మిగులు జలాల వినియోగాన్ని లెక్కగట్టాల్సిందే

ప్రధానాంశాలు

మిగులు జలాల వినియోగాన్ని లెక్కగట్టాల్సిందే

కృష్ణా బోర్డు స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: వరద సమయంలో రాష్ట్రాలు మళ్లించే నీటిని కూడా నమోదు చేయాల్సిందేనని, ఇందుకు సంబంధించి కచ్చితమైన లెక్కలు ఉండాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్‌లో అన్ని రిజర్వాయర్లు నిండి వరద ప్రవాహం ఉన్నప్పుడు తీసుకొనే నీటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనగా.. ఎంత నీటిని తీసుకొన్నదీ నమోదు కావాల్సిందేనని తెలంగాణ పేర్కొంది. దీనిపై రెండు రాష్ట్రాలు, బోర్డు, కేంద్ర జలసంఘం మధ్య పరస్పర ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ నెల 1న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలోనూ చర్చించారు. ఈ సమావేశం మినిట్స్‌ మంగళవారం రెండు రాష్ట్రాలకు చేరాయి. అన్ని ప్రాజెక్టులు నిండిన తర్వాత వచ్చే వరద నీటి వినియోగాన్ని ఆంధ్రప్రదేశ్‌ వాడుకొనే 512, తెలంగాణ వాడుకొనే 299 టీఎంసీలతో కలిపి చూపాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. పైన ప్రాజెక్టులు నిండకపోయినా పులిచింతల, మున్నేరు, పాలేరు నుంచి వచ్చే నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేటప్పుడు ఈ నీటిని మళ్లించుకోవడానికి అనుమతించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ నీటిని మళ్లించి భారీ ప్రాజెక్టుల్లో నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందని.. తమ రాష్ట్రం ఎత్తిపోతల ద్వారా తీసుకోవాల్సిందేనని, ఎంత నీటిని మళ్లించేది లెక్క ఉండాల్సిందేనని తెలంగాణ పట్టుబట్టింది. దీనిపై చర్చించిన తర్వాత మిగులు జలాల వినియోగాన్ని లెక్కగట్టాల్సిందేనని బోర్డు నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని