విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు

ప్రధానాంశాలు

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు

తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలి
నూతన విద్యా విధానంపై సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు ఉపాధ్యాయులను నియమించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఉన్న అనుభవాన్ని, బోధన నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన విద్యా విధానంపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ‘విద్యా హక్కు చట్టం నిబంధనలు పాటిస్తూ మూడో తరగతి నుంచి విద్యార్థులకు విషయ నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన అందించాలి. నూతన విద్యావిధానం ద్వారా తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులతో ప్రపంచస్థాయి పోటీకి తగినట్లు విద్యార్థులు తయారవుతారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందుతుంది. చిన్నప్పటి నుంచే నిపుణులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. వర్గీకరణతో ఏకోపాధ్యాయ బడుల్లోనూ సబ్జెక్టులను వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే పరిస్థితులు వస్తాయి. దీంతో ఉపాధ్యాయులకు పనిభారం తగ్గుతుంది. అర్హతలున్న అంగన్‌వాడీ ఉపాధ్యాయుల పదోన్నతులకు మార్గం ఏర్పడుతుంది. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలి. నూతన విద్యా విధానం, ‘నాడు-నేడు’ కోసం రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈవోలు, పీడీలకు అవగాహన కల్పించాలి. ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలి’ అని సూచించారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒకచోట ఈ నెల 16 విద్యాకానుక పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు. అమ్మఒడి, ఆంగ్ల మాధ్యమం, నాడు-నేడు తదితర విప్లవాత్మక మార్పులతో క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరించడంతో పూర్వ ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు ఇప్పుడున్న బడులు 44వేల నుంచి 58వేలకు పెరుగుతాయని వెల్లడించారు. ‘2014-15లో అన్ని రకాల బడుల్లో ప్రవేశాలు 72.33 లక్షలు ఉండగా.. 2018-19 నాటికి 70.43 లక్షలకు తగ్గింది. అమ్మ ఒడి పథకం వల్ల 2020-21లో ప్రవేశాలు 73.06 లక్షలకు చేరాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 2014-15లో 42.83 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. 2018-19 నాటికి ఆ సంఖ్య 37.21 లక్షలకు పడిపోయింది. 2020-21లో 43.44 లక్షలకు చేరింది. అమ్మ ఒడితో పిల్లల్ని బడులకు పంపాలన్న కోరిక తల్లిదండ్రుల్లో బలపడింది. సామాజిక తనిఖీల ద్వారా విద్యార్థుల కచ్చితమైన వివరాలు ఉన్నాయి’ అని అధికారులు వెల్లడించారు. ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్‌, ముఖ్య కార్యదర్శులు రాజశేఖర్‌, ఏఆర్‌ అనూరాధ పాల్గొన్నారు.


నూతన విద్యావిధానంలో పాఠశాలలు ఆరు రకాలుగా..

* పూర్వ ప్రాథమిక విద్య (పీపీ)-1, 2 శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాల

* పీపీ-1, 2 ఒకటి, 2 తరగతులతో ఫౌండేషన్‌పాఠశాల

* పీపీ-1 నుంచి ఐదో తరగతి వరకు ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాల

* మూడో తరగతి నుంచి ఏడు లేదా ఎనిమిదో తరగతి వరకు ప్రీ హైస్కూల్‌

* 3 నుంచి 10తరగతి వరకు ఉన్నత పాఠశాల

* మూడు నుంచి 12వ తరగతి వరకు హైస్కూల్‌ ప్లస్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని