తితిదే బోర్డులో నేరస్థులు, అవినీతిపరులా?

ప్రధానాంశాలు

తితిదే బోర్డులో నేరస్థులు, అవినీతిపరులా?

అనర్హులు, కళంకితులను నియమించి ఆలయ ప్రతిష్ఠను కించపర్చారు
సీఎం జగన్‌కు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా.. రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో 81 మందితో తితిదే జంబో బోర్డు ఏర్పాటు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. భక్తిభావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన తితిదే బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్థులు, కళంకితులకు చోటు కల్పించారని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల్ని, అనర్హులను సభ్యులుగా నియమించి పవిత్రతను దెబ్బతీశారని, శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను కించపరిచారని దుయ్యబట్టారు. తక్షణమే దానిని రద్దు చేసి, సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని శుక్రవారం సీఎం జగన్‌కు రాసిన లేఖలో ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వామి వారిపై భక్తిభావంతో.. శ్రీవారి సేవలో తరించే వారికి ప్రాధాన్యమివ్వకుండా.. కొందరు వ్యక్తుల సేవలో మునిగే వారికి అవకాశమిచ్చారన్న అంశం సుస్పష్టం. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంతమందితో ఏర్పాటు చేయలేదు. పాలకమండలిని రాజకీయ నిరుద్యోగుల కేంద్రంగా మార్చారు’’ అని అన్నారు.

రెండేళ్లుగా దెబ్బతింటున్న పవిత్రత

‘‘గత రెండేళ్లుగా తిరుమల పవిత్రత, ప్రాశస్త్యం దెబ్బతింటోంది. తితిదే ఆస్తుల వేలానికి పూనుకున్నారు. తిరుపతి, తిరుమల బస్సు టికెట్లపై, స్విమ్స్‌ ఆసుపత్రిలో అన్యమత ప్రచారం చేశారు. వెబ్‌సైట్‌లో అన్యమత గేయాలు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ రాసలీలలు, భక్తుల తలనీలాల స్మగ్లింగ్‌, మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరించడం, లడ్డూ ప్రసాదం ధరలు పెంచడం, శ్రీవారి ప్రసాదాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపిణీ చేయడం వంటి అనేక అనైతిక చర్యలు చోటుచేసుకున్నాయి. తిరుగిరుల్లో డివైడర్లకు వైకాపా రంగులు వేశారు. వైకాపా నేతలు రాజకీయ ప్రచారం చేశారు.  డ్రోన్లు ఎగరేశారు. ర్యాలీలు నిర్వహించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచార సంప్రదాయాలతో పాటు తిరుమల పవిత్రత, ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కలియుగ దైవం ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి వస్తుంది...’’ అని లేఖలో చంద్రబాబు హెచ్చరించారు.

ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని