భూమి పుత్రుడు.. అనితర ‘సేద్యుడు’

ప్రధానాంశాలు

భూమి పుత్రుడు.. అనితర ‘సేద్యుడు’

  ఆదాయం కన్నా ఆరోగ్యమే మిన్ననే భావన

  ఆదర్శంగా యువరైతు సేంద్రియ వ్యవసాయం

ఈనాడు డిజిటల్‌- రాజమహేంద్రవరం

తన ఈడు వాళ్లంతా బహుళజాతి కంపెనీల్లో రూ.లక్షల జీతాలకు ఉద్యోగాలు చేస్తుంటే.. ఆయన మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై ప్రముఖ ప్రైవేట్‌ సంస్థల్లో అవకాశాలు వచ్చినా... పొలం మీద ప్రేమతో హలం పట్టారు. గోఆధారిత ప్రకృతి సేద్యం చేస్తూ సొంత మార్కెటింగ్‌తో లాభాలు ఆర్జిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా గోకవరం యువకుడు అనంత్మాకుల వెంకట నరసింగరావు(31) దేెహ్రాదూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలింగ్‌లో జియోసైన్సు ఇంజినీరింగ్‌ ప్రథమశ్రేణిలో పాసయ్యారు. చిన్ననాటి నుంచి పాడిపంటల మీదున్న మక్కువతో చదువయ్యాక సొంతూరు వచ్చారు. సుభాష్‌పాలేకర్‌ గోఆధారిత ప్రకృతి వ్యవసాయంతో స్ఫూర్తి పొందారు. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులు మొదట్లో అభ్యంతరం చెప్పినా... నరసింగరావు ఆసక్తిని గమనించి సరేనన్నారు. తొలుత మూడెకరాలతో ప్రారంభించారు. ప్రస్తుతం వారికున్న ఎనిమిది ఎకరాలకు అదనంగా 13 ఎకరాలు కౌలుకు తీసుకొని నాలుగేళ్లుగా ఈ తరహా వ్యవసాయం చేస్తున్నారు. కాలాబట్టి, నవారా, కొల్లాకర్‌, విష్ణుభోగి, ఇంద్రాణి, నారాయణకామి, కూజీపడాలియా, మైసూర్‌ మల్లిక, సిద్ధసన్నాలు వంటి తొమ్మిది రకాల దేశీయ వరి వంగడాలను సాగుచేస్తున్నారు. మామిడి, జీడిమామిడి పెంచుతున్నారు.

గో ఉత్పత్తులే ఎరువు

రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా.. ఆవు నుంచి వచ్చే పేడ, పాలు, పెరుగు, నెయ్యి, ఆకులు, వివిధ పదార్థాలతో తయారు చేస్తున్న... ద్రవ, ఘనజీవామృతాలు, నీమాస్త్రం, పంచగవ్య, పుల్లటి మజ్జిగ, ఇతర కషాయాలను పొలాల్లో జల్లుతున్నారు. దీనివల్ల పైర్లలో వ్యాధి నిరోధకత పెరిగి... తెగుళ్లు, చీడపీడలను తట్టుకోగలుగుతున్నాయి. సాలు(లైన్‌సోయింగ్‌) పద్ధతిలో వరి నాట్లు వేయడంతో తెల్లదోమ నుంచి రక్షణ లభించింది. ప్రకృతి వ్యవసాయంతో మిత్ర కీటకాలకు హాని జరగదు. జీవవైవిధ్యం దెబ్బతినదు. నీటి వినియోగంతోపాటు ఎరువులు, పురుగుమందులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఇలా పండించిన ఆహారం తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌, అల్సర్‌, స్థూలకాయం తదితర సమస్యలు దరిచేరవు.

మార్కెటింగ్‌ మెలకువలతో లాభాలు

దేశీయ వరి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. వీటిని నరసింగరావే స్వయంగా మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. వడ్లను మరపట్టించి 25 కిలోల బస్తాలు చేయిస్తున్నారు. స్థానికంగా తనకు తెలిసిన వారు, ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడలలోని ఆర్గానిక్‌ స్టోర్లకు పంపుతున్నారు. కాలాబట్టి కిలోకు రూ.120, నవారా రూ.100, కొల్లాకర్‌ రూ.100, విష్ణుభోగి రూ.100, కూజీపటాలియా రూ.80 చొప్పున ధర పలుకుతున్నాయి. ఆర్గానిక్‌ మామిడిని హైదరాబాద్‌కు లారీల్లో పంపి కిలో రూ.80 చొప్పున విక్రయించారు.


తోటి రైతులకు ప్రోత్సాహం

సేంద్రియ వ్యవసాయం చేసే వారి సంఖ్య గోకవరం ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వీరికి మార్కెటింగ్‌లో నరసింగరావు సహకరిస్తున్నారు. సేంద్రియ రైతుల కోసం ‘భువిజ గ్లోబల్‌’ అనే రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయం ఆదాయం కోసమే కాదు.. ప్రకృతి ఆరోగ్యం, మన ఆరోగ్యం కోసమని నరసింగరావు అంటున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని