రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరు

 సీఎం జగన్‌ తీరుతో అన్ని వర్గాలకూ ఇబ్బంది
నిరుద్యోగులతో సమావేశంలో  తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత.. ఇలా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు, నిరుద్యోగులతో మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబు గురువారం సమావేశమయ్యారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరుద్యోగులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వస్తే 2.36 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్‌ మాట ఇచ్చి తప్పారని, దీనిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ చంద్రబాబుకు లేఖ ఇచ్చారు. ముఖ్యమంత్రి తీరుతో రాష్ట్రంలో ప్రజలకు పనుల్లేవని, యువతకు ఉద్యోగాలు లేవని ఈ సందర్భంగా చంద్రబాబు మండిపడ్డారు. ‘ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌క్యాలెండర్‌ బూటకం. రాజధాని అమరావతిని జగన్‌ నిలిపేయడంతో పరిశ్రమలు రాలేదు. వేలాది ఉద్యోగాలు పోయాయి. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే జగన్‌ తీరు వల్ల అవి వెనక్కి మళ్లాయి. దీంతో 30 లక్షల ఉద్యోగాలను కోల్పోయాం. పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడుతున్నారు. నిరుద్యోగిత రేటు 3.6 నుంచి 16 శాతానికి పెరిగింది. నిరుద్యోగులు ఉద్యమిస్తే అరెస్టు చేస్తున్నారు.. అత్యాచారం కేసులు పెట్టి బెయిల్‌ రాకుండా చేస్తున్నారు. వీటన్నింటిపై చట్టసభలో పోరాడతాం’ అని తెలిపారు. సమావేశంలో ఏఐవైఎఫ్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శులు లెనిన్‌బాబు, సూర్యారావు, ఏపీఎస్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్‌, రవిచంద్ర మాట్లాడారు.

‘కోడెలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’

దివంగత నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆయనపై నిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. కోడెల మరణాన్ని తలచుకుంటే ఇప్పటికీ మనసు కుదుటపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు.. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మూడున్నర దశాబ్దాలపాటు ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్‌గా వివిధ పదవులను అలంకరించి కోడెల వాటికి వన్నె తెచ్చారు. అలాంటి వ్యక్తిని వేధించారు. చరిత్ర ఉన్నంతవరకు ప్రభుత్వ దారుణం ఉంటుంది’ అని అన్నారు.

ప్రజలను నిద్రపోనీయడం లేదు

‘ప్రభుత్వ తీరుతో ప్రజలు ప్రశాంతంగా నిద్రించడం లేదు. పింఛను, రేషన్‌కార్డులు తొలగిస్తున్నారు. పంట నీట మునిగి రైతులు నష్టపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే వేధిస్తున్నారు. వారు వేదనను చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘గతేడాదికంటే ఈ ఏడాది రాష్ట్రంలో 63% నేరాలు పెరిగాయి. మానవమృగాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నా ఈ ముఖ్యమంత్రి నోరు మెదపరు’ అని మండిపడ్డారు. ‘గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద దంపతులు వివాహానికి వెళ్లి వస్తుంటే భర్త ఎదుటే భార్యపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కావలిలో ఇల్లు అద్దెకిస్తే ఇంటిని వైకాపా నేతలు వ్యభిచారగృహంగా మార్చారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, గద్దె రామ్మోహనరావు, ఏలూరు సాంబశివరావు, ఎమ్మెల్సీలు బీటీనాయుడు, అశోక్‌బాబు, నేతలు సుధాకర్‌యాదవ్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడమే కోడెల నైజమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో కోడెలకు ఆయన నివాళులర్పించారు. పల్నాడు ప్రజల గుండెల్లో కోడెల స్థానం పదిలమని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కోడెల స్వగ్రామం గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో ఆయన విగ్రహాన్ని మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అయన్నపాత్రుడు తదితరులు ఆవిష్కరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని