ఇదేం పద్ధతి! ఇవేం నియామకాలు?

ప్రధానాంశాలు

ఇదేం పద్ధతి! ఇవేం నియామకాలు?

ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
సెలక్షన్‌ కమిటీ సిఫార్సు చేసిన పేర్ల ఎంపికలో క్రమపద్ధతిని పాటించకపోవడంపై నిలదీత
విశాఖ, హైదరాబాద్‌ డీఆర్‌టీ అధికార పరిధిని కోల్‌కతాకు మార్చడంపైనా అభ్యంతరం
ఈనాడు - దిల్లీ

దేశంలోని వివిధ ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. విచారణ సమయంలో ఏదో ఒకటి చెప్పడం అలవాటైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీలను 2 వారాల్లోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది. నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్సీఎల్‌ఏటీ), ఆదాయపుపన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ నియామకాల్లో వ్యవహరించిన తీరు, జబల్‌పుర్‌ రుణ రికవరీ ట్రైబ్యునల్‌(డీఆర్‌టీ) అధికార పరిధిని లఖ్‌నవూకి బదిలీచేయడం, ఎన్సీఎల్‌ఏటీ ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ ఏ.ఐ.ఎస్‌.చీమాను నిర్ణీత గడువుకు ముందే పదవీ విరమణ చేయించడంపై న్యాయవాదులు తెలిపిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ధర్మాసనం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మండిపడింది. ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావుల ప్రత్యేక ధర్మాసనం కీలక వ్యాఖ్యలుచేసింది. తొలుత అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. మొత్తం విషయంపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేందుకు వారం సమయం ఇవ్వాలని, మరో వారం తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని విన్నవించారు. విభిన్న పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వి, అరవింద్‌ దతార్‌లూ వాదనలు వినిపించారు.
ప్రభుత్వ వ్యవహార శైలిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీఎల్‌టీ సభ్యుల ఎంపిక జాబితా చూశాను. సెలెక్ట్‌ కమిటీ 11 మంది జ్యుడీషియల్‌ సభ్యులు, 10 మంది సాంకేతిక సభ్యులను సిఫార్సు చేసింది. భవిష్యత్తులో తలెత్తే ఖాళీలను దృష్టిలో ఉంచుకొని ఈ రెండు కేటగిరీలకూ మరో పది మంది చొప్పున వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంచింది. ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను చూస్తే అధికారులు సెలెక్షన్‌ లిస్ట్‌లోని నాలుగు పేర్లు, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న మూడు పేర్లను తమకు ఇష్టం వచ్చినట్లు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిభ ఆధారంగా తయారు చేసిన ఎంపిక జాబితాలోని పేర్లను విస్మరించి వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారి పేర్లను తీసుకోరాదన్నది సర్వీస్‌ నిబంధనల్లోని ప్రాథమికాంశం. కానీ అందుకు విరుద్ధంగా చేశారు. ఇదేం ఎంపికో, ఇదేం నియామకమో నాకు అర్థం కావడంలేదు. ప్రతిసారీ కోర్టు ధిక్కరణ పిటిషనో, ఇంకో రిట్‌ పిటిషనో దాఖలైన తర్వాతే ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకుంటోంది. ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ సభ్యుల ఎంపికలోనూ ఇదే విధానాన్ని అనుసరించారు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

ప్రభుత్వం తీరు దురదృష్టకరం

సెలెక్షన్‌ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరంలేదని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ బదులిచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ‘‘మనం చట్టబద్ధ పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాం. ఆ విధానాన్ని అంగీకరించనని మీరు అనకూడదు’’ అని హితవుపలికారు. ప్రస్తుతం పరిస్థితులు సాగుతున్న విధానం, నిర్ణయాలు తీసుకుంటున్న తీరుపై సంతోషంగా లేమని తెలిపారు.
‘‘ఎన్‌సీఎల్‌టీ ఎంపిక కమిటీలో నేనూ భాగస్వామిగా ఉన్నాను. మేం జ్యుడీషియల్‌ సభ్యుల కోసం 534 మంది అభ్యర్థులను, టెక్నికల్‌ మెంబర్ల కోసం 400మందికిపైగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాం. జ్యుడీషియల్‌ సభ్యుల కోసం మేం సిఫార్సు చేసిన 11 పేర్లలో 1, 3, 5, 8 క్రమసంఖ్యలో ఉన్న పేర్లను ఎంపిక చేశారు. తర్వాత వెయిటింగ్‌ లిస్ట్‌లో క్రమసంఖ్య 4, 7, 9లో ఉన్న పేర్లను తీసుకున్నారు. సాంకేతిక సభ్యుల నియామకంలోనూ అదే పద్ధతి అనుసరించారు. మేం దేశవ్యాప్తంగా పర్యటించాం. కొవిడ్‌ సమయంలోనూ ఇంటర్వ్యూలు నిర్వహించి పేర్లు సిఫార్సు చేస్తే పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్‌సీఎల్‌టీకి ఎంపికచేసిన జ్యుడీషియల్‌ మెంబర్లు అప్పటికి హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నారు. 62 ఏళ్ల వయస్సుకు చేరుకున్నారు. నియామకాన్ని మీరు రెండేళ్లు ఆలస్యం చేయడంతో ఇప్పుడు వారు 64 ఏళ్లకు వచ్చారు. నియామక ఉత్తర్వుల్లో వారి పదవీ కాలం 65 ఏళ్ల వరకు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు వారికి మిగిలింది ఏడాది సమయమే. ఇలా ఎవరైనా ఏడాది కాలానికి ఈ ఉద్యోగంలో చేరుతారా? ప్రభుత్వం తీరు చాలా దురదృష్టకరం’’ అని జస్టిస్‌ రమణ అన్నారు. రెండువారాల్లోగా నియామకాలు చేపట్టమని ప్రభుత్వానికి చెప్పండంటూ అటార్నీ జనరల్‌కు సూచించారు.

సభ్యుల నియామకాలే పరిష్కారం

‘హైదరాబాద్‌, విశాఖపట్నం డీఆర్‌టీల్లో అధికారులు లేనందున ఆ రెండింటి అధికార పరిధిని కోల్‌కత్తాకు అప్పగించారు. అక్కడ కూడా లఖ్‌నవూకి చెందిన అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించారు. కక్షీదారులు అంతంత దూరం ఎలా వెళ్తారు. అంతటా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఉత్తర్వులు జారీచేయకముందే మీరు ఏదో ఒకటి చేస్తే సంతోషిస్తాం. అన్ని సమస్యలకూ సభ్యుల నియామకాలే పరిష్కారం. అటార్నీ జనరల్‌ రెండు వారాల సమయం అడిగారు కాబట్టి ఇస్తున్నాం. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రస్తుతానికి నిలిపి ఉంచుతున్నాం. లేదంటే మేం ఉత్తర్వులు జారీచేస్తాం’ అని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు. సిఫార్సు చేసిన జాబితాలోని వ్యక్తులను ఎంపిక చేయకపోవడానికి కారణాలను తెలపాలని ఆదేశించారు.
జస్టిస్‌ చంద్రచూడ్‌ ఓ సందర్భంలో జోక్యం చేసుకొని జాతీయ వినియోగదారుల పరిష్కార కమిషన్‌కు సంబంధించిన నియామకాల్లోనూ సెలెక్షన్‌ కమిటీ సిఫార్సుల్లోని కొన్ని పేర్లను పక్కనపెట్టి మరికొందర్ని నియమించారని తెలిపారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ ‘‘ఏడాదిన్నర క్రితమే సెలెక్షన్‌ కమిటీ టెలికాంవివాదాల పరిష్కార ట్రైబ్యునల్‌లోని ప్రతి పోస్టుకు రెండుపేర్లను సిఫార్సు చేసింది. ఇంతవరకూ నియామకాలు జరగలేదు. ఆ అంశం ఇంకెంతకాలం సాగుతుందో మాకు అర్థం కావడంలేదు. ఎంపికలో ప్రభుత్వానిదే చివరి నిర్ణయమైతే సెలెక్షన్‌ కమిటీకున్న పవిత్రత ఏంకావాలి? ట్రైబ్యునళ్లలో టెక్నికల్‌ మెంబర్లను నియమించకపోతే అవి పనిచేయడం చాలా కష్టం. అందువల్ల నియామకాల పని చూడండి’ అని అటార్నీ జనరల్‌కు సూచించారు.


జస్టిస్‌ ఏ.ఐ.ఎస్‌.చీమా పిటిషన్‌పై నేడు విచారణ

ఎన్సీఎల్‌ఏటీ ఛైర్‌పర్సన్‌గా తన పదవీ కాలాన్ని తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ జస్టిస్‌ ఏ.ఐ.ఎస్‌.చీమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ కేసు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీ కేసుల విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చీమాను ఎన్సీఎల్‌ఏటీ ఛైర్‌పర్సన్‌ పదవి నుంచి అర్ధంతరంగా తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని