CM Jagan: నన్నూ, నా తల్లినీ తిడుతున్నారు..

ప్రధానాంశాలు

CM Jagan: నన్నూ, నా తల్లినీ తిడుతున్నారు..

పరుష పదాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు  
డ్రగ్స్‌ విషయంలో అబద్ధాలతో రాష్ట్రం పరువు తీస్తున్నారు
పోలీసులకు వారాంతపు సెలవుల పునరుద్ధరణ
పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా పరుష పదజాలంతో దూషిస్తున్నారని.. నన్ను, మా అమ్మను ఉద్దేశించి తిడుతున్నారని.. ఇలాంటివి ఇప్పుడే చూస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి పనులు చేయడం సరైందేనా? దీని వల్ల రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని ఆరాటపడటం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు. మారుతున్న కాలానికి తగ్గట్లుగా నేరాలు కూడా కొత్త రూపం సంతరించుకుంటున్నాయని, గత రెండున్నరేళ్లలో కొత్త నేరస్థులను రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. రాజకీయ నాయకులుగా రూపుమార్చుకుంటున్న అసాంఘిక శక్తులను మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇటువంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అధికారం దక్కలేదన్న అక్కసుతో చీకట్లో విగ్రహాలను, రథాలను ధ్వంసం చేస్తున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. చివరకు రాష్ట్రం పరువు ప్రతిష్ఠలు దిగజార్చేలా డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ మాట్లాడుతున్నారు. రోజూ అబద్ధాలు చెబుతూ మన రాష్ట్రం, మన పిల్లలకు కళంకాన్ని తీసుకొస్తున్నారు. వీరు టార్గెట్‌ చేస్తోంది.. నన్ను, ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ఇది ఏపీలోని ప్రతి కుటుంబంపై చేస్తున్న దాడి. మన పిల్లలను మాదకద్రవ్యాలకు బానిసలుగా ప్రపంచానికి చూపిస్తున్నారు. పట్టుబడిన మాదకద్రవ్యాలతో మన రాష్ట్రానికి సంబంధం లేదని సాక్షాత్తు డీఆర్‌ఐ, విజయవాడ సీపీ వివరణ ఇచ్చినా, డీజీపీ పదే పదే చెప్పినా.. నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీపడకూడదన్నారు. పౌరుల రక్షణ, భద్రత విషయంలో పోలీసులు అత్యధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. హింసాత్మక ఘటనలకు కారకులను ఉపేక్షించొద్దని.. ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆయన ఆదేశించారు.

రూ.15 కోట్ల సంక్షేమ బకాయిలు విడుదల

కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్నందున పోలీసులు తమ కుటుంబంతో గడిపేందుకు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్‌) విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని సీఎం చెప్పారు. ‘గత ప్రభుత్వం ఆపిన రూ.15 కోట్ల సంక్షేమ బకాయిలను విడుదల చేస్తున్నాం. పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. కొవిడ్‌ కారణంగా మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఇచ్చే రూ.5 లక్షలకు తోడు మరో రూ.5 లక్షలను ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా కలిపి మొత్తం రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాల ప్రక్రియను నవంబరు 30 నాటికి పూర్తి చేస్తాం’ అని వివరించారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పోలీసుల శ్రమను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని, అన్ని అధికారాలు దఖలు పరిచారని వివరించారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌, దిశ చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. ఏడాది కాలంగా దేశంలో 377 మంది, రాష్ట్రంలో 11 మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు. ప్రజల రక్షణ కోసం ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. వారాంతపు సెలవుల విధానాన్ని పునరుద్ధరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

అమరులకు అంజలి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కొవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల వివరాలతో ప్రచురించిన
‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.   కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, సీఎస్‌ సమీర్‌ శర్మ, పలువురు ఐపీఎస్‌     అధికారులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని