో రూ.5 లక్షలకు పైబడి చేసిన కొనుగోళ్ల వివరాలను రెండు రోజుల్లో అందించాలని ఆదేశించారు. లీజు గడువు పూర్తయిన భూములకు వెంటనే వేలం పాటలను నిర్వహించాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని